రైల్వేమంత్రి బడ్జెట్.. సహాయ మంత్రి నిరసన
పార్లమెంటులో చిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సాక్షాత్తు రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే పార్లమెంటులో రైల్వే బడ్జెట్ ప్రవేశపెడుతుంటే, అదే శాఖకు చెందిన సహాయ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్రెడ్డి మాత్రం వెల్లోకి దూసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు. సాధారణంగా ఒక శాఖకు చెందిన మంత్రి ఏవైనా బిల్లులు ప్రవేశపెడుతుంటేనే ఆ శాఖకు చెందిన సహాయ మంత్రులు అందరూ అత్యంత అప్రమత్తంగా ఉండి, తోటి సభ్యుల ప్రతిస్పందనలు ఎలా ఉన్నాయో చూస్తుంటారు, అలాగే సీనియర్ మంత్రికి ఏమైనా అవసరమైతే సహాయపడుతుంటారు. కానీ బుధవారం మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి కనిపించింది.
సీమాంధ్ర ప్రాంతానికి చెందిన లోక్సభ సభ్యులతో పాటు కేంద్ర మంత్రులు కూడా తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టొద్దంటూ తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. అదే జాబితాలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్రెడ్డి కూడా ఉన్నారు. రైల్వే బడ్జెట్ను తన సీనియర్ మంత్రి ప్రవేశపెడుతున్నా దానికంటే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టకుండా అడ్డుకోవడం, నిరసన తెలియజేయడమే ముఖ్యంగా భావించారు. దాంతో తోటి సీమాంధ్ర ఎంపీలు, మంత్రులతో కలిసి తాను సైతం వెల్లోకి దూసుకెళ్లారు. సీమాంధ్ర ఎంపీలతో పాటు డీఎంకే, అన్నాడీఎంకేలకు చెందినవారు కూడా నిరసనలు వ్యక్తం చేస్తూ సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించడంతో అచ్చం మన రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్లాగే రైల్వే బడ్జెట్ కూడా పది నిమిషాల్లోనే ముగించి, మిగిలినది కూడా చదివినట్లు భావించాలని చెప్పి వదిలేశారు. బడ్జెట్ ప్రతులను మాత్రం సభ్యులందరికీ పంచిపెట్టారు!!