సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ నిరీక్షణ అనంతరం కాజీపేటకు ప్రతిష్టాత్మక రైల్వే ప్రాజెక్టు రాబోతోంది. కాజీపేటలో వ్యాగన్ పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్‌కు బదులుగా నేరుగా వ్యాగన్ల తయారీ ప్రాజెక్టునే రైల్వే ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి రైల్వే పరోక్షంగా స్పష్టతనిచ్చింది. కాజీపేటలో ఏర్పాటు చేయనున్న వ్యాగన్ తయారీ ఫ్యాక్టరీలో తొలి ఏడాది 1200 వ్యాగన్లను తయారు చేస్తామని.. తర్వాత ఈ సామర్థ్యాన్ని 2400కు పెంచుతామని శనివారం రైల్వే అధికారులు వెల్లడించారు.
మొత్తంగా మూడు దశాబ్దాల కింద కాజీపేటకు మంజూరై.. ఇతర రాష్ట్రాలకు తరలిపోయిన కోచ్ ఫ్యాక్టరీ స్థానంలో వ్యాగన్ ఫ్యాక్టరీ వస్తుండటం గమనార్హం. ఇప్పటివరకు దేశంలో రైలు వ్యాగన్లు తయారు చేసేందుకు రైల్వేకు పశ్చిమ బెంగాల్‌లో ఒక్క సొంత యూనిట్ మాత్రమే ఉండగా.. కాజీపేటలో రెండోది ఏర్పాటుకానుంది. కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించి ‘సాక్షి’ఫిబ్రవరి నెలలోనే కథనం ప్రచురించింది కూడా.
ఏడాదిన్నరలో ఉత్పత్తి ప్రారంభం
కాజీపేట సమీపంలోని మడికొండలో శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయానికి చెందిన 160 ఎకరాల స్థలంలో వ్యాగన్ ఫ్యాక్టరీని నిర్మించనున్నారు. తొలుత ఇక్కడ రూ.269 కోట్లతో ఓవర్ హాలింగ్ వర్క్‌షాప్‌ను నిర్మించాలని నిర్ణయించి.. రైల్వే అనుబంధ సంస్థ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో గతేడాది టెండర్లు పిలిచారు. మాదాపూర్‌కు చెందిన పవర్ మెక్–టైకిషా జెవీ అనే సంస్థ రూ.361.79 కోట్లకు టెండర్ దక్కించుకుంది.
ఇప్పుడా ప్రాజెక్టు వ్యాగన్ ఫ్యాక్టరీగా మారిన నేపథ్యంలో.. అదే సంస్థ పనులు చేపట్టనుందని సమాచారం. ఈ నెల ఎనిమిదిన ప్రధాని మోదీ వ్యాగన్ ఫ్యాక్టరీని అధికారికంగా ప్రకటించి, శంకుస్థాపన చేయనున్నరని అధికారులు చెప్తున్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి వ్యాగన్ల ఉత్పత్తి ప్రారంభం అవుతుందని అంటున్నారు.
విమర్శలకు కౌంటర్‌గా..
ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కాజీపేటలో వ్యాగన్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్ ఏర్పాటుకోసం రూ.160 కోట్లు కేటాయించారు. కానీ తర్వాత రాజకీయంగా వస్తున్న విమర్శలను కౌంటర్ చేసేలా కాజీపేట యూనిట్‌ను వాగన్ ఫ్యాక్టరీగా మార్చాలని కేంద్రం నిర్ణయించింది.
ఈ యూనిట్ వల్ల 2వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. యూనిట్‌ను ఫ్యాక్టరీగా మార్చినందున కొత్తగా గ్యాంగ్ డ్రిల్లింగ్ యంత్రం, షీరింగ్ యంత్రం, బెంచ్ ప్రెస్, యూనివర్సల్ అండర్ ఫ్రేమ్ వెల్డింగ్ మ్యానిప్యులేటర్స్, స్ట్రైటెనింగ్ యంత్రం, హుక్ బోల్టింగ్ యంత్రం వంటి పరికరాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment