కరుణించు.. ప్రభూ! | Railway Budget | Sakshi
Sakshi News home page

కరుణించు.. ప్రభూ!

Published Thu, Feb 25 2016 1:10 AM | Last Updated on Sun, Sep 3 2017 6:20 PM

Railway Budget

సాక్షి ప్రతినిధి, కాకినాడ : దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జిల్లాకు కొత్త రైల్వే లైన్ ఏ ఒక్కటీ రాలేదనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. జిల్లాలో రైల్వే మార్గం నిడివి కేవలం 135 కిలో మీటర్లే. అందుకే కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైన్ సాధనకు కోనసీమ యువత ఉద్యమబాట పట్టారు. కాకినాడ-పిఠాపురం రైల్వే లైన్ కోసం డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఏటా రూ.వెయ్యి కోట్ల వరకూ దక్షిణ మధ్య రైల్వేకు ఆదాయాన్ని సమకూర్చుతున్నా రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు మొండిచెయ్యి మిగులుతోంది. ఈ ఖర్చులో సగం భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే ఆయా ప్రాజెక్టులను ముందుగా చేపడతామని రైల్వే శాఖ గతంలోనే ప్రకటించినా ఇప్పటివరకూ ఆ దిశగా అడుగులు ముందుకు పడలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సారైనా కలల ప్రాజెక్టులు సాకారం అవుతాయో లేదోనని ఆశతో ప్రజలు ఎదురుచూస్తున్నారు. మరో కొద్ది గంటల్లో ఆ విషయం ఏమిటనేదీ తేలిపోతుంది!
 
 ఉన్న రైళ్లు మరింత సౌకర్యం కావాలంటే...
 జిల్లాలో రాజమండ్రి తర్వాత అంత ప్రాధాన్యం ఉన్న నగరం కాకినాడే అయినా రైలు సౌకర్యంలో వెనుకంజలోనే ఉంది. ఇప్పటికే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కొన్ని రైళ్లను కొన్ని మార్పులు చేస్తే మరింత సౌకర్యవంతంగా ఉంటాయని ప్రయాణికులు కోరుతున్నారు. కాకినాడ నుంచి ముంబైకి వెళ్లే లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌ను బుధ, శనివారాల్లో మాత్రమే వెళ్తోంది. దీన్ని మంగళ, శుక్రవారాలకు మార్చితే కాకినాడ నుంచి సికింద్రాబాద్‌కు ప్రతిరోజూ అదీ ఉదయం పూట రైలు సౌకర్యం లభిస్తుంది. వారానికి మూడు రోజులు తిరుగుతున్న కాకినాడ-షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ను రోజువారీ తిప్పాలనే డిమాండు ఉంది.
 
 కాకినాడ నుంచి సికింద్రాబాద్‌కు వారానికి మూడ్రోజులు తిరుగుతున్న కోకనాడ ఏసీ ఎక్స్‌ప్రెస్‌ను ప్రతిరోజూ తిప్పితే ఉపయోగకరంగా ఉంటుంది. పశ్చిమభారత రాష్ట్రాలకు వెళ్లడానికి కాకినాడ నుంచి వారానికి ఒకరోజు మాత్రమే ఉన్న ఏకైక రైలు భావనగర్ ఎక్స్‌ప్రెస్‌ను  వారంలో రెండు లేదా మూడు సార్లు తిప్పితే జిల్లాలో ఉన్న మార్వాడీలు, పర్యాటకులకు ప్రయాణ వెసులుబాటు లభిస్తుంది. కాకినాడ నుంచి చెన్నైకు వెళ్లే సర్కారు ఎక్స్‌ప్రెస్‌ను పుదుచ్ఛేరి వరకూ పొడిగించాలనే డిమాండు కూడా ఎప్పటినుంచో ఉంది.
 
 అన్నవరంలో గరీబ్థ్,్ర కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లకు కూడా హాల్ట్ కల్పించాలి. కాకినాడ-విశాఖపట్నం, కాకినాడ-విజయవాడ ఫాస్ట్ పాసింజర్ రైళ్లు, శేషాద్రి, సర్కారు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు వేయాలనే డిమాండు ఉంది. అలాగే కోల్‌కతా, న్యూఢిల్లీ (వయా విశాఖపట్నం, వారణాసి), జోథ్‌పూర్ ప్రాంతాలకు కాకినాడ నుంచి కొత్తగా రైళ్లు వేయాలని దీర్ఘకాలంగా డిమాండు వినిపిస్తోంది. ఇక హాల్ట్‌ల విషయానికొస్తే సామర్లకోట, పిఠాపురం, అనపర్తి, అన్నవరం తదితర ముఖ్య పట్టణాల స్టేషన్లలో కొన్ని ప్రధాన రైళ్లకు హాల్ట్ ఇస్తే రైలు సౌకర్యం మరింత మందికి అందుబాటులోకి వస్తుంది.
 
 సౌత్‌కోస్టల్ రైల్వే జోన్ వస్తే...
 యానాం-ఎదుర్లంక వంతెన పూర్తయ్యిన తర్వాత కోనసీమ స్వరూపమే మారిపోయింది. అలా రైల్వే ప్రాజెక్టుల విషయంలోనూ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా సౌత్‌కోస్టల్ రైల్వే జోన్ అత్యవసరం. ఈ బడ్జెట్‌లోనైనా ప్రకటించాలనే డిమాండు అన్ని వర్గాల నుంచి ఇప్పటికే రైల్వే శాఖకు వినిపించారు. ఇది సాకారమైతే చాలా పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం లభిస్తుంది. తీర ప్రాంతం వెంబడి పోర్టులను అనుసంధానిస్తూ రైల్వేలైను వేస్తే వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకుంటాయి. అలాగే కొవ్వూరు-భద్రాచలం రైల్వే లైను వేస్తే హైదరాబాద్, వరంగల్ వైపు ప్రయాణసమయం తగ్గుతుంది.
 - వైడీ రామారావు, అధ్యక్షుడు, తూర్పుగోదావరి జిల్లా-కోకనాడ ప్రయాణికుల సంఘం
 
 
 గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా...
 కోనసీమను కలిపే సుమారు 60 కిలోమీటర్ల కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైను ప్రాజెక్టు గత 15 ఏళ్లుగా పెండింగ్‌లోనే ఉంది. రూ.345 కోట్ల అంచనా వ్యయంతో 2002, నవంబరు 16న అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ అమలాపురంలో పునాదిరాయి వేశారు. ముక్తేశ్వరం నుంచి అమలాపురం వరకూ లైన్‌కు దాదాపు 85 ఎకరాల భూమిని రైల్వే శాఖ సేకరించింది. అమలాపురం సమీప భట్నవిల్లిలో రైల్వేస్టేషన్ నిర్మాణానికి 2005లో అప్పటి రైల్వే సహాయ మంత్రి తంగవేలు శంకుస్థాపన చేశారు.
 
  ఇప్పటివరకూ దీనికి కేటాయించింది రూ.70 కోట్లు మాత్రమే. ఈ లైనులో గౌతమి, వైనతేయ, వశిష్ట నదులపై భారీ రైలు వంతెనలు, కాలువలపై 15 పెద్దవి, 150 వరకూ చిన్నచిన్న వంతెనలు నిర్మించాల్సి ఉంది. దీనివల్ల కిలోమీటరుకు రూ.50 కోట్ల చొప్పున ఖర్చు అవుతుందని అంచనా. ఆమోదముద్ర పడి ఆగిపోయిన ప్రాజెక్టుల్లో కాకినాడ-పిఠాపురం లైన్ మరొకటి. ఏటా బడ్జెట్‌లో కొంతమొత్తంలో రైల్వేశాఖ కేటాయిస్తూ వస్తోంది తప్ప పూర్తిస్థాయి కేటాయింపులు లేవు.
 
 ఇప్పుడు దీన్ని పూర్తి చేయాలంటే సుమారు రూ.200 కోట్ల వరకూ నిధులు అవసరం. ఈ లైన్ సాకారమైతే కాకినాడకు హౌరా-చెన్నై రైల్వే మార్గంతో అనుసంధానం ఏర్పడుతుంది. దీన్నే ప్రస్తుతం విస్తరణ జరుగుతున్న 216 నంబరు జాతీయ రహదారికి సమాంతరంగా నిర్మించాలనే సూచనలు వస్తున్నాయి. ఇది మరింత ఉపయోగకరం కావాలంటే ఈలైన్‌ను పిఠాపురం దగ్గర గాకుండా కాకినాడ నుంచి తీరం వెంబడి ఎస్‌ఈజడ్ మీదుగా అన్నవరం వద్ద అనుసంధానం చేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement