రైల్వే జోన్ హామీ ఏమైంది? | This zone would be guaranteed? | Sakshi
Sakshi News home page

రైల్వే జోన్ హామీ ఏమైంది?

Published Fri, Mar 13 2015 1:24 AM | Last Updated on Tue, Oct 16 2018 3:40 PM

రైల్వే జోన్ హామీ ఏమైంది? - Sakshi

రైల్వే జోన్ హామీ ఏమైంది?

  • రైల్వే బడ్జెట్‌పై చర్చలో మేకపాటి
  • ర్యాపిడ్ రోడ్ కం రైల్ నెట్‌వర్క్‌ను విస్మరించారు
  • నడికుడి-శ్రీకాళహస్తి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయండి
  • సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లో ఇచ్చిన హామీలను రైల్వే బడ్జెట్‌లో కేంద్రం విస్మరించిందని వైఎస్సార్ సీపీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన రైల్వేబడ్జెట్‌పై జరిగిన చర్చలో తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. ‘‘దేశాభివృద్ధిలో భారతీయ రైల్వే గణనీయమైన పాత్ర పోషిస్తోంది. అయితే పెరుగుతున్న ప్రమాదాలు, అపరిశుభ్రత తదితర అంశాలపై దృష్టిపెట్టాల్సి ఉంది. మా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీలు కలసి రైల్వే మంత్రికి పలు ప్రాజెక్టులపై ఇప్పటికే ఒక వినతిపత్రం ఇచ్చాం.

    నడికుడి-శ్రీకాళహస్తి ప్రాజెక్టును త్వరగా పూర్తిచేయాల్సిన అవసరం ఉంది. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర రైల్వే శాఖ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి. ఈ ప్రాజెక్టు మార్గం గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల మీదుగా 369 కి.మీ. పొడవునా సాగుతుంది. ఈ నాలుగుజిల్లాల్లోని వెనకబడిన ప్రాంతాల మీదుగా ఈ మార్గం ఉంది. అంతేకాకుండా హైదరాబాద్-చెన్నై మధ్య ఇదొక ప్రత్యామ్నాయ మార్గంగా కూడా అవుతుంది.

    రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని విధాలా సహకరిస్తామని చెప్పంది కాబట్టి లాంఛనాలు పూర్తిచేసి త్వరితగతిన పనిమొదలుపెట్టాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల ఆ నాలుగు జిల్లాల్లోని చిన్నచిన్న పట్టణాలు అభివృద్ధిచెందే అవకాశం ఉంది. 2014-15 రైల్వే బడ్జెట్‌లో అప్పటి రైల్వే మంత్రి ఏపీ, తెలంగాణల్లో రూ. 29 వేల కోట్ల అంచనా వ్యయం గల 29 ప్రాజెక్టులు పెం డింగ్‌లో ఉన్నాయని చెప్పారు. వాటిని అధికారులతో కూడిన సమన్వయ కమిటీ ద్వారా పరిష్కరిస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకేమీ జరగలేదు. విభజన చట్టంలో కేంద్రం సీమాంధ్రలో ఒక కొత్త రైల్వే జోన్‌కు హామీ ఇచ్చింది.

    అంతేకాకుండా కొత్త రాజధాని నుంచి హైదరాబాద్‌కు ర్యాపిడ్ రోడ్ అండ్ రైల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తామని ఆ చట్టం హామీ ఇచ్చింది. కానీ ఈ విషయంలో పురోగతి లేదు. విభజన తరువాత ఏపీ ఎక్స్‌ప్రెస్ తరహాలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి రైలు కావాలని రాష్ట్రం కోరింది. నడికుడి-శ్రీకాళహస్తి, విజయవాడ-నిడదవోలు, జగ్గయ్యపేట-విష్ణుపురం, కాకినాడ-పిఠాపురం, ఓబులవారిపల్లి-కృష్ణపట్నం వంటి ప్రాజెక్టులను ఈ బడ్జెట్‌లో రైల్వే మంత్రి ప్రస్తావించలేదు. అలాగే గుంటూరు-తెనాలి డబ్లింగ్ ప్రస్తావన కూడా లేదు.
     
    నెల్లూరులో కోరమండల్‌ను ఆపాలి..


    నెల్లూరులో కోరమండల్ ఎక్స్‌ప్రెస్, తమిళనాడు ఎక్స్‌ప్రెస్, నిజాముద్దీన్ గరీబ్థ్ ్రఎక్స్‌ప్రెస్‌లను ఆపాలి. అలాగే కావలిలో శబరి ఎక్స్‌ప్రెస్, యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్, శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌లకు హాల్టింగ్ ఏర్పాటు చేయాలి. కాజీపేట-విజయవాడ మధ్య మూడో లైన్ పనులు మినహా వేటినీ ప్రస్తావించలేదు. గతంలో బిట్రగుంట వద్ద ఒక పెద్ద లోకో షెడ్డు ఉండేది. దానిని ఒక కోచ్/వ్యాగన్ ఫ్యాక్టరీని ఏర్పాటుచేసేందుకు పరిశీలించవచ్చు. ఇక ప్రయాణికులు కోరుకునేది ము ఖ్యంగా రైళ్లు సమయానికి నడవాలని, సురక్షితంగా గమ్యం చేరాలని, స్టేషన్లు, రైళ్లు పరిశుభ్రంగా ఉండాలని, రక్షిత మంచినీరు లభించాలని. విద్య, ఉపాధి కోసం యువత నిత్యం ప్రయాణాలు చేస్తుంటారు. వారికి డిజిటల్ కనెక్టివిటీ అవసరం. రైల్వే బడ్జెట్ వారి ఆకాంక్షలకు పెద్దపీట వేసిందనే చెప్పాలి. ఈ బిల్లుకు వైఎస్సార్‌సీపీ తరపున మద్దతు పలుకుతూ ఆంధ్రప్రదేశ్ ఆకాంక్షలను నెరవేరుస్తారని ఆశిస్తున్నా..’’ అని పేర్కొన్నారు.
     
    మేకపాటి కోరిన కొత్త రైళ్లు..
    1. ఏపీ ఎక్స్‌ప్రెస్- న్యూఢిల్లీ నుంచి తిరుపతి వయా విజయవాడ
    2. మరొక ఏపీ ఎక్స్‌ప్రెస్- న్యూఢిల్లీ నుంచి విశాఖపట్నం
    3. తిరుపతి- షిరిడీ వయా నెల్లూరు, విజయవాడ
    4. విజయవాడ-బెంగళూరు
    5.తిరుపతి-అజ్మీర్ వయా నెల్లూరు విజయవాడ
     
    పోలవరానికి జాతీయహోదా ఇచ్చారా?

    పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారా అంటూ వైఎస్సార్‌సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నిం చారు. లోక్‌సభలో గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పోలవరంపై పలు ప్రశ్నలు వేశారు. ప్రాజెక్టు మంజూరీకి ముందు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలతో జరిపిన సంప్రదింపుల వివరాలు వెల్లడించాలన్నారు. గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ పరిధిలోని పోలవరం రిజర్వాయర్ నిర్వహణ షెడ్యూల్‌ను సెంట్రల్ వాటర్ కమిషన్(సీడబ్ల్యుసి)లోకి బదలాయింపు జరిగిన విషయాన్ని ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలకు తెలియపరిస్తే, అందుకు సంబంధించిన వివరాలు వెల్లడించాలని ఎంపీ మేకపాటి సహా ఎంపీలు మురళీ మోహన్, రీతా తరాయ్ కేంద్రాన్ని ప్రశ్నిం చారు. కేంద్ర జలవనరుల సహాయ మంత్రి సాంవర్‌లాల్ జాట్ బదులిస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 మేరకు పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించామన్నారు.
     
    వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు

    వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. దివంగత నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పార్టీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, విప్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీలు వెలగపల్లి వరప్రసాద్‌రావు, బుట్టా రేణుక, పి.వి.మిథున్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు.  వైఎస్ ఆశయాలకు అనుగుణంగా అట్టడుగు వర్గాల సంక్షేమానికి కట్టుబడుతూ పార్లమెంటు వే దికగా కృషి చేస్తామని ఎంపీలు ప్రతిజ్ఞ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement