కొత్త ప్రాజెక్టులు కష్టమే!
- పాత వాటికే పెద్ద పీట
- నేడు పార్లమెంటులో రైల్వే బడ్జెట్
- డీజిల్ ధరలు తగ్గినా చార్జీలు తగ్గవు.. పెంచే అవకాశాలూ ఉన్నాయ్
- పస్తుత ప్రాజెక్టులను పూర్తిచేయడానికే రూ. 1.82 లక్షల కోట్లు అవసరం
- ఇక కొత్తగా ప్రాజెక్టులు, కొత్త రైళ్ల ప్రకటనపై ఆచితూచి అడుగులు
- 2015-16 సంవత్సరానికి సురేశ్ ప్రభు రైల్వే బడ్జెట్‌పై అంచనాలివీ
న్యూఢిల్లీ: రైల్వే విభాగం ఆర్థికంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో.. రైల్వే బడ్జెట్‌లో ప్రయాణ చార్జీలు, సరుకు రవాణా చార్జీలను పెంచుతారా? కొత్త ప్రాజెక్టులు ప్రకటిస్తారా లేక పాత వాటికే ప్రాధాన్యమిస్తారా? అనే అంశాలపై ఇప్పుడు అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. రైల్వేమంత్రి సురేశ్ ప్రభు గురువారం ఉదయం పార్లమెంటులో 2015-16 ఆర్థిక సంవత్సర రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇందులో ‘మేక్ ఇన్ ఇండియా’ చర్యలతో పాటు రైల్వేల్లో భద్రతా ప్రమాణాలను పెంచే ప్రతిపాదనలు ఉంటాయని భావిస్తున్నారు. సరుకు రవాణా చార్జీలతో వచ్చే ఆదాయం నుంచి రూ. 24,000 కోట్ల నిధులను.. ప్రయా ణ చార్జీల్లో వస్తున్న నష్టాన్ని భర్తీ చేసేం దుకు వినియోగిస్తున్న పరిస్థితుల్లో.. దీనిని తగ్గించేం దుకు ప్రభు కత్తి మీద సాము చేయా ల్సి ఉంటుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
డీజిల్ ధరలు తగ్గినా.. చార్జీలు తగ్గించరు!
2012-13 సంవత్సరం వరకూ పదేళ్ల పాటు రైల్వే చార్జీలను పెంచలేదు. ఆ ఏడాది నాటి రైల్వేమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నేత దినేష్‌త్రివేది అన్ని తరగతుల ప్రయాణ చార్జీలనూ పెంచారు. అయితే.. సొంత పార్టీ నుంచి కూడా వ్యతిరేకత రావడంతో రెండో తరగతి, స్లీపర్ క్లాస్ చార్జీల పెంపును ఉపసంహరించాల్సి వచ్చింది. ఆ తర్వాతా ప్రయాణ చార్జీలు పెరిగాయి. గత ఏడాది జూలైలో మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి రైల్వే బడ్జెట్‌లో ప్రయాణ చార్జీలను 14.2 శాతం, సరుకు రవాణా చార్జీలను 6.5 శాతం పెంచారు. డీజిల్ ధరలు తగ్గిపోయినప్పటికీ.. రైల్వే చార్జీలను తగ్గించే అవకాశం లేదని రైల్వే సహాయమంత్రి మనోజ్‌సిన్హా ఇప్పటికే స్పష్టంచేశారు. వాస్తవానికి రైల్వే విభాగం 2013 నుంచి ఇంధన సర్దుబాటు వ్యయం(ఎఫ్‌ఏసీ) ఆధారంగా చార్జీలను సవరించే విధానాన్ని అనుసరిస్తోంది. ప్రస్తుతం డీజిల్ ధరలు తగ్గినప్పటికీ.. విద్యుత్ ధర నాలుగు శాతం పైగా పెరిగిందని.. కాబట్టి చార్జీలను తగ్గించే అవకాశం లేదని చెప్తున్నారు.
ప్రాజెక్టుల పూర్తి కోసం ప్రైవేట్‌కు బాట?
ఇదిలావుంటే.. రైల్వే ఆమోదించిన మొత్తం ప్రాజెక్టులు 676 ఉన్నాయి. వీటి విలువ రూ. 1,57,883 కోట్లు. వీటిలో 317 ప్రాజెక్టులను మాత్రమే పూర్తిచేయగలిగారు. మిగతా 359 ప్రాజెక్టులను పూర్తిచేయాలంటే ఇప్పుడు రూ. 1,82,000 కోట్లు అవసరం. కీలకమైన ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు భారీగా నిధుల ప్రవాహం అవసరమైన నేపధ్యంలో.. సంస్కరణ వాదిగా చెప్పే సురేశ్ ప్రభు.. ప్రభుత్వ రంగ రవాణా సంస్థ అయిన రైల్వేల్లోకి ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానించేందుకు రోడ్ మ్యాప్ ప్రకటించే అవకాశముంది. అలాగే భారీగా నిధుల కొరత ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో కొత్త రైళ్లు, కొత్త ప్రాజెక్టులను ప్రకటించే విషయంలోనూ రైల్వేమంత్రి ఆచితూచి అడుగువేస్తారని చెప్తున్నారు. వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాజెక్టులు.. పూర్తికావచ్చిన కొత్త లైన్లు, డబ్లింగ్, విద్యుదీకరణ ప్రాజెక్టులకు మాత్రమే నిధులు కేటాయించవచ్చని తెలుస్తోంది.
రానున్న 2015-16కు కేంద్రం నుంచిరూ. 50,000 కోట్ల మేర బడ్జెటరీ మద్దతు కోరిన రైల్వేశాఖ.. రైల్వే భద్రత నిధి కింద మరో రూ. 20,000 కోట్లు కేటాయించాలని కేంద్ర ఆర్థికశాఖకు విజ్ఞప్తిచేసింది. రైల్వే ప్రమాదాలకు ప్రధాన కారణంగా ఉన్న మానవరహిత లెవల్ క్రాసింగ్‌లను తొలగించేందుకు ఈ నిధులు ఉపయోగిస్తామని చెప్తోంది. అలాగే.. రైల్వేల ఆదాయ వనరులను పెంచుకునేందుకు.. చార్జీలు కాకుండా కొత్త మార్గాలను అన్వేషించేందుకు ప్రభు ప్రయత్నిస్తారని తెలుస్తోంది. వాణిజ్యప్రకటనల నుంచి ఆదాయాన్ని పెంచుకోవటం, అదనపు భూమిని వినియోగించుకోవటం తదితరాలు ఉంటాయని చెప్తున్నారు.
‘బుల్లెట్ రైలు’కు ప్రాధాన్యం...
దేశంలో బుల్లెట్ రైళ్లను ప్రవేశపెడతామన్న ఎన్‌డీఏ సర్కారు హామీకి అనుగుణంగా.. ముంబై-అహ్మదాబాద్‌ల మధ్య తలపెట్టిన హైస్పీడ్ రైలు ప్రాజెక్టు, ప్రతిపాదిత వజ్ర చతుర్భుజి మార్గంలో సర్వే కార్యక్రమాలపై సురేష్‌ప్రభు ప్రకటనలు చేసే అవకాశముంది. రైలు బోగీలోని క్రాంక్ షాఫ్టులు, ఆల్టర్నేటర్లు, ఫోర్జ్‌డ్ వీల్స్ వంటి చాలా పరికరాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవటానికి బదులుగా.. ‘మేక్ ఇన్ ఇండియా’ పథకంలో భాగంగా దేశంలోనే తయారు చేసేందుకు చర్యలు ప్రకటించవచ్చు. అలాగే.. ప్రయాణికుల సౌకర్యార్థం 100 రైళ్లలో పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటు చేయటం, దాదాపు 100 రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి, రైల్వే స్టేషన్లలో సౌకర్యాల పెంపు, ఇంటర్-సిటీ సర్వీసుల్లో ఏసీ బోగీల ఏర్పాటు, ఏసీ డెము రైళ్లను ప్రవేశపెట్టటం వంటి పలు చర్యలు ఉంటాయని చెప్తున్నారు.
ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి: ప్రభు
రైల్వేలు కష్ట కాలం ఎదుర్కొంటున్నప్పటికీ.. ఎన్‌డీఏ ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న ఆకాంక్షలను నెరవేర్చేందుకు శాయశక్తులా కృషిచేస్తున్నామని రైల్వేమంత్రి సురేశ్ ప్రభు పేర్కొన్నారు. రైల్వే బడ్జెట్‌కు తుది మెరుగులు దిద్దుతున్న మంత్రి బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీలు, రాష్ట్ర ప్రభుత్వాలతో సహా వివిధ వర్గాల నుంచి కొత్త రైళ్లు, కొత్త లైన్లు, కొత్త ప్రాజెక్టుల కోసం డిమాండ్లు ఉన్నాయని పేర్కొన్నారు. రైల్వేబడ్జెట్‌ను ఖరారు చేసే ముందు ఆయన పారిశ్రామిక ప్రతినిధులతో కూడా సమావేశమయ్యారు.