బడ్జెట్ బాత్...
ఏం మాట్లాడుతున్నారు?
పెద్ద నోట్ల రద్దుతో తలెత్తిన కష్టాలు తాత్కాలికమేనని, ఆర్థిక వ్యవస్థపై ఇది ప్రభావం చూపలేదని అరుణ్ జైట్లీ అంటున్నారు. ఆయన ఏం చూసి ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. బడ్జెట్‌పై నేను వెంటనే స్పందించలేను.
– మన్మోహన్‌సింగ్
దశ, దిశ లేదు..
ఈ బడ్జెట్ తీవ్ర నిరా శకలిగించేలా ఉంది. దశ, దిశ లేదు. రైతులకు మేలు కలిగించే చర్యలేవీ లేవు. యువత కు ఉద్యోగ కల్పన విషయంలో భరోసా ఎక్కడా కనిపించలేదు. జైట్లీ కవితలు చదివి సరిపెట్టారు. ఏమాత్రం ముందు చూపులేని బడ్జెట్ ఇది.
– రాహుల్ గాంధీ
అంతా డొల్ల
బడ్జెట్ అంతా వట్టి డొల్ల. బడుగు బలహీనవర్గాలకు ఎలాంటి మేలు జరగదు. రైల్వే మంత్రి రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనప్పుడు ఆయన ఆ పదవిలో ఎలా కొనసాగుతారు? పనికిమాలిన నిర్ణయాలు తీసుకోవడంలో మోదీ, ట్రంప్ కవల పిల్లల్లా ఉన్నారు.
– లాలూ ప్రసాద్ యాదవ్
నిరాశ కలిగించింది
బడ్జెట్ నిరాశకలిగించింది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఎంతమొత్తంలో నల్లధనాన్ని రాబట్టారో వివరాలు ఇవ్వలేదు. నోట్ల రద్దును సమర్థించిన వారిని నిరాశకు గురిచేశారు. సాధారణ బడ్జెట్‌తో రైల్వే బడ్జెట్‌ను కలిపేసి కేంద్ర ప్రభుత్వం రైల్వేలను నాశనం చేసిందని అన్నారు.
– నితీశ్ కుమార్
అంతా గిమ్మిక్కే
బడ్జెట్ అంతా గిమ్మిక్కే. ఉద్యోగ, ఉపాధి కల్పనకు సంబంధించి నిర్ధిష్ట చర్యలు లేవు. పైగా ప్రభుత్వం ఆదా యం పెంచుకోవడానికి పరోక్ష పన్నులను పెంచడంతో ప్రజలపై భారం పెరుగుతుం ది. ప్రధాని బాటలో జైట్లీ పయనిస్తున్నారు. మాటల గారడీకే పరిమితమయ్యారు.
– సీతారాం ఏచూరి
పనికిమాలిన బడ్జెట్
దారీ, తెన్నూ లేని పనికిమాలిన బడ్జెట్ ఇది. దేశాభివృద్ధికి దోహదపడే చర్యలు లేవు. అంతా డొల్ల. మోదీ ప్రభుత్వం ప్రజల విశ్వసనీయతను కోల్పోయింది. ప్రజలకు నోట్ల రద్దు కష్టాలు ఇంకా తీరలేదు. తక్షణం ఆంక్షలు అన్నీ ఎత్తివేయాలి.
– మమతా బెనర్జీ
మౌలికానికి 3.96 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: మౌలిక సదుపాయాల వృద్ధికి బడ్జెట్‌లో పెద్దపీట వేసినట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. రికార్డు స్థాయిలో మొత్తం రూ. 3,96,135 కోట్లు కేటాయించామని, కేంద్ర ప్రభుత్వానికి ఇది అత్యంత ప్రాధాన్యతా రంగమని చెప్పారు. రైల్వేలు, రోడ్లు, నదులు దేశానికి జీవనాడి వంటివని అన్నారు. మౌలిక సదుపాయాలకు 2016–17 బడ్జెట్ అంచనాలు రూ. 3,48,952 కోట్లు కాగా సవరించిన అంచనాలు రూ. 3,58,634 కోట్లు అని తెలిపారు. మౌలికసదుపాయాల రంగంలో భారీ కేటాయింపులతో దేశంలో ఆర్థిక కార్యకలాపాలు భారీగా పెరగనున్నాయని, దీనివల్ల మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
ప్రాంతీయ విమానం.. పైపైకి
న్యూఢిల్లీ: ప్రాంతీయంగా విమానయాన అనుసంధాన పథకానికి సర్వీస్ ట్యాక్స్ మినహాయించారు. ఈ మినహాయింపు ఏడాది పాటు అమల్లో ఉంటుంది. ప్రయాణికులకు సదుపాయంగా తీర్చిదిద్దడం, నష్టాలను తగ్గించడం వంటి లక్ష్యాలతో ప్రాంతీయ విమానాశ్రయాలను అనుసంధానిస్తూ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ ప్రాంతీయ విమానయాన అనుసంధాన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) ప్రోత్సాహం లభిస్తుంది. ఈ వీజీఎఫ్‌పై విధించే 14శాతం సర్వీస్ ట్యాక్స్‌ను మినహాయిస్తున్నట్లు 2017–18 బడ్జెట్‌లో ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు.
స్వచ్ఛ ఇంధనానికి దన్ను
న్యూఢిల్లీ: స్వచ్ఛ, పునర్వినియోగ ఇంధనాన్ని ప్రోత్సహించేందుకు జైట్లీ తాజా బడ్జెట్‌లో పలు ప్రతిపాదనలు చేశారు. సోలార్ పార్క్ డెవలప్‌మెంట్ రెండో దశ కింద 20వేల మెగావాట్ల సౌరవిద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సౌర, పవన విద్యుత్ ప్లాంట్లలో వాడే పరికరాలపై పరోక్ష పన్నులను జైట్లీ భారీగా తగ్గించారు. సోలార్ సెల్స్ / ప్యానళ్లు / మ్యాడ్యూల్స్ తయారీకి వాడే సోలార్ టెంపర్డ్ గ్లాస్‌పై ప్రస్తుతం 5 శాతంగా ఉన్న మూల కస్టమ్స్ డ్యూటీ(బీసీడీ) పూర్తిగా రద్దు చేశారు. విద్యుత్ శాఖకు రూ. 13,881 కోట్లు, నూతన, పునర్వినియోగ మంత్రిత్వ శాఖకు రూ. 5,473 కోట్లు కేటాయించారు.