ద.మ. రైల్వేకు 5,135 కోట్లు
తెలంగాణకు రూ.1,729 కోట్లు.. ఏపీకి రూ.3,406 కోట్లు
సాక్షి, హైదరాబాద్: గతంలో ఎన్నడూ లేనివిధంగా బడ్జెట్‌లో దక్షిణ మధ్య రైల్వేకు ఈసారి భారీ నిధులే దక్కాయి. బుధవారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌లో దక్షిణ మధ్య రైల్వేకు రూ.5,135 కోట్లు ప్రకటించారు. విడిగా రైల్వే బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన సమయాల్లో ఎప్పుడూ దక్షిణ మధ్య రైల్వేకు ఇంతమొత్తం కేటాయించిన దాఖలా లేదు. అయితే ఈ నిధులను ఏయే ప్రాజెక్టులకు ఎంతెంత కేటాయించారనే వివరాలు మాత్రం వెల్లడి కాలేదు. పద్దులను ఇంకా సభకు సమర్పించనందున ఆ వివరాలను వెల్లడించలేదు.
శుక్రవారం సభకు సమర్పించిన అనంతరం వాటిని బహిర్గతం చేయనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. కేటాయించిన మొత్తం నిధులను కొత్త ప్రాజెక్టులు, గత బడ్జెట్‌లలో ప్రకటించిన ప్రధాన లైన్ల నిర్మాణానికి కేటాయిస్తే మాత్రం ఈసారి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత బడ్జెట్‌లో తెలంగాణకు కేవలం రూ.601 కోట్లు మాత్రమే కేటాయించగా ఈసారి రూ.1,729 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు గత బడ్జెట్‌లో రూ.2,195 కోట్లు కేటాయించగా ఈసారి రూ.3,406 కోట్లు కేటాయించటం విశేషం.
భద్రతకు ప్రాధాన్యం: జీఎం
ప్రయాణికులకు పూర్తి భద్రతతో కూడి న రైల్వే సదుపాయం, సేవలు, నాణ్యమైన, మెరుగైన సదుపాయాలను కల్పించడమే లక్ష్యం గా కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించారని దక్షిణ మధ్య రైల్వేజీఎం వినోద్ కుమార్ యాదవ్ తెలిపారు. రైల్వేల అభివృద్ధికి సముచితమైన నిధులను కేటాయించారని సంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో రైల్వే ప్రాధాన్యతలపై బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైల్వేల అభివృద్ధి కోసం కేటాయిం చిన బడ్జెట్‌లో ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ రైల్ సంరక్షణ ఫండ్‌ను ఏర్పాటు చేయడం సంతోషకరమని పేర్కొ న్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రస్తుతం 355 కాపలాలేని రైల్వే క్రాసింగ్‌లు ఉన్నాయని, దశలవారీగా 2020 నాటికి మొత్తం తొలగించ నున్నట్లు వెల్లడించారు. దక్షిణ మధ్య రైల్వేలో 4,138 కోచ్‌లకు ఇప్పటి వరకు బయో టాయిలెట్ సదుపాయం ఉందని, మరో 3 వేల కోచ్‌లకు ఆ సదుపాయం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.