అమరావతి రైలు మార్గానికి 2,680 కోట్లు
తాజా రైల్వే బడ్జెట్‌లో కేటాయింపు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ నూతన రైల్వే మార్గం నిర్మాణానికి తాజా రైల్వే బడ్జెట్‌లో రూ.2,680 కోట్లు మంజూరయ్యాయి. ఆ మేరకు విజయవాడ–అమరావతి–గుంటూరులను కలుపుతూ 106 కిలోమీటర్ల మేరకు రైల్వే ట్రాక్ నిర్మించనున్నారు. 2016–17 బడ్జెట్‌లో ఈ రైల్వే లైన్‌కు సర్వే మంజూరవగా.. ఇటీవలే రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌వీఎన్‌ఎల్) సర్వే పూర్తి చేసి రైల్వే బోర్డుకు నివేదిక అందించింది.
ఈ నేపథ్యంలో తాజా బడ్జెట్‌లో ఈ మార్గానికి నిధులు కేటాయించడంతో నాలుగేళ్లలో రైల్వే లైన్ నిర్మాణం పూర్తి కానుంది. ఏపీ ప్రభుత్వం రైల్వేశాఖతో ఇటీవలే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వివిధ ప్రాజెక్టులకు కేటాయింపులు జరిగాయి. ఆ మేరకు నడికుడి–శ్రీకాళహస్తి, కడప–బెంగళూరు, కోటిపల్లి–నర్సాపురం, అమరావతికి రైల్వే కనెక్టివిటీ... ఈ నాలుగు ప్రాజెక్టులకు నిధులు కేటాయించారు.