
పట్టాలు తప్పిన స్టాక్ మార్కెట్
⇒ నిరాశ పరిచిన రైల్వే బడ్జెట్
⇒ డెరివేటివ్‌ల కాంట్రాక్ట్ ముగింపు ప్రభావం
⇒ 261 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
⇒ 8,700 దిగువకు నిఫ్టీ
⇒ సిమెంట్, లోహ, ఎరువుల షేర్లు పతనం
⇒ రవాణా వ్యయం పెంపు ఫలితం
⇒ మార్కెట్ అప్‌డేట్
ముంబై:మోదీ ప్రభుత్వ తొలి పూర్తి స్థాయి రైల్వే బడ్జెట్ స్టాక్ మార్కెట్‌ను నిరాశపరిచింది. దీనికి ఫిబ్రవరి నెల డెరివేటివ్‌ల కాంట్రాక్టు ముగింపు కూడా తోడైంది. దీంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ గురువారం 261 పాయింట్లు నష్టపోయి 28,747 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 83 పాయింట్లు నష్టపోయి 8,684 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 8,700 పాయింట్ల దిగువకు పడిపోయింది. మార్కెట్‌కు 2వారాల్లో అధ్వాన ముగింపు ఇదే.
బడ్జెట్ నిరాశ: అసలే డిమాండ్ అంతంతమాత్రంగా ఉన్న పరిస్థితుల్లో రైల్వే రవాణా వ్యయం పెరగడంతో వీటిని వినియోగదారుడికి సిమెంట్, ఉక్కు కంపెనీలు పూర్తిగా బదిలీ చేయలేవని ఇన్వెస్టర్లు సందేహాపడుతున్నారు. ఆల్ట్రాటెక్ సిమెంట్, హెడెల్‌బెర్గ్ సిమెంట్, శ్రీ సిమెంట్, ఏసీసీ, అంబుజా సిమెంట్స్ 0.5 శాతం నుంచి 2.1 శాతం రేంజ్‌లో క్షీణించాయి. ఇక ఉక్కు కంపెనీలు జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, సెయిల్ షేర్లు 0.8 శాతం నుంచి 3.2 శాతం రేంజ్‌లో పడిపోయాయి. నేషనల్ ఫెర్టిలైజర్, టాటా కెమికల్స్, గుజరాత్ స్టేట్ ఫెర్టిలైజర్స్, గుజరాత్ నర్మదా వ్యాలీ ఫెర్టిలైజర్స్ కెమికల్స్ 1.8 శాతం నుంచి 0.3 శాతం రేంజ్‌లో తగ్గాయి.
ఆరు సెన్సెక్స్ షేర్లకే లాభాలు : 30 షేర్ల సెన్సెక్స్‌లో 24 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఆరు మాత్రమే లాభాల్లో ముగిశాయి. 1,749 షేర్లు నష్టాల్లో,1,078 షేర్లు లాభాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.4,868 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈలో రూ.23,260 కోట్లుగా, డెరివేటివ్ సెగ్మెంట్లో రూ.5,81,564కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,312 కోట్లు, దేశీ ఇన్వెస్టర్లు రూ.341 కోట్ల చొప్పున నికర కొనుగోళ్లు జరిపారు.