31 నుంచే బడ్జెట్ సమావేశాలు
ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టాలని సీసీపీఏ సిఫారసు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈనెల 31 నుంచే ప్రారంభించాలని, ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశ పెట్టాలని పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీఏ) సిఫారసు చేసింది. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన మంగళవారం జరిగిన సీసీపీఏ సమావేశం ఈమేరకు నిర్ణయం తీసుకుంది. దీన్ని త్వరలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపనున్నారు. ఈ సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదం లభిస్తే రైల్వేకు కేటాయింపులతో సహా సాధారణ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు.
దాదాపు 92 ఏళ్లుగా రైల్వే బడ్జెట్‌ను విడిగా ప్రవేశపెడుతున్న సంప్రదాయానికి ఈ బడ్జెట్‌తో మంగళం పలకనున్నారు. జనవరి 31న పార్లమెంటు సమావేశాల ప్రారంభంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదే రోజు ఆర్థిక మంత్రి ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. బడ్జెట్ తొలి విడత సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే 2017–18 ఆర్థిక సంవత్సరానికి గాను వివిధ పథకాలకు త్వరితగతిన కేటాయింపులు చేసేందుకు వీలుగా దాదాపు నాలుగు వారాలు ముందుగానే బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది.