రైల్ వెవ్వె...వ్వె...వ్వే! | railway budget special story | Sakshi
Sakshi News home page

రైల్ వెవ్వె...వ్వె...వ్వే!

Published Fri, Feb 26 2016 2:01 AM | Last Updated on Sun, Sep 3 2017 6:25 PM

రైల్ వెవ్వె...వ్వె...వ్వే!

రైల్ వెవ్వె...వ్వె...వ్వే!

రైల్వే బడ్జెట్‌లో విశాఖకు.. ఉత్తరాంధ్రకు
తీవ్ర అన్యాయం విశాఖ జోన్ ఊసే ఎత్తని
రైల్వే మంత్రి టీడీపీ, బీజేపీ పాలకుల
హామీలు గాలికి.. భగ్గుమన్న ప్రతిపక్షాలు,
ప్రజాసంఘాలు వీటితోనే సరిపెట్టుకోండి
ఖరగ్‌పూర్-విజయవాడ సరుకు రవాణా కారిడార్
వడ్లపూడి వ్యాగన్ వర్క్‌షాప్‌కు రూ.30 కోట్లు
కొత్తవలస-సింహాచలం 4వ లైన్‌కు రూ.2.71 కోట్లు
సింహాచలం నార్త్-గోపాలపట్నం డబ్లింగ్ బైపాస్‌కు రూ.4.24 కోట్లు
ఖరగ్‌పూర్-విజయవాడ ట్రిప్లింగ్ లైన్
విశాఖ స్టేషన్‌లో త్వరలో వైఫై సౌకర్యం

బడ్జెట్ రైలు వచ్చింది.. వెళ్లింది.. కాదు కాదు.. మెరుపులా మాయమైంది!.. విశాఖ అనే నగరమే లేదన్నట్లుగా హైస్పీడ్‌లో దూసుకుపోయిన బడ్జెట్ రైలు కింద నగర ఆశలన్నీ నుజ్జునుజ్జయ్యాయి. కలలన్నీ చెదిరిపోయాయి... హామీలన్నీ కొట్టుకుపోయాయి.

అదిగో జోన్.. ఇదిగో జోన్.. అంటూ పాలక టీడీపీ, బీజేపీ నేతలు నిన్నటి వరకు చేసిన ప్రచారం ఉత్త పటాటోపమేనని సురేష్ ప్రభువు తేల్చిపారేశారు.

 అంతేనా.. ఒక కొత్త రైలు లేదు.. ఫ్రీక్వెన్సీ పెంపూ లేదు.. కొత్త ప్రాజెక్టులు లేవు... అసలు రైల్వే బడ్జెట్‌లో విశాఖ అన్న ఊసే లేకుండా రైల్వే మంత్రి బడ్జెట్ పాఠాన్ని అప్పజెప్పేశారు.

తూర్పు కోస్తా జోన్ పరిధిలో ఉన్న వాల్తేర్ డివిజన్‌కు ఈ బడ్జెట్‌లో వెయ్యి కోట్ల పైచిలుకు నిధులు కేటాయించారని డీఆర్‌ఎం చంద్రలేఖ ఉవాచించినా.. వాటిలో విశాఖేతర ప్రాంతాలకు..

ప్రత్యేకించి ఒడిశా, చత్తీస్‌గఢ్ ప్రాంతాలకు పోయేవే ఎక్కువగా ఉన్నాయి.. ఇంతకాలం హామీలతో ఊరించి.. బడ్జెట్‌లో మొండిచెయ్యి చూపడం కళ్లు మూసి జెల్ల కొట్టినట్టుగా ఉందని.. ప్రజా, ఉద్యోగ సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు భగ్గుమన్నాయి. రైల్వే బడ్జెట్‌లో విశాఖకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ నిరసనలకు దిగాయి.

అన్యాయం చేశారు
రైల్వే బ డ్జెట్‌పై వైఎస్సార్ సీపీ మండిపాటు
రైల్వేస్టేషన్ ముందు ధర్నా

అనకాపల్లి:  రైల్వే జోన్ విషయంలో విశాఖకు మరోసారి అన్యాయం జరిగింది.. దీనికి బాధ్యత వహిస్తూ రాష్ట్రానికి చెందిన  బీజేపీ, టీడీపీ ఎంపీలు, కేంద్రమంత్రులు రాజీనామా చేయాలి అనివైఎస్సార్ సీపీ అనకాపల్లి పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకిరామరాజు డిమాండ్ చేశారు. గురువారం అనకాపల్లి రైల్వేస్టేషన్ ముందు పార్టీ నాయకు, కార్యకర్తలతో కలసి ధర్నాకు దిగారు. రైల్వే బడ్జెట్ నిరాశ మిగిల్చిందన్నారు. మాయమాటలు చెప్పి రైల్వేజోన్ విషయాన్ని పక్కన పెట్టారని విమర్శించారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర సమస్యల గురించి తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో పోరాడుతున్నారని పేర్కొన్నారు. పట్టణ కార్యదర్శి సూరిశెట్టి రమణ అప్పారావు మాట్లాడుతూ రెండేళ్ల నుంచి రైల్వేజోన్ వస్తుందని విశాఖ ఎంపీ హరిబాబు, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు మభ్యపెట్టారని.. కాని రైల్వేబడ్జెట్‌లో ఈ ప్రస్తావనే రాలేదన్నారు.

మండల అధ్యక్షుడు గొర్లి సూరిబాబు, పట్టణ అధికార ప్రతినిధి ఆళ్ల నాగేశ్వరరావు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రానికి న్యాయం చేయడంలో వైఫల్యం చెందుతున్నాయని చెప్పేందుకు రైల్వేజోన్ ఉదాహరణ అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. అంతకుముందు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల నివాళులు అర్పించారు. పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఏవీ రత్నకుమారి, మండల కార్యదర్శి భీశెట్టి జగన్, మామిడి నూకరాజు, సమ్మంగి కనకారావు, పొట్ల అప్పారావు, పెట్ల నాగేశ్వరరావు, ఏడువాకల నారాయణరావు, పిట్టా అప్పలరాజు, మట్టా కుమార్, కె.అత్తిరికుమార్ తదితరులు పాల్గొన్నారు. 

సాక్షి, విశాఖపట్నం : ఊహించిందే జరిగింది. కేంద్రం విశాఖకు మరోసారి అన్యాయం చేసింది. ఈసారి కూడా రైల్వే బడ్జెట్ నిరాశపరిచింది. తూర్పు కోస్తా రైల్వేలో అతిపెద్ద ఆదాయ వనరుగా ఉన్న వాల్తేరు డివిజన్‌కు రైల్వే బడ్జెట్‌లో మొండిచెయ్యే చూపింది. ఏళ్ల తరబడి ఎన్నో ఆశలు పెట్టుకున్న జోన్ ఆశలను కూడా ఆవిరి చేసేసింది. అదిగో జోన్, ఇదిగో జోన్ అంటూ కొన్నాళ్ల నుంచి అధికార టీడీపీ, బీజేపీ నేతలు ఊదరగొడ్తూ వచ్చారు. తీరా గురువారం నాటి బడ్జెట్‌లో వైజాగ్ ఊసే లేదు. విశాఖపై రైల్వేశాఖకున్న నిర్లక్ష్యం, నేతల ఉదాసీనతలను చూసి విశాఖ వాసులు నివ్వెరపోయారు. ఇంతటి అన్యాయం ఎప్పుడూ లేదంటూ నిప్పులు కక్కుతున్నారు. బడ్జెట్ ప్రసంగంలో రైల్వేమంత్రి సురేష్ ప్రభు నోట ‘విశాఖపట్నం’ అన్న మాటే రాలేదంటే ఏమనుకోవాలి? భవిష్యత్‌లో వాల్తేరుకు వరాలిస్తారని, ప్రత్యేక జోన్ ప్రకటిస్తారంటే ఎవరిని నమ్మాలి? అధికార పార్టీల నేతల చిత్తశుద్ధి లోపమా? లేక వీరిని కేంద్రం పెద్దలు పట్టించుకోకపోవడమా? ఇవీ ఇప్పుడు విశాఖ వాసుల మదిలో మెదులుతున్న ప్రశ్నలు!

 విశాఖ ఘోష వినపడదా?
దాదాపు 50 ఏళ్ల నుంచి విశాఖ రైల్వే జోన్ డిమాండ్ కొనసా....గుతూనే ఉంది. ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, జేఏసీలు తరచూ జోన్ కోసం ఉద్యమాలు, ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. అయినా రైల్వేశాఖ పెడచెవిన పెడుతూనే వస్తోంది. ఆఖరికి రాష్ట్ర విభజన చట్టంలో రైల్వే జోన్  ఇవ్వాలన్న ప్రస్తావించారు కూడా. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ జతకట్టి అధికారంలోకి వచ్చాక ఇక జోన్ ఖాయమన్న ప్రచారం ఉధృతమైంది. గత ఏడాది రైల్వే బడ్జెట్‌లోనూ జోన్ ప్రకటన వెలువడుతుందనుకుంటే నిరాశే మిగిలింది. జోన్ ఇవ్వడానికి రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఆమోదం తెలిపారని పక్షం రోజుల క్రితం కేంద్రమంత్రులు ప్రకటనలు చేశారు. దీంతో ఈ బడ్జెట్‌లో జోన్ ఇచ్చేస్తారన్న భావన కలిగించారు. తాజా బడ్జెట్‌లో ఎప్పటిలాగానే జోన్ జోలికెళ్లకుండా ఆశలపై నీళ్లు చల్లారు. మరోవైపు విశాఖలో ఏళ్ల తరబడి ఉన్న డిమాండ్లను రైల్వే బడ్జెట్‌లో పట్టించుకోలేదు. కొత్త రైళ్ల ప్రస్తావనే లేదు. కనీసం 2015 బడ్జెట్‌లో కేటాయింపులకూ మోక్షం లేదు.

కావలసినవి ఇవీ..
జ్ఞానాపురం వైపు మల్టీపర్పస్ కాంప్లెక్స్ నిర్మాణానికి 2013-14లో ప్రకటన చేశారు. కానీ ఈ బడ్జెట్‌లో నిధులపై స్పష్టతలేదు. ట్రాక్‌ల నవీకరణకు రూ.299 కోట్లు కేటాయించినా నిధులివ్వలేదు. రైళ్ల ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు ఆధునికీకరణ పనులకు రూ.17.78 కోట్లు, 335 కిలోమీటర్ల దువ్వాడ-విజయవాడ కొత్త సర్వే లైన్‌కు రూ.3.34 కోట్లు, దువ్వాడ-విజయవాడ లైను కొత్త పనులకు రూ. 76.60 కోట్లు గత బడ్జెట్‌లో ప్రకటించారు. కానీ ఈ బడ్జెట్‌లో వాటి ఊసే లేదు. రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫారాలు 8 నుంచి 12కి పెంపుదల ప్రతిపాదనలను పట్టించుకోలేదు. కనీసం ప్రముఖ పర్యాటక కేంద్రం అరకుకు అద్దాల విస్టాడాం కోచ్ రైలు ప్రస్తావనే లేదు. విశాఖలో వ్యాగన్ తయారీ కేంద్రాన్ని, ఆర్‌ఆర్‌బీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ జోలికెళ్లలేదు.

ప్లాట్‌ఫారాల విస్తరణ మాటేలేదు. విశాఖ నుంచి శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి ప్రాంతాలకు ఈఎంయూ, విశాఖపట్నం-విజయవాడకు రాత్రి వేళ రైళ్లు నడపాలన్న ప్రతిపాదనను పట్టించుకోలేదు. విశాఖ వచ్చే రైళ్లు ఔటర్‌లోనే నిలిచి పోతున్నందున మరో రెండు ట్రాక్‌లు నిర్మించాలన్న డిమాండ్‌ను పెపడచెవిన పెట్టేశారు. రిజర్వేషన్ కేంద్రాల సంఖ్యను పెంచలేదు. రద్దీ దృష్ట్యా తిరుపతికి రోజూ మరిన్ని రైళ్లు నడపాలని, విశాఖ-హైదరాబాద్ దురంతో వారానికి మూడుసార్లకు బదులు రోజూ నడపాలని, విశాఖ-వారణాసి, విశాఖ-ఢిల్లీ మధ్య నడిచే రైళ్ల సమయం తగ్గించాలని, విశాఖ-తిరుపతి మధ్య గరీబ్థ్ ్రనడపాలన్న డిమాండ్‌లను గాలికొదిలేశారు.

 నేతలూ ఎందుకీ సన్నాయి నొక్కులు...!
తూర్పు కోస్తా రైల్వే జోన్ సరకు రవాణా ఆదాయం ఏటా సుమారు రూ.10 వేల కోట్లు. ఇందులో దాదాపు సగం రూ.6500 కోట్లు వాల్తేరు డివిజన్ నుంచే వస్తోంది. విశాఖ రైల్వే స్టేషన్‌కు రోజూ 112 రైళ్ల ద్వారా రోజుకు లక్షా 20 వేల మంది ప్రయాణికులు వచ్చిపోతుంటారు. సాధారణ టిక్కెట్ల ద్వారా రోజుకు 25 లక్షలు వస్తోంది. ఇది భువనేశ్వర్‌కంటే  రెట్టింపన్న మాట. ఇంతగా కాసులు తె స్తున్న వాల్తేరు డివిజన్‌కు బడ్జెట్‌లో ప్రాధాన్యమే లేకుండా పోయింది. ఇంత జరుగుతున్నా అటు టీడీపీ, ఇటు బీజేపీ నేతలు కిమ్మనడం లేదు. పైగా ఒకరిద్దరు బడ్జెట్ బాగుందంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

ఇచ్చినవి ఇవీ..
వాల్తేరు డివిజన్‌లో ఈ బడ్జెట్‌లో 15 డబ్లింగ్ పనులకు 1088.95 కోట్లు కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు. ఖరగ్‌పూర్-విజయవాడ ఫ్రైట్ కారిడార్ ఏర్పాటు చేయనున్నారు. దేశవ్యాప్తంగా 400 స్టేషన్లలో వైఫై సదుపాయం కల్పిస్తామని ఈ బడ్జెట్‌లో ప్రకటించారు. వాస్తవానికి గత బడ్జెట్లోనూ ప్రకటించినా ఇప్పటిదాకా అతీగతీ లేదు.  వడ్లపూడి వ్యాగన్ పీవోహెచ్ వర్క్‌షాపునకు రూ.213.71 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది రూ.30 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. ఇంకా చిన్నా చితక పనులకు నిధులు కేటాయించినట్టు చెబుతున్నా అవేమిటో స్పష్టత లేదు.

డివిజన్‌కు రూ.1009 కోట్లు
15 చోట్ల డబ్లింగ్ పనులు
జోన్‌పై సమాచారం లేదు
డీఆర్‌ఎం చంద్రలేఖ ముఖర్జీ

సాక్షి, విశాఖపట్నం : రైల్వే బడ్జెట్‌లో వాల్తేరు డివిజన్‌కు రూ. 1008.95 కోట్లను కేటాయించినట్టు డివిజనల్ రైల్వే మేనేజర్ చంద్రలేఖ ముఖర్జీ తెలిపారు. ఈ నిధులతో డివిజన్ పరిధిలోని 15 చోట్ల డబ్లింగ్ పనులు చేపడతామన్నారు. గురువారం సాయంత్రం తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇందులో విజయనగరం-కొత్తవలస 3వ లైన్‌కు రూ.8 కోట్లు. కొత్తవలస-సింహాచలం 4వ లైన్‌కు రూ.2.71 కోట్లు, సింహాచలం నార్త్-గోపాలపట్నం డబ్లింగ్ బైపాస్‌కు రూ.4.24 కోట్లు, కిరండోల్-జగదల్‌పూర్ లైన్‌కు రూ.120 కోట్లు, జగదల్‌పూర్-కోరాపుట్ లైన్‌కు రూ.120 కోట్లు, విజయనగరం- సంబల్‌పూర్ 3వ లైన్‌కు రూ.225 కోట్లు, కొత్తవలస-జగదల్‌పూర్ లైన్‌కు రూ.350 కోట్లు, కోరాపుట్-సింగపురం రోడ్డుకు రూ.39 కోట్లు, విజయనగరం బైపాస్ లైన్‌కు రూ.10 కోట్లు, భద్రక్, విజయనగరం 3వ లైన్‌కు రూ.210 కోట్లు కేటాయించిన ట్టు వివరించారు. బడ్జెట్‌లో ఖరగ్‌పూర్-విజయవాడ ట్రిప్లింగ్ లైన్ మంజూరైందన్నారు. కాగా వాల్తేరు డివిజన్‌లో 18 ఆటోమేటిక్ వెండింగ్ మిషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

 అంగవికలురకు ఈ-టిక్కెట్టు పొందడానికి వీలుగా వెయ్యిమందికి గుర్తింపు కార్డుల జారీ చేస్తున్నామన్నారు. విశాఖ రైల్వే స్టేషన్లో త్వరలో వైఫై సదుపాయం కల్పిస్తామని తెలిపారు. డివిజన్‌లో 60 కాపలాలేని లెవెల్ క్రాసింగ్‌ల్లో 56 మూసివేశామన్నారు. అరకు వెళ్లే విస్టాడాం కోచ్‌ను జులై నాటికి ప్రారంభించే అవకాశం ఉందన్నారు. విజయనగరం-రాయగడ ఎలక్ట్రికల్ లైన్ వచ్చే నెలలో పూర్తవుతందని చెప్పారు.

 జోన్ సమాచారం లేదు..
విశాఖపట్నం ప్రత్యేక జోన్ ఏర్పాటుపై తనకు సమాచారం లేదని డీఆర్‌ఎం తెలిపారు. ఆ విషయం రైల్వే మంత్రిత్వశాఖ పరిధిలో ఉందన్నారు. డబుల్ డెక్కర్ రైళ్ల నిర్వహణ సదుపాయం ప్రస్తుతానికి విశాఖలో లేనందున ఇప్పట్లో అవి వచ్చే అవకాశం లేదని చెప్పారు. విశాఖ నుంచి ఢిల్లీ వెళ్లే స్వర్ణజయంతి, సమత ఎక్స్‌ప్రెస్ రైళ్లపై వినైల్ ర్యాపింగ్ ద్వారా అడ్వర్టైజ్‌మెంట్ చేసుకునేందుకు విశాఖ స్టీల్‌ప్లాంట్‌తో ఒప్పందానికి చర్చలు జరుగుతున్నాయని ఆమె తెలిపారు.

హామీలకు పరిమితం
అనకాపల్లిరూరల్ (మునగపాక):  రెల్వేబడ్జెట్‌లో విశాఖకు న్యాయం జరగలేదని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి రాష్ట్ర ఉపాధ్యక్షులు దూళం గోపీ పేర్కొన్నారు. గురువారం  ఒక ప్రకటన విడుదల చేశారు. విశాఖకు రైల్వేజోన్ హామీలకే పరిమితమైందని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం, ప్రతిపక్ష నాయకులు ఎన్ని లేఖలు ఇచ్చినా రైల్వేజోన్ విషయమై కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచాకరమన్నారు. తమిళనాడుకు రైల్వేహబ్ కేటాయించిన ప్రభుత్వానికి ఆంధ్ర రాష్ట్రం కనిపించలేదా అని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న బీజేపీకి రాష్ట్రంలో సభలు, సమావేశాలు పెట్టే హక్కులేదన్నారు. మంత్రి వెంకయ్యనాయుడు ఏ ముఖం పెట్టుకొని రాష్ట్రానికి వస్తారన్నారు. విశాఖ రైల్వేజోన్ విషయమై ఎంపీలను నిలదీస్తామని తెలిపారు. ప్రజా ఉద్యమం ద్వారా జోన్ సాధనకు సిద్ధం కావాలన్నారు.

ఆశలు వమ్ము చేశారు...
అక్కయ్యపాలెం : ప్రత్యేక రైల్వేజోన్ ఆశలపై రైల్వే మంత్రి నీళ్ళు చల్లారని వైఎస్సార్‌సీపీ 13వ వార్డు అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ అన్నారు. ప్రత్యేక రైల్వే జోన్ వస్తే  పిల్లలకు ఉద్యోగాలోస్తాయని, ఉత్తరాంధ్రా అభివృద్ధి చెందుతుందని ఎంతో ఆశగా ఎదురు చూసిన కోటి మంది ప్రజానీకానికి బడ్జెట్‌లో మొండిచేయి చూపించారన్నారు. రైల్వే బడ్జెట్‌ప్రవేశ పెడుతుండడంతో మీడియాతో మాట్లాడడానికి వెళ్ళిన హేమంత్ కుమార్, ఏపీ స్టూడెంట్ జేఏసీ చైర్మన్ లగుడు గోవింద్, పొలిటికల్ జేఏసీ చైర్మన్ జె.టి.రామారావు, అట్టాడ అవినాష్‌లను పోలీసులు  గురువారం ఉదయం అరెస్టు చేసి ఫోర్త్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం 4:30 గంటలకు సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు.

బయటకు వచ్చిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లగుడు గోవింద్ మాట్లాడుతూ ప్రత్యేక జోన్, ప్రత్యేక ైరె ళ్ళు, ప్రత్యేక ప్రాజెక్టులు ఏమీ లేకుండా రైల్వే బడ్జెట్ నిరాశపర్చిందన్నారు. రూ.లక్షా 25 వేల కోట్ల బడ్జెట్‌లో రైల్వే మంత్రి  సురేష్ ప్రభు ఉత్తరాంధ్రాకు మొండిచేయి చూపించారన్నారు. పాలకులకు, ఎంపీలు, కేంద్ర మంత్రులకు చిత్తశుద్ధి ఉంటే  ఈనెల 29 లోగా ప్రత్యేక జోన్‌పై ప్రకటన చేయించాలన్నారు. లేదంటే ఎంపీలను, మంత్రులను అడుగడుగునా అడ్డుకొని నల్ల బాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తామన్నారు. శుక్రవారం రాష్ట్రంలోని అన్ని బీజేపీ జిల్లా కార్యాలయాలను ముట్టడిస్తామన్నారు. జేటీ రామారావు మాట్లాడుతూ ప్రత్యేక జోన్ ప్రకటన లేకుండా ఒట్టి చేతులతో వస్తే ఎంపీలను, మంత్రులను ఎయిర్‌పోర్టులో ఘెరావ్ చేసి టమాటో, కోడి గుడ్లతో కొడతామని హెచ్చరించారు.

 నిరాశపరిచింది...
విశాఖ కేంద్రంగా ైరె ల్వే జోన్ ఏర్పాటు చేస్తారని ఆశగా ఎదురు చూసిన ఉత్తరాంధ్ర ప్రజలకు నిరాశమిగిలింది. 2014 రాష్ట్ర విభజన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అగౌరవపరిచింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నరేంద్రమోడి వద్ద తాకట్టు పెట్టారు. రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి అరకొర కేటాయింపులు తప్ప పెద్దగా చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు ఏమీ లేవు. దీనికి రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు, రాష్ట్ర ముఖ్యమంత్రిదే పూర్తి బాధ్యత. -ద్రోణంరాజు శ్రీనివాసరావు,  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

జోన్‌పై మోసగించారు...

రైల్వే బడ్జెట్ రైల్వేను ప్రెవేటీకరణ చేసే విధంగా ఉంది. అదే కనుక జరిగితే భవిష్యత్తులో రైలు రవాణా సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పోతుంది. కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రులతో ఆటలాడుకోవడం అలవాటుగా మారింది. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయటంలో చిత్తశుద్ధి లోపించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంతో లాలూచి పడి ప్రతిదానికి తల ఊపడం ప్రారంభించింది. ఆంధ్రుల ఆత్మగౌరవం అంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు దానిని కేంద్రం కాళ్ళ వద్ద తాకట్టు పెట్టాడు. బడ్జెట్‌కు ముందు రైల్వే జోన్ వచ్చేస్తుందంటూ ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టారు. ఫైలు ప్రధానిమంత్రి కార్యాలయంలో ఉంది, ఇక ఇవ్వడమే తరువాయి అంటూ ప్రజలను మోసం చేయడం దుర్మార్గం.  -జె.వి.సత్యనారాయణమూర్తి, విశాఖ రైల్వేజోన్ సాధన సమితి కన్వీనర్

చంద్రబాబు వైఫల్యమే..
కేంద్రం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ఒక్క ప్రాజెక్టు కూడా కేటాయించ లేదు. దీనికి కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వైఫల్యమే కారణం. రైల్వే బడ్జెట్ కార్పొరేట్ల కోసమే అన్నట్లు ఉంది. ైరె ల్వే జోన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న విశాఖ ఉత్తరాంధ్ర వాసుల ఆశలు ఆవిరి చేసేలా రైల్వే బడ్జెట్ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు అనేక మార్లు హామీలు గుప్పించి వంచనకు పాల్పడ్డారు. 2017-18లో 9వేలు ఉద్యోగాలు తీస్తామని ప్రకటించారు. 2016-17లో నిరుద్యోగుల సంగతేంటి. -సీహెచ్ నరసింగరావు, సీపీయం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు(25వీఎస్‌సీ33)

చంద్రబాబు రాజీనామా చేయాలి
కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో ఆంధ్ర ప్రదేశ్‌కు తీరని అన్యాయం జరిగింది. 32సార్లు ఢిల్లీకి వెళ్లానని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి రాష్ట్రానికి సాధించింది ఏమిటి? రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేదు. తొమ్మిదేళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి బడ్జెట్‌లో రాష్ట్రానికి అరకొర నిధులను మాత్రమే తీసుకురాగలిగారు. దీనికి పూర్తిగా చంద్రబాబు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. - కొయ్య ప్రసాదరెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి

చంద్రబాబే కారణం..
విశాఖకు రైల్వే బడ్జెట్‌లో ప్రత్యేక జోన్‌గా ప్రకటించకపోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరే కారణం. ఒడిశా సీఎంకు భయపడి చంద్రబాబు జోన్‌పై గట్టిగా పోరాడడం లేదు. రైల్వే బడ్జెట్‌లో విశాఖకు జోన్ ప్రకటించలేదు, ఈ డివిజన్‌కు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇవన్నీ చూస్తే అడిగే వారు లేరని ఇక్కడ వారిని కేంద్రంలోని పెద్దలు గొర్రెలు, మేకలుగాను భావిస్తున్నారు. పదేళ్లుగా విశాఖ ప్రత్యేక రైల్వే జోన్‌పై అదిగో ఇదిగో అంటూ కళ్లలో దుమ్ము కొడుతున్నారు. జోన్ సాధించలేకపోయిన ఎంపీ హరిబాబును విశాఖ వాసులు ఊళ్లోకి రానీయవద్దు. దేశంలోనే రాబడిలో మూడో స్థానంలో ఉన్న వాల్తేరు డివిజన్‌పై ఇంతలా నిర్లక్ష్యం తగదు.
                    -సీఎస్ రావు, అధ్యక్షుడు, ప్రజాస్పందన

ఆశాజనకం
బ్రాడ్ గేజ్ నెట్‌వర్క్ పరిధిలో ఉన్న మానవరహిత లెవెల్ క్రాసింగ్‌లపై రైల్వే మంత్రి ప్రత్యేక దృష్టి కనబరిచారు. జీరో ప్రమాదప్రాంతంగా రైల్వేను మార్చాలనే ఉద్దేశం కలిగివుంటడం అభినందనీయం. వీటితోపాటు సీసీ కెమెరా సర్వైవలెన్స్, వైఫై వంటి సదుపాయాల కల్పనకు ప్రాముఖ్యతనివ్వడం ఆనందాన్ని కలుగజేసింది. విశాఖ రైల్వేజోన్, కొత్తరైళ్ల విషయంలో నిరాశ ఎదురైంది. -మంత్రి గంటా శ్రీనివాసరావు

తీవ్ర అన్యాయం
సురేష్ ప్రభు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగింది. ఎంతో ఆశగా ఎదురుచూసినా, ఆ ఆశ నిరాశగానే మిగిలింది. కొత్తరైళ్లు, రైళ్ల పొడిగింపు, ప్రాజెక్టుల విషయంలో మొండిచేయి చూపడం దారుణం. ఈ తరహా బడ్జెట్‌ను గతంలో ఎన్నడూ చూడలేదు.
               -టి.సుబ్బిరామిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు

రైల్వేజోన్ ప్రకటించకపోవడం అన్యాయం
రాష్ట్రం విడిపోయిన దగ్గరనుంచి ఇదిగో అదిగో అంటూ ఊరిస్తున్న రైల్వే జోన్‌ను బడ్జెట్‌లో ప్రకటించకపోవడం అన్యాయం. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం, రాష్ట్రం విడదీసినప్పుడు ఇచ్చిన హామీ మేరకు వెంటనే విశాఖను జోన్‌గా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలి -మంత్రి రాజశేఖర్, ఐఎన్‌టీయుసీ జిల్లా అధ్యక్షుడు

 భగ్గుమన్న  ఆందోళనలు
తాటిచెట్లపాలెం : రైల్వేబడ్జెట్‌లో విశాఖ రైల్వేజోన్ ప్రతిపాదన అంశానికి కేంద్ర ప్రభుత్వం మొండిచెయ్యి చూపడంపై వామపక్షపార్టీలు ఆందోళనకు దిగాయి. ఈ మేరకు గురువారం విశాఖ రైల్వేస్టేషన్‌లో సీపీఐ, సీపీఎం నేతలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారతీరుకి వ్యతిరేకంగా నినాదాలు చేసి, నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ.జె.స్టాలిన్ మాట్లాడుతూ ఏపీ పునర్విభజన బిల్లులో పొందుపర్చిన ఏ హామీలనూ కేంద్రప్రభుత్వం నెరవేర్చలేదన్నారు.

రైల్వే బడ్జెట్‌లో ఇదిగో..జోన్..అదిగో జోన్ అంటూ మభ్యపెట్టిన కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల సవతితల్లి ప్రేమ ప్రతిసారీ ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్ లో కానవస్తోందని దుయ్యబట్టారు. సీపీఎం నగర కార్యదర్శి గంగారాం మాట్లాడుతూ సిగ్గులేని పాలనచేస్తూ, పరమానందయ్య శిష్యగణంతో కాలక్షేపం చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం తన కొలువులో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అమాత్య గణం చేత తక్షణం రాజీనామా చేయించాలనీ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఏకత్రాటిపై నిల్చుని కేంద్రప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలన్నారు. ఈ నిరసనలో సీపీఎం నాయకులు శేఖర్, వరలక్ష్మి, మాధవి తోపాటు సీపీఐ నాయకులు విమల, రాంబాబు,మార్కండేయులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement