రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు లోక్సభలో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్పై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు స్పందించారు. ఎవరేమన్నారంటే వారి మాటల్లోనే..
ప్రజల ఆకాంక్షను ప్రతిబింబించేలా భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధికి తోడ్పడే విధంగా బడ్జెట్‌ను రూపొందించిన మంత్రి సురేశ్ ప్రభుకు అభినందనలు. - రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే
సామాన్యుడి సమస్యలను పరిగణనలోకి తీసుకుని, పన్నులు విధించకుండా, వ్యాపారవేత్తలను ప్రోత్సహిస్తూ సమర్థవంతమైన రైల్వే బడ్జెట్‌ను రూపొందించాం. - కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్
భవిష్యత్ రైల్వే అవసరాలకు అనుగుణంగా, ప్రజాహిత రైల్వే బడ్జెట్‌ను రూపొందించిన ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి సురేశ్ ప్రభుకు అభినందనలు. వికలాంగులు, వయోవృద్ధులు, మహిళల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ తయారు చేశారు. గుజరాత్‌లోని నార్గల్, హజిరా నౌకాశ్రయాలకు రైల్వే లైన్లు నిర్మిస్తున్నందుకు కృతజ్ఞతలు. - గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్
నిరుపేదలను దృష్టిలో పెట్టుకుని సంస్కరణలకు అనుగుణంగా రూపొందించిన రైల్వే బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్‌కి 10 కి 9 మార్కులేస్తా.
- కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్
వాస్తవిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా రైల్వేలను మరింత ప్రాచుర్యంలోకి తీసుకెళ్తున్నారు.
- కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు
భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని అన్ని విధాలా సమతుల్యంగా బడ్జెట్‌ను రూపొందించినందుకు శుభాకాంక్షలు. భారత ఆర్థిక వ్యవస్థకు రైల్వేలు వెన్నెముక అని బడ్జెట్ ద్వారా నిరూపించారు. - కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా
ఈ బడ్జెట్ దేశ ఆర్థికాభివృద్ధికి చేయూతనిస్తుంది. - బీజేపీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖి
మహిళలను దృష్టిలో పెట్టుకుని, పెట్టుబడులను ఆకర్షించే విధంగా బడ్జెట్‌ను రూపొందించినందుకు శుభాకాంక్షలు.
- కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్
ఇది నిరుపయోగమైన బడ్జెట్. క్రూడ్ ఆయిల్ ధర తగ్గింది కాబట్టి టికెట్ ధరలు కూడా తగ్గాలి. అంతేకానీ టికెట్ రేట్లు పెంచకుండా ఉండటం గొప్పతనం కాదు. - బిహార్ సీఎం నితీశ్ కుమార్
వాణిజ్య, సూపర్‌ఫాస్ట్ రైళ్లు విమానాలతో పోటీ పడతాయేమో. - జీ చైర్మన్ సుభాష్ చంద్ర
ఇది సామాన్యుడి బడ్జెట్. జనని సేవ పథకం ద్వారా రైల్లో ప్రయాణించే చిన్నారులకు ఆహారం సరఫరా చేస్తున్నందుకు కృతజ్ఞతలు. ఎలాంటి చార్జీలను పెంచకుండా మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు. - బీజేపీ ఎంపీ పూనం మహాజన్
ఈ బడ్జెట్ నిస్సారంగా ఉంది. ముగిసిపోయే ప్రత్యేక రైల్వే బడ్జెట్‌కు ఇది ఒక ఫేర్‌వెల్ బడ్జెట్‌లా ఉంది.
-కాంగ్రెస్ నాయకుడు ఎమ్ సింఘ్వి
ప్రభుత్వ కలను బడ్జెట్‌గా మలచినట్లున్నారు. బడ్జెట్‌లోని హామీలు ఆచరణసాధ్యం కాదు. వాటిని అమలు చేయడం అసాధ్యం. - లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే
ఇది నిరుపయోగమైన బడ్జెట్. గత బడ్జెట్‌లో ప్రకటించిన ప్రతిపాదనల గురించిన ప్రస్తావనే లేదు.
- కాంగ్రెస్ నాయకుడు వీరప్ప మొయిలీ
ఒక్క కొత్త రైలు లేదు. కనీసం రైల్వే చార్జీలన్నా తగ్గిస్తారనుకున్నాం అదీ లేదు. ఈ బడ్జెట్ వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదు.
- కాంగ్రెస్ ప్రతినిధి రాజీవ్ శుక్లా
బడ్జెట్‌లో ప్రజలకు హామీలు ఇచ్చారు సరే. కానీ వాటిని అమలు చేయడానికి డబ్బును ఎలా సేకరిస్తారనేది చెప్పలేదు.
- రైల్వే శాఖ మాజీ మంత్రి దినేశ్ త్రివేది
చాలా కొత్త ప్రకటనలు చేశారు కానీ గత బడ్జెట్‌లోని ప్రతిపాదనలకు సంబంధించిన వివరాలు, వాటి అమలు తీరును మంత్రి చెప్పలేదు. - బీఎస్‌పీ చీఫ్ మాయావతి
ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రతి ఏటా ముందుచూపుతో కూడిన బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. కానీ దానిని అమలు చేయడంలోనే పూర్తిగా విఫలం అవుతుంది. -ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు సల్మాన్ అనీస్‌సోస్
ఈ సంవత్సరం రైల్వే బడ్జెట్ చాలా నిరుత్సాహన్ని కలిగించింది. బడ్జెట్‌లో కొత్తగా చేసిందేమీ లేదు. కేవలం గత బడ్జెట్‌కు పేర్లు మాత్రం మార్చారు. - ప్రముఖ జర్నలిస్ట్ వినోద్ మెహతా
ఈ బడ్జెట్ నన్ను చాలా నిరాశకు గురిచేసింది. బడ్జెట్‌లో ఎలాంటి కొత్తదనం లేదు. పాత ప్రాజెక్టుల కొనసాగింపే కనబడుతోంది. కనీసం చార్జీల తగ్గింపైనా ఉంటుందని ఆశించాం. అది కూడా లేకుండా పోయింది. - రైల్వే శాఖ మాజీ మంత్రి పవన్ బన్సాల్
ఈ బడ్జెట్ అసలు నాకు అర్ధం కాలేదు. నేను ప్రభుజీని కలిసి బడ్జెట్ గురించి తెలుసుకోవాలి.
-ఎన్‌సీపీ నాయకురాలు సుప్రియా సూలె