ఈసారి పరిస్థితి మారింది..
రైల్వే బడ్జెట్ లో పెద్దపల్లి- నిజామాబాద్ రైల్వే లైనుకు రూ. 70 కోట్లు కేటాయించడం సంతోషకరం. బోధన్-బీదర్ రైల్వే లైను మంజూరైంది. మౌలిక సదుపాయాలకు కేటాయింపులు బాగున్నాయి. మహిళల భద్రత కోసం చేపట్టిన చర్యలు బాగున్నాయి. సాధారణంగా ఏ రాష్ట్రానికి చెందిన మంత్రి ఉంటే ఆ రాష్ట్రానికి రైళ్లు కేటాయించుకుంటారు. ఈ సారి పరిస్థితి కొంచెం మారింది.
-కవిత, నిజామాబాద్ ఎంపీ
ఇదేనా బాబు పలుకుబడి
రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని గగ్గోలు పెట్టే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా సాధించిందేమీ లేదు. చంద్రబాబును బీజేపీ తురుపుముక్కగా వాడుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఏ ప్రాజెక్టునూ కేంద్రం ఆమోదించనందుకు చంద్రబాబు సిగ్గు పడాలి. విభజన సమయంలో విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు చేస్తామన్న హామీని కేంద్రం తుంగలో తొక్కింది. దీన్ని బట్టే చంద్రబాబుకు కేంద్రంలో ఉన్న పలుకుబడి ఏపాటిదో అర్థమవుతోంది.
- కె.రామకృష్ణ, పి.మధు (వామపక్ష నేతలు)
నిరాశపరిచింది
రైల్వే బడ్జెట్‌లో విశాఖ రైల్వే జోన్ ప్రకటించకపోవడం నిరాశ కలిగించింది. పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీ మేరకు కొత్త రాజధాని నుంచి వివిధ జిల్లాలకు, హైదరాబాద్‌కు రైల్వే మార్గాలను అనుసంధానించాల్సి ఉండగా.. అది కనిపించలేదు.
- మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత
బాబు అసమర్థతకు రుజువు
ప్రధాని మోదీ మోసకారితనానికి, సీఎం చంద్రబాబు చేతకాని తనానికి రైల్వే బడ్జెట్ ప్రతీకగా నిలిచింది. కనీసం ఒక్క కొత్త రైలు, ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా ప్రకటించని రైల్వే బడ్జెట్ చరిత్రలోనే ఇదే తొలిసారి. రాష్ట్ర ప్రయోజనాల సాధనకు టీడీపీ, బీజేపీ నామమాత్రపు ప్రయత్నం కూడా చేయలే దు. విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్న ప్రత్యేక రైల్వే జోన్‌ను ప్రకటించకుండా ద్రోహం చేశారు. ఎన్‌డీఏ తీరును వ్యతిరేకిస్తూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు నిర్వహిస్తాం. ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలపై నిలదీయలేని చంద్రబాబు తీరే ఇందుకు కారణం.
- రఘువీరారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
ఫలిస్తున్న బాబు కృషి
కేంద్రం నుంచి నిధులు రాబట్టడానికి సీఎం చంద్రబాబు చేస్తు న్న కృషికి ఫలితంగా రైల్వే బడ్జెట్ లో ప్రాధాన్యత లభించింది. ఏపీకి కేంద్రం విడతల వారీగా సాయం అందిస్తోంది.
- తోట నరసింహం, టీడీపీ లోక్‌సభా పక్ష నేత
తెలంగాణపై వివక్ష: పొంగులేటి
రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. కేంద్రం వివక్ష చూపింది. భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకునేందుకు దేశం నలు మూలల నుంచి తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం పాండురంగాపురం-సారపాక రైల్వే లైన్ ఊసేలేదు. ఈ విషయంపై రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రశ్నిస్తాం. అవసరమైతే వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించి కేంద్రానికి కనువిప్పు కలిగేలా చేస్తాం.
రైల్వే బడ్జెట్ పై ఎవరేమన్నారంటే..
Published Fri, Feb 26 2016 3:13 AM | Last Updated on Sun, Sep 3 2017 6:25 PM
Advertisement
Advertisement