లైన్లకే గ్రీన్‌సిగ్నల్‌ | Allocation For South Central Railway Is Rs 6,846 Crore | Sakshi
Sakshi News home page

లైన్లకే గ్రీన్‌సిగ్నల్‌

Published Thu, Feb 6 2020 2:33 AM | Last Updated on Thu, Feb 6 2020 2:33 AM

Allocation For South Central Railway Is Rs 6,846 Crore - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొత్త రైళ్ల బాధ్యతను ప్రైవేటుకు అప్పగించి మౌలిక వసతుల కల్పనపై రైల్వే శాఖ దృష్టి సారించింది. వీలైనన్ని ప్రైవేటు రైళ్లను పట్టాలెక్కించేందుకు సిద్ధమైన రైల్వేశాఖ దక్షిణమధ్య రైల్వేకు సంబంధించి 11మార్గాలను గుర్తించింది. ఆ మార్గా ల్లో ప్రైవేటు రైళ్లను పరుగు పెట్టించేందుకు కావాల్సిన ప్రణాళికలను రైల్వే బోర్డు పరిశీలిస్తోంది. సొంతంగా నిర్వహించే ఒక్క కొత్త రైలు ప్రస్తావన కూడా లేకుండానే తాజా బడ్జెట్‌ను రూపొందించారు. అయితే ఇప్పటికే మొదలైన కొత్త లైన్లు, డబ్లింగ్, మూడో లైన్ల నిర్మాణాలకు భారీగానే నిధులు కేటాయించారు. తాజా బడ్జెట్‌లో దక్షిణమధ్య రైల్వేకు రూ.6,846 కోట్లను కేటాయించారు. ఇది గత ఏడాది కంటే రూ.922 కోట్లు ఎక్కువ. ప్రారంభమైన లైన్లు పూర్తి చేశాకే కొత్తవి మొదలుపెట్టాలన్న ప్రధాని మోదీ ఆలోచన బడ్జెట్‌లో స్పష్టంగా కనిపించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వంతో సంయుక్తంగా చేపడుతున్న కొన్ని ప్రాజెక్టులకు నామమాత్రపు నిధులతో సరిపెట్టింది. తాజా బడ్జెట్‌లో దక్షిణమధ్య రైల్వే జోన్‌కు కేటాయింపుల వివరాలను బుధవారం జీఎం గజానన్‌ మాల్యా రైల్‌ నిలయంలో మీడియాకు వెల్లడించారు.  

ఈ ప్రాజెక్టులు ఇక పరుగు పెట్టినట్టే...  

మనోహరాబాద్‌–కొత్తపల్లి: రూ.235 కోట్లు.. 
హైదరాబాద్‌తో కరీంనగర్‌ పట్టణాన్ని రైల్వే ద్వారా అనుసంధానించే కీలక ప్రాజెక్టు మనోహరాబాద్‌–కొత్తపల్లికి రూ.235 కోట్లు కేటాయించారు. ఈ మార్చినాటికి గజ్వేల్‌ వరకు ఈ మార్గంలో రైలును నడిపేందుకు సిద్ధమైన అధికారులు, భూసేకరణ సమస్యలను అధిగమించి సిద్దిపేట వరకు వేగంగా పనులు పూర్తి చేసే యోచనలో ఉన్నారు. 2006–07లో మంజూరైన 151 కి.మీ. ఈ ప్రాజెక్టు గత రెండేళ్లుగా పరుగుపెడుతోంది. రూ.1,160 కోట్ల అంచనాతో ఇది ప్రారంభమైంది. 

మునీరాబాద్‌–మహబూబ్‌నగర్‌:  రూ.240 కోట్లు 
ఈ ప్రాజెక్టుకు రూ.240 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం ఈ మార్గంలో కాచిగూడ నుంచి జక్లేర్‌ వరకు డెమో రైలు నడుస్తోంది. ఆ తర్వాత భూసేకరణలో జరిగిన జాప్యంతో పనుల్లో కొంత ఆటంకం ఏర్పడింది. 243 కి.మీ. ఈ మార్గం పనులు రూ.1,723 కోట్ల అంచనాతో మొదలయ్యాయి. ఇందులో 66 కి.మీ. పరిధి తెలంగాణలో ఉండగా, మిగతాది కర్ణాటక పరిధిలో ఉంది. ద.మ. రైల్వే పరిధికి సంబంధించి జక్లేర్‌–మక్తల్, కృష్ణ–మాగనూరు మధ్య పనులు జరుగుతున్నాయి. 

భద్రాచలం–సత్తుపల్లి:  రూ.520 కోట్లు 
దక్షిణమధ్య రైల్వేకు ప్రధాన ఆదాయ వనరు అయిన బొగ్గు తరలింపుపై ఆ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. కొత్త గనులతో రైల్వేను అనుసంధానించే క్రమంలో భద్రాచలం–సత్తుపల్లి కొత్త లైను నిర్మాణం చివరి దశకు వచి్చంది. గత బడ్జెట్‌లో రూ.405 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.115 కోట్లు ఎక్కువగా కేటాయించింది. ఈ సంవత్సరం పనులు పూర్తి చేసే లక్ష్యంతో ఉంది. 54 కి.మీ.ల ఈ మార్గంలో భూసేకరణ వ్యయాన్ని రైల్వే భరించనుండగా, ప్రాజెక్టు నిర్మాణ ఖర్చు (రూ.704 కోట్లు)ను సింగరేణి సంస్థ భరించాల్సి ఉంది. 

ఎంఎంటీఎస్‌కు రూ.40 కోట్లు...
ఈ ఆర్థిక సంవత్సరం ఎంఎంటీఎస్‌ రెండో దశకు మరో రూ.40 కోట్లను కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్రం తన వాటాగా 2/3 వంతు చొప్పున సుమారు రూ.450 కోట్ల వరకు అందజేయవలసి ఉంది. ఈ నిధుల విడుదలలో జాప్యంతో సికింద్రాబాద్‌–»ొల్లారం, పటాన్‌చెరు–తెల్లాపూర్‌ తదితర మార్గాల్లో లైన్‌ల నిర్మాణం, విద్యుదీకరణ, స్టేషన్‌ల ఏర్పాటు పనులు పూర్తయినప్పటికీ రైళ్లను కొనుగోలు చేయలేకపోతున్నారు. ఇక రూ.150 కోట్ల అంచనాలతో మూడేళ్ల క్రితం ప్రతిపాదించిన చర్లపల్లి టర్మినల్‌ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం వంద ఎకరాల భూమిని కేటాయించవలసి ఉంది. ఇప్పటి వరకు ఆ భూమి ఇవ్వకపోవడంతో రైల్వేకు ఉన్న 50 ఎకరాల్లోనే రూ.80 కోట్లతో గత ఏడాది టరి్మనల్‌ విస్తరణ చేపట్టారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రస్తుతం రూ.5 కోట్లు కేటాయించారు. ఘట్కేసర్‌–యాదాద్రి ఎంఎంటీఎస్‌ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.412 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వంతో కలసి చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు రాష్ట్రం ఇప్పటి వరకు నిధులు ఇవ్వలేదు. కేంద్రం మాత్రం ఈ బడ్జెట్‌లో రూ.10 లక్షలతో సరిపెట్టింది.  

డబ్లింగ్, మూడో లైన్‌లకు మహర్దశ...
రైళ్ల రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో అదనపు లైను నిర్మాణం రైల్వేకు పెద్ద సవాలు. కాజీపేట–బల్లార్షా మూడోలైన్‌కు తాజా బడ్జెట్‌లో ఏకంగా రూ.483 కోట్లు కేటాయించారు. ఇది గత బడ్జెట్‌ కంటే రూ.118 కోట్లు ఎక్కువ. రెండు లైన్లు ఉన్నప్పటికీ సామర్థ్యం కంటే 130 శాతం అధికంగా రైళ్లను నడుపుతున్నారు. ఇప్పటికే ఈ మార్గంలో రాఘవాపురం–పోట్కపల్లి, బిసుగిర్‌షరీఫ్‌–ఉప్పల్, విరూర్‌–మాణిక్‌ఘర్‌ మధ్య మూడోలైన్‌ చివరి దశలో ఉండటంతో త్వరలో పూర్తి చేయనుంది. మిగతా చోట్ల పనులను వేగంగా పూర్తి చేసేందుకు ఇప్పుడు భారీగా నిధులు కేటాయించింది.

ఇక కాజీపేట–విజయవాడ మూడో లైన్‌ పనులకోసం రూ.404 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో ఇచ్చింది రూ.110కోట్లే. ఫలితంగా ఈ సారి పనుల్లో వేగం పెరగనుంది. ఈ మార్గంలో కొంతమేర భూసేకరణ సమస్య ఉన్నందున దీన్ని తొందరగా పరిష్కరించాలని ఇప్పటికే స్థానిక అధికారులకు ఆదేశాలు అందాయి.  

సికింద్రాబాద్‌–మహబూబ్‌నగర్‌ మధ్య 85 కి.మీ. మేర డబ్లింగ్‌ పనులకు గాను రూ.185 కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయించిన రూ.200 కోట్లతో పనులు వేగంగా జరుగుతున్నాయి. షాద్‌నగర్‌–గొల్లపల్లి మధ్య 29 కి.మీ. మార్గం పూర్తి కావచి్చంది. త్వరలో దాన్ని అందుబాటులోకి తెచ్చి రైళ్లను నడిపే ఆలోచనలో అధికారులు ఉన్నారు.  

కాజీపేట వర్క్‌షాపు అంతేనా.. 
కాజీపేటలో నిర్మించతలపెట్టిన పీరియాడికల్‌ ఓవర్‌హాలింగ్‌ వర్క్‌షాప్‌ పరిస్థితి డోలాయమానంలో పడ్డట్టు కనిపిస్తోంది. గత బడ్జెట్‌లో రూ.కోటిన్నర మంజూరు చేసిన రైల్వే ఈసారి నయాపైసా ప్రకటించకపోవటం పట్ల అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే, భూ సమస్య పరిష్కారం కాగానే పనులు చేపట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బుధవారం విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రైల్వే జీఎం గజానన్‌ మాల్యా చెప్పటం విశేషం. 

ఎయిర్‌లైన్స్‌ తరహాలో ప్రైవేట్‌ రైళ్లు... 
ఎయిర్‌లైన్స్‌ తరహాలో ప్రైవేట్‌ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ నుంచి వివిధ మార్గాల్లో ప్రైవేట్‌ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. చర్లపల్లి టరి్మనల్‌ నుంచి ఈ రైళ్లను నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే ప్రణాళికలను రూపొందిస్తోంది. చర్లపల్లి–శ్రీకాకుళం, చర్లపల్లి–వారణాసి, చర్లపల్లి–పన్వేల్, లింగంపల్లి–తిరుపతి, సికింద్రాబాద్‌–గౌహతి, చర్లపల్లి–చెన్నై, చర్లపల్లి–షాలిమార్, విజయవాడ–విశాఖ, తిరుపతి–విశాఖ తదితర ప్రాంతాల మధ్య ప్రైవేట్‌ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. అలాగే ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో లింగంపల్లి–గుంటూరు, ఔరంగాబాద్‌–పన్వేల్‌ మధ్య తేజాస్‌ రైళ్లను నడుపుతారు. ఈ రైళ్ల కోసం త్వరలో ఓపెన్‌ టెండర్లను ఆహా్వనించనున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement