ఖర్గే కానిచ్చేశాడు.. మనవి అటకెక్కించారు | Karnataka granted to prepare for the production of rail coach factory | Sakshi
Sakshi News home page

ఖర్గే కానిచ్చేశాడు.. మనవి అటకెక్కించారు

Published Wed, Feb 3 2016 7:18 AM | Last Updated on Sun, Sep 3 2017 4:49 PM

ఖర్గే కానిచ్చేశాడు.. మనవి అటకెక్కించారు

ఖర్గే కానిచ్చేశాడు.. మనవి అటకెక్కించారు

♦ కర్ణాటకకు మంజూరైన రైలు బోగీ ఫ్యాక్టరీ ఉత్పత్తికి సిద్ధం
♦ ఆరేళ్లు దాటినా పునాదిరాయి పడని కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీ
♦ కర్నూలుకు రెండు వర్క్‌షాపులు మంజూరైనా ఫలితం శూన్యం
♦ కేంద్రంపై ఒత్తిడి తేలేకపోతున్న తెలుగు రాష్ట్రాలు
 
 సాక్షి, హైదరాబాద్: రైల్వే ప్రాజెక్టు ప్రకటన... చకచకా నిధుల విడుదల.. సకాలంలో పనులు పూర్తి.. ఉత్పత్తి ప్రారంభం.. కేవలం రెండేళ్ల పరిణామక్రమమిది.పోరాటం ఫలితంగా ఓ ప్రాజెక్టు మంజూరు.. ఆరేళ్లు గడిచినా అతీగతీ లేని పనులు.. అసలు ఆ ప్రాజెక్టు ఉంటుందో ఊడుతుందో తెలియని అయోమయం.

 మొదటిది కర్ణాటకలోని యాద్గిర్ వద్ద బడియాల్ గ్రామంలో రైలు బోగీ ఫ్రేములు తయారయ్యే ఫియెట్ బోగీ యూనిట్ పరిస్థితి. రెండోది వరంగల్ జిల్లా కాజీపేటకు మంజూరైన వ్యాగన్ ఫ్యాక్టరీ దుస్థితి. రెంటికి ఎంత తేడా... ‘వడ్డించేవాడు మనవాడైతే’ తరహాలో కర్ణాటక ఆ ప్రాజెక్టును సిద్ధం చేసుకుంటే... తెలంగాణ ప్రభుత్వ ఒత్తిడి లేకపోవడంతో చేతికందిన ప్రాజెక్టును కోల్పోయే పరిస్థితి. మరో రైల్వే బడ్జెట్ పట్టాలెక్కేందుకు సిద్ధమవుతున్న తరుణంలోనూ తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు మంజూరైన ప్రాజెక్టుల విషయంలో రెండు రాష్ట్రాలూ కేంద్రంపై ఒత్తిడి తేలేకపోతున్నాయి.

మంజూరైన ప్రాజెక్టుల ఊసే లేని సమయంలో కొత్త ప్రాజెక్టుల రాక దాదాపు అసాధ్యమే. ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోనున్నాయి. కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే రైల్వే మంత్రిగా ఉండగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతానికి భారీ రైల్వే ప్రాజెక్టు సాధించాలని భావించారు. వెంటనే 2014 రైల్వే బడ్జెట్‌లో యాద్గిర్ ప్రాంతానికి రైల్వే ఫియెట్ బోగీ తయారీ ఫ్యాక్టరీని మంజూరు చేశారు. రూ.750 కోట్లతో పనులు మొదలుపెట్టారు. ఇప్పుడవి పూర్తికావచ్చాయి. జూన్‌లో ఉత్పత్తి మొదలుకానుంది. ఆ యూని ట్‌లో పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారు పేర్లు ఇవ్వాలంటూ రైల్వే బోర్డు నుంచి అన్ని జోన్లకు సర్క్యులర్ వెళ్లింది. ఏడాదికి 600 బోగీ ఫ్రేములు ఇక్కడ తయారు కానున్నాయి. వేలమందికి ఉపాధి దొరకనుంది.

 అంతా డోలాయమానం
 కాజీపేటకు మూడు దశాబ్దాల క్రితమే కోచ్ ఫ్యాక్టరీ మంజూరైంది. రాజకీయ పరిణామాలతో దాన్ని రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉండగా పంజాబ్‌లోని కపుర్తలాకు మార్చారు. దాని స్థానంలో ఆరేళ్ల క్రితం కాజీపేటకు వ్యాగన్ ఫ్యాక్టరీ మంజూరు చేశారు. దానికి సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వలేదనే కారణంతో పనులకు శ్రీకారమే చుట్టలేదు. ఇటీవల దాన్ని కూడా రద్దు చేసి వ్యాగన్ మరమ్మతు వర్క్‌షాపుగా మార్చాలనే నిర్ణయానికి రైల్వే బోర్డు వచ్చినట్టు తెలిసింది. తుదకు అది కూడా మంజూరవుతుందనే నమ్మకం లేకుండాపోయింది. సికింద్రాబాద్ లాలాగూడలో ఉన్న 300 పడకల రైల్వే ఆసుపత్రికి అనుబంధంగా మౌలాలీలో మెడికల్ కళాశాల మంజూరై నాలుగేళ్ల క్రితం బడ్జెట్‌లో చోటు దక్కించుకున్నా ఇప్పటి వరకు దాని ఊసేలేదు. ఇప్పుడు దాని అవసరం లేదని రైల్వే బోర్డు భావిస్తోందట. దీంతోపాటు సికింద్రాబాద్‌లో ‘సెంట్రలైజ్డ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది ఫైనాన్స్ ఆఫీసర్స్’ పేరుతో అధికారుల శిక్షణ కేంద్రం మంజూరైనా అది కూడా అతీగతీ లేదు.
 
 ‘సహాయ మంత్రి’కి మొండిచేయి
  రైల్వే మంత్రిగానో, సహాయ మంత్రిగానో ఉన్నవారు వారి ప్రాంతానికి ప్రాజెక్టులు మంజూరు చేయించుకోవటం సహజం. ఇదే పంథాలో కర్నూలుకు రైల్వే సహాయమంత్రి హోదాలో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి రెండు ప్రాజెక్టులు మంజూరు చేయించారు. జీవితకాలం పూర్తి కాకుండా పాడయ్యే కోచులను బాగు చేసే ‘కోచ్ మిడ్‌లైఫ్ రిహాబిలిటేషన్ వర్క్‌షాపు’, డెమూ రైలు బోగీలను మరమ్మతు చేసే మరో వర్క్‌షాపును 2013లో మంజూరు చేయించారు. వీటికి భూమినీ సిద్ధం చేశారు. కానీ వెంటనే పనులు మొదలు పెట్టించలేకపోయారు. యూపీయే స్థానంలో ఎన్డీయే అధికారంరోకి రావటంతో అవి కాస్తా అటకెక్కాయి. రైల్ నీరు తయారయ్యే ఫ్యాక్టరీ విజయవాడకు మంజూరై మూడేళ్లవుతున్నా అది కూడా అంతే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement