బడ్జెట్ బండి.. ఆగలేదండి! | no new projects for telangna in railwa budget | Sakshi
Sakshi News home page

బడ్జెట్ బండి.. ఆగలేదండి!

Published Fri, Feb 26 2016 2:43 AM | Last Updated on Sun, Sep 3 2017 6:25 PM

కొత్త రైలు ఒక్కటీ లేదు.. ఒక్క భారీ ప్రాజెక్టు రాలేదు.. పెద్ద స్టేషన్లకు కొత్త రూపునిచ్చే ప్రయత్నం లేదు..

రాష్ట్రానికి ఒక్క రైలు లేదు.. కొత్త ప్రాజెక్టుల ఊసు లేదు
* పాత ప్రాజెక్టులకు అత్తెసరు నిధులతో సరి
* మరోసారి మొండిచేయి చూపిన రైల్వేశాఖ
* కాజీపేటలో వ్యాగన్ వర్క్‌షాపునకు ఓకే
* యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పొడిగింపు
* సికింద్రాబాద్‌పై ఒత్తిడి తగ్గించేందుకు చర్లపల్లిలో రైల్ టెర్మినల్
* ఇవి మినహా రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు
* కాజీపేట-విజయవాడ మూడో లైన్‌కు కేవలం రూ.50 కోట్లు
* మణుగూరు-రామగుండం మార్గానికి రూ. లక్ష విదిలింపు


 సాక్షి, హైదరాబాద్:
 కొత్త రైలు ఒక్కటీ లేదు.. ఒక్క భారీ ప్రాజెక్టు రాలేదు.. పెద్ద స్టేషన్లకు కొత్త రూపునిచ్చే ప్రయత్నం లేదు.. చిన్న స్టేషన్‌లను ‘ఆదర్శం’గా మార్చే ఊసు లేదు..! కోటి ఆశలతో ఎదురుచూసిన ప్రజల ఆశలపై నీళ్లు చల్లుతూ సురేశ్‌ప్రభు బడ్జెట్ రైలు ‘తెలంగాణ’లో ఆగకుండా దూసుకెళ్లి దుమ్ము మిగిల్చింది!! వరుసగా రెండో ఏడాది కూడా సంస్కరణల హోరులో రాష్ట్రం చిన్నబోయింది. ఆంగ్లేయుల కాలంలో వేసిన లైన్లు మినహా పెద్దగా కొత్త మార్గాలు లేని తెలంగాణను కేంద్ర ప్రభుత్వం మరోసారి విస్మరించింది. కొత్త ప్రాజెక్టులు ఇవ్వకున్నా.. ప్రజల డిమాండ్ మేరకు ఐదారు కొత్త రైళ్లు ఇవ్వటం పరిపాటి. కానీ ఈసారి అవీ లేవు.

సంప్రదాయ బడ్జెట్‌కు భిన్నంగా గత సంవత్సరం ఒక్క కొత్త రైలు ప్రకటించని రైల్వేమంత్రి సురేశ్‌ప్రభు ఈసారి కూడా అదే పంథా అనుసరించారు. ఉన్న లైన్లు రద్దీగా మారిన నేపథ్యంలో కొత్త రైళ్లు ఇవ్వటం సరికాదనుకున్న మంత్రి.. వాటిని మంజూరు చేయటానికి ససేమిరా అన్నారు. భవిష్యత్తులో కొత్త రైళ్లు రావాలంటే ఇప్పుడు కొత్త లైన్ల నిర్మాణం అవసరమన్న విషయాన్ని విస్మరించారు. దశాబ్దాల క్రితం మంజూరై నత్తతో పోటీ పడుతూ పనులు సాగుతున్న లైన్లకు అరకొర నిధులు విదిల్చటం మినహా బడ్జెట్‌లో కొత్త మార్గాలపై దృష్టి సారించలేదు. కాజీపేటలో వ్యాగన్ పిరియాడికల్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాపు ఏర్పాటుకు పచ్చజెండా ఊపటం, హైదరాబాద్‌లోని ఎంఎంటీఎస్ రెండో దశ విస్తరణలో భాగంగా ఘట్కేసర్ వరకు
 
 నిర్మించునున్న మార్గాన్ని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి (రాయిగిరి) వరకు పొడిగించడం, రైళ్ల రద్దీతో ఇరుగ్గా మారిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌పై భారం తగ్గించేందుకు శివారులోని చెర్లపల్లిలో శాటిలైట్ రైల్ టెర్మినల్ నిర్మాణానికి అనుమతి ఇవ్వడం.. ఈ మూడు తప్ప రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. బడ్జెట్ రోజు వరకు ఆశల పల్లకిలో ఊరేగి ఒక్కసారి ఉస్సూరుమనిపించకుండా సురేశ్‌ప్రభు గతంలోనే స్పష్టమైన సంకేతాలిచ్చారు. దీంతో ఈ బడ్జెట్‌లో పెద్దగా ఏమీ ఉండదన్న విషయం రాష్ట్ర ప్రభుత్వానికి ముందే అర్థమైంది. అందుకే కనీసం బడ్జెట్ ముందు ప్రతిపాదనల జాబితాను కూడా రైల్వే శాఖకు పంపలేదు.

 ఇలాగైతే ఎప్పుడు పూర్తయ్యేది?
 దక్షిణ మధ్య రైల్వేలో బిజీగా ఉండే కాజీపేట-విజయవాడ మార్గంలో మూడో లైను నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాల్సి ఉంది. కానీ ప్రతి బడ్జెట్‌లో అత్తెసరు నిధులు మాత్రమే కేటాయిస్తుండటంతో ఈ పనులు సాగటం లేదు. 220 కి.మీ. నిడివి ఉన్న ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే రూ.1,630 కోట్లు అవసరం. 2014-15 నాటికి ఖర్చు చేసింది కేవలం రూ.16 కోట్లు మాత్రమే. గత బడ్జెట్‌లో రూ.100 కోట్లు ప్రకటించినా తుదకు కేటాయించింది మాత్రం రూ.68 కోట్లే. ఈసారి రూ.50 కోట్లతోనే సరిపుచ్చారు. ఈ మార్గంలో లైన్‌ను గరిష్ట స్థాయిని  మించి 175 శాతం మేర వినియోగిస్తుండటంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ఫలితంగా డిమాండ్ ఉన్నా అదనపు రైళ్లు నడిపేందుకు అధికారులు జంకుతున్నారు. అలాంటి కీలకమైన మార్గంపై మరోసారి నిర్లక్ష్యం చూపారు. మహారాష్ట్రలోని బల్లార్షా నుంచి కాజీపేట వరకు ట్రిప్లింగ్‌ది కూడా ఇదే దుస్థితి. దీనికి కూడా అత్తెసరుగా రూ.50 కోట్లు కేటాయించారు.

 సీఎం కలల ప్రాజెక్టుకూ అత్తెసరు నిధులే..
 రాష్ట్రంలో మరో కీలక మార్గం పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్. దీనికి బడ్జెట్‌లో రూ.70 కోట్లు విదిల్చారు. గత బడ్జెట్‌లో రూ.141 కోట్లు మంజూరు చేయగా తుదకు రూ.169 కోట్లకు పెంచారు. ఈసారి అందులో సగం కూడా ఇవ్వలేదు. మునీరాబాద్-మహబూబ్‌నగర్ లైన్‌కు గత బడ్జెట్‌లో రూ.34 కోట్లు ఇవ్వగా ఈసారి రూ.180 కోట్లే కేటాయించారు. కరీంనగర్‌ను రైల్వేతో అనుసంధానం చేసే ముఖ్యమైన మనోహరాబాద్-కొత్తపల్లి లైన్‌కు రూ.30 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో రూ.20 కోట్లు కేటాయిస్తే చివరికొచ్చేసరికి రూ.కోటి మాత్రమే విడుదలైంది. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ కలల ప్రాజెక్టు అయినప్పటికీ రైల్వే శాఖ నిర్లక్ష్యం చూపింది. ఫలితంగా ఈ సంవత్సరం కూడా ప్రాజెక్టులో పెద్దగా పురోగతి ఉండే అవకాశం లేదు.

 హవ్వ... రూ.లక్ష?
 బొగ్గు రవాణాలో కీలకంగా మారనున్న మణుగూరు-రామగుండం లైన్‌కు బడ్జెట్‌లో రూ.లక్ష కేటాయించారు! గత బడ్జెట్‌లో రూ.10 లక్షలు ప్రకటించి రూ.8.2 లక్షలు ఖర్చు చేసిన రైల్వేశాఖ.. ఈసారి రూ.లక్ష ఇవ్వటం విస్మయం కలిగించింది. అక్కన్నపేట-మెదక్ మార్గానికి రూ.10 కోట్లు, భద్రాచలం-కొవ్వూరుకు రూ.10 కోట్లు, భద్రాచలం-సత్తుపల్లి రోడ్డుకు రూ.25 కోట్లు కేటాయించారు.

రద్దు చేసి.. జీవం పోసి..
 రాష్ట్రంలో అతిపురాతన ప్రాజెక్టుగా రికార్డుల్లోకెక్కింది మాచెర్ల-నల్లగొండ లైను. ఇది 1997లో మంజూరైనా ఇప్పటివరకు పనులే మొదలు పెట్టలేదు. ఇటీవల ఏకంగా ఆ ప్రతిపాదననే రద్దు చేసుకుంటున్నట్టు స్వయంగా రైల్వే శాఖ ప్రకటించింది. స్థానిక ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పార్లమెంటులో ప్రశ్నించగా.. ఈ మేరకు సమాధానం వచ్చింది. దీంతో అదెలా కుదురుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఎంపీలతో నిర్వహించిన బడ్జెట్ సన్నాహక సమావేశంలో ఈ విషయమై వాకౌట్ కూడా చేశారు. విచిత్రంగా తాజా బడ్జెట్‌లో ఆ ప్రాజెక్టుకు రూ.20 లక్షలు కేటాయించారు. దీన్ని చూసి ఎంపీ సుఖేందర్‌రెడ్డే ఆశ్చర్యపోయారు. రద్దు చేసిన ప్రాజెక్టుకు మళ్లీ జీవం పోసిన రైల్వే శాఖ మరీ రూ.20 లక్షలు కేటాయించటం విడ్డూరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement