♦ బ్రిటీష్ కాలంనాటి రైల్వేట్రాక్‌లే దిక్కు
♦ ఫలించని ఏళ్ల పోరాటం
♦ రైల్వే బడ్జెట్‌పై జిల్లావాసుల గంపెడాశలు..
కొత్తగూడెం : స్వాతంత్య్రం సిద్ధించి ఆరు దశాబ్దాలైంది. బ్రిటీష్ పాలన నుంచి విముక్తి లభించింది. కానీ, బ్రిటీష్‌వారు వేసిన రైల్వే లైన్లే ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. అరవై ఏళ్లుగా మన పాలకులు దేశంలో రైల్వే లైన్లు వేసినవి కొన్నే. కొత్తగూడెం నుంచి కొవ్వూరుకు రైల్వే లైన్ వేయాలని చాలా ఏళ్లుగా పోరాటం జరుగుతోంది. ఏ ఒక్క ప్రభుత్వం పైసా ఇవ్వకపోవడంతో కొత్త ట్రాక్‌ల ఊసేలేదు. భద్రాచలం రోడ్-కొవ్వూరు లైన్, సత్తుపల్లి-కొత్తగూడెం లైన్, పాండురంగాపురం-సారపాక లైన్లు ముందుకు సాగడం లేదు. ప్రస్తుతం ఉన్న రైల్వేలైన్ల ద్వారా కోట్లాది రూపాయల మేరకు ఆదాయం వస్తునప్పటికీ కొత్తలైన్లను నిర్మించడానికి, వాటిని అభివృద్ధి చేయడానికి ఇప్పటి వరకు పాలించిన కేంద్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయలేదు. సింగరేణి బొగ్గు సరఫరాపైనే ఎక్కువగా జిల్లా నుంచి రైల్వే శాఖకు ప్రతి ఏటా రూ.800 కోట్ల మేరకు ఆదాయం లభిస్తోంది. దీంతోపాటు పర్యావరణశాఖ బొగ్గు రవాణా కేవలం రైల్వే ద్వారానే చేయాలని, రోడ్డు మార్గం ద్వారా చేయవద్దని నిబంధనలు విధించింది. ఈ నేపథ్యంలో సత్తుపల్లి-కొత్తగూడేనికి కొత్త మార్గం ఏర్పాటు చేసేందుకు సింగరేణి సంస్థ ముందుకు వచ్చినప్పటికీ భూ సేకరణ విషయం జఠిలంగా మారడంతో ఇప్పుడు అదికాస్తా పెండింగ్‌లోనే ఉంది.
సర్వేకే పరిమితం
భద్రాచలం రోడ్ (కొత్తగూడెం) నుంచి తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు వరకు రైల్వేలైన్ నిర్మాణం చేపట్టాలని ఐదు దశాబ్దాలుగా ప్రజలు కోరుతు న్నా ఫలితం లేదు. ఏటా బడ్జెట్‌లో కొవ్వూరు లైన్ సర్వేలకు మాత్రమే పరిమితమవుతోంది. ఈ రైల్వేలైన్ నిర్మిస్తే హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లేందుకు 149 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. దీంతోపాటు జిల్లాలో ఉత్పత్తి అయిన బొగ్గును విశాఖపట్నం తదితర ప్రాంతాలకు రవాణా చేయొచ్చు. సుమారు 150 గిరిజన గ్రామాలకు రైలుమార్గం అందుతుంది. 1969 నుంచి కొవ్వూరు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని ఆందోళన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో 2012లో కొవ్వూరు లైన్‌ను మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ నాలుగు బడ్జెట్ సమావేశాలు ముగిసినా ఇప్పటికీ రూపాయి కూడా విడుదల కాలేదు.
పెరిగిన సత్తుపల్లి లైన్ వ్యయం..
సత్తుపల్లిలోని జేవీఆర్ ఓసీపీ, కిష్టాపురం ఓసీపీల ద్వారా ఏటా 2 మిలియన్ టన్నుల మేరకు బొగ్గు సరఫరా చేస్తోంది. పర్యావరణశాఖ నిబంధనల నేపథ్యంలో కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వరకు 60 కిలోమీటర్ల మేరకు నిర్మించనున్న లైన్‌కు సింగరేణి సంస్థ నిధులు విడుదల చేసేందుకు ముందుకు వచ్చింది. ఫైనల్ సర్వే పూర్తి చేసేందుకు గాను రెండేళ్ల క్రితమే రూ.6 కోట్లు రైల్వే శాఖకు అందించగా సర్వే కూడా పూర్తయింది. రెండేళ్ల క్రితం కేవలం రూ.337.5 కోట్ల మేరకు అంచనా వేసినప్పటికీ జాప్యం కారణంగా సుమారు రూ.900 కోట్ల మేర వ్యయానికి చేరుకుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
పెండింగ్‌లోనే ప్రాజెక్టులు..
భద్రాచలం పుణ్యక్షేత్రానికి రైలుమార్గం నిర్మించేందుకు పాండురంగాపురం నుంచి సారపాక వరకు ఏర్పాటు చేయతలపెట్టిన లైన్ కేవలం కాగితాలకే పరిమితమైంది. సింగరేణి సంస్థ ఏర్పాటు చేయనున్న కోల్ కారిడార్‌లో భాగంగా మణుగూరు-రామగుండం లైన్, సత్తుపల్లి లైన్ పూర్తయితే దానిని అనుసంధానం చేసుకుని కొండపల్లి నుంచి కొత్తగూడెం వరకు రైల్వే లైన్‌ను నిర్మించే అవకాశాలున్నాయి. గురువారం కేంద్ర ప్రభుత్వం రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కొత్తగూడెం-కొవ్వూరు, కొత్తగూడెం-సత్తుపల్లి, పాండురంగాపురం-సారపాక, మణుగూరు-రామగుండం రైల్వే లైన్ల నిర్మాణాలకు నిధులు కేటాయిస్తారా? లేదా? అని ప్రజలు ఎదురు చూస్తున్నారు.