వరంగల్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రపంచంలో ఐదో పెద్ద ఆర్థిక శక్తిగా భారత్ ఎదగడంలో తెలంగాణ పాత్ర ఉందని.. తెలంగాణ కొత్త రాష్ట్రమే అయినా దేశ చరిత్రలో దీని పాత్ర చాలా కీలకమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తెలుగు ప్రజల సామర్థ్యంతో దేశ సామర్థ్యం పెరిగిందని చెప్పారు. గత తొమ్మిదేళ్లలో తెలంగాణ అభివృద్ధికి, రవాణా సదుపాయాలు పెంచడానికి కేంద్రం పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించిందన్నారు.
మేకిన్ ఇండియాలో భాగంగా కాజీపేటలో వ్యాగన్ తయారీ ఫ్యాక్టరీని.. సబ్‌కా సాథ్ సబ్ కా వికాస్‌ను అనుసరిస్తూ హైవేలు, ఇతర అభివృద్ధి పనులను చేపట్టామని తెలిపారు. శనివారం వరంగల్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ.. రూ.6,109 కోట్ల విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో రూ.5,500 కోట్లకుపైగా ఖర్చయ్యే జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ పనులు.. కాజీపేటలో తలపెట్టిన రైల్వే వ్యాగన్ తయారీ ఫ్యాక్టరీ ఉన్నాయి. ఈ సందర్భంగా విడిగా ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘పెట్టుబడులకు, ఎదుగుదల అవకాశాలకు భారతదేశం పెట్టింది పేరుగా మారింది. 21వ శతాబ్దపు మూడో దశాబ్దం స్వర్ణ సమయంగా మారింది. ప్రస్తుత కాలం యువ భారత్‌కు గోల్డెన్ పీరియడ్. ప్రతి సెకన్‌ను సద్వినియోగం చేసుకో వాలి. వేగంగా సాగుతున్న అభివృద్ధిలో దేశంలోని ఏ ప్రాంతాన్నీ వదలకుండా ముందుకు తీసుకెళ్తాం. సరి కొత్త లక్ష్యాల సాధన కోసం కొత్త మార్గాలు కనుక్కో వాలి.
అప్పుడే దేశ అభి వృద్ధి వేగం పుంజుకుంటుంది. ఇప్పుడున్న మౌలిక వసతు లతో ఇది అసాధ్యం కాబట్టే.. కొత్త మౌలిక సదుపాయాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. అందుకే ఎక్స్‌ప్రెస్ హైవే లు, పారిశ్రామిక కారిడార్లు, ఆర్థిక కారిడార్లను, జాతీయ రహదారు ల విస్తరణను చేపట్టి.. రవాణా వ్యవస్థను పటిష్టం చేస్తున్నాం.
చదవండి: స్వాగతానికి అధికారులు మాత్రమే!
ఆర్థిక కార్యకలాపాల కేంద్రంగా తెలంగాణ
తెలంగాణలో జాతీయ రహదారుల నెట్‌వర్క్ గతంలో 2,500 కిలోమీటర్లే ఉండగా.. ఇప్పుడు 5 వేల కిలోమీటర్లకుపైగా పెరి గింది. మరో 2,500 కిలోమీటర్ల జాతీయ రహదారులు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. భారత్ మాల ప్రాజెక్టులో భాగంగా డజన్ల కొద్దీ కారిడార్లు నిర్మాణంలో ఉన్నాయి. వాటిలో కొన్ని తెలంగాణ మీదుగా వెళుతున్నాయి. హైదరాబాద్ – ఇండోర్ ఆర్థిక కారిడార్, చెన్నై – సూరత్ ఆర్థిక కారిడార్, హైదరాబాద్ – పనాజీ ఆర్థిక కారిడార్, హైదరాబాద్ – విశాఖపట్నం ఇంటర్ కారిడార్ ఆ కోవలోనివే. ఒక విధంగా తెలంగాణ చుట్టు పక్కల ఉన్న అనేక ఆర్థిక ప్రాంతాలకు, ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర స్థానంగా తయారవుతోంది.
ఈ హైవేలతో ఎంతో ప్రయోజనం
ఇప్పుడు శంకుస్థాపన చేసిన నాగ్‌పూర్ – విజయ వాడ కారిడార్‌లోని మంచిర్యాల–వరంగల్ సెక్షన్ నిర్మాణంతో.. తెలంగాణకు అటు మహారాష్ట్రతో, ఇటు ఏపీతో మెరుగైన అనుసంధానాన్ని కలిగిస్తుంది. మంచిర్యాల–వరంగల్ మధ్య దూరం తగ్గి ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడుతుంది. కరీంనగర్–వరంగల్ సెక్షన్‌ను నాలుగు లేన్ల రహదారిగా మార్చటం వలన హైదరాబాద్ – వరంగల్ పారిశ్రామిక కారిడార్, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, వరంగల్ ఎస్‌ఈజెడ్ వంటివి ఎక్కువగా లబ్ధి పొందుతాయి. వ్యవసాయం, పరిశ్రమలతోపాటు కరీంనగర్ జిల్లా లోని గ్రానైట్ పరిశ్రమకూ ప్రయోజనం ఉంటుంది. యువతకు ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశా లు కూడా పెరుగుతాయి. కనెక్టివిటీ పెర గడం వల్ల పర్యాటక రంగం కూడా లబ్ధి పొందుతుంది.
భద్రకాళి ఆలయంలో మోదీ పూజలు
వరంగల్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ.. మామునూరు ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని చేరుకున్నారు. అర్చకులు, అధికారులు ప్రధానికి మేళతాళాలతో పూర్ణ కుంభ స్వాగతం పలికారు. మోదీ గోశాలలో ఆవులకు గ్రాసం తినిపించి, ధ్వజస్తంభం వద్ద జ్యోతి వెలిగించారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రధానార్చకులు భద్రకాళి శేషు.. అమ్మవారి శేషవస్త్రంతో మోదీని సత్కరించారు. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనం చాలా బాగా అనిపించిందని ప్రధాని పేర్కొన్నారు.
మేకిన్ ఇండియా.. ఓ ఉద్యమం..
మేకిన్ ఇండియా ఒక ఉద్యమం. పీఎల్‌ఐ పథకంతో దేశంలో తయారీ రంగానికి ఎంతో ప్రోత్సా హం లభించింది. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. తెలంగాణలోనూ ఈ పథకం కింద 50కిపైగా పెద్ద సంస్థలు లబ్ధిపొందుతున్నాయి. దేశం ఈ ఏడాది రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతిలో రికార్డు సృష్టించింది. తొమ్మిదేళ్ల కింద రూ.1,000 కోట్లుగా ఉన్న రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతులు ఇప్పుడు రూ.16 వేల కోట్లు దాటాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) ఇలా ఎగుమతులు చేసిన సంస్థల్లో ఉంది.
తయారీ రంగంలో భారత రైల్వే కూడా సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. మేడిన్ ఇండియా వందే భారత్ రైళ్లు పట్టాలెక్కాయి. కాజీపేటలో ఈరోజు శంకుస్థాపన చేసిన రైల్వే తయారీ యూనిట్ మేకిన్ ఇండియాకు కొత్త జీవం పోస్తుంది. దీనితో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వస్తాయి. ఈ ప్రాంతంలోని ప్రతి కుటుంబమూ ఏదో ఒక విధంగా లబ్ధి పొందుతుంది. అభివృద్ధి మంత్రంలో తెలంగాణ ప్రజలు భాగస్వాములు కావాలి..’’ అని ప్రధాని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జి.కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment