ఈ పనికిరాని మీటింగులెందుకు? | MPs fires on Railway Budget | Sakshi
Sakshi News home page

ఈ పనికిరాని మీటింగులెందుకు?

Published Thu, Jan 7 2016 4:11 AM | Last Updated on Thu, Aug 9 2018 4:48 PM

ఈ పనికిరాని మీటింగులెందుకు? - Sakshi

ఈ పనికిరాని మీటింగులెందుకు?

రైల్వే బడ్జెట్ సన్నాహక సమావేశంలో ఎంపీల ఆగ్రహం
♦ ఈ భేటీలతో టైం వేస్ట్ తప్ప.. ఫలితమేముంది?
♦ మా ప్రతిపాదనలను పట్టించుకునే నాథుడే లేడు
♦ మేం గతంలో చేసిన సూచనలను ఎందుకు పక్కన పడేశారు
♦ జీఎం చెప్పేది వినడం తప్ప చేసేదేమీ లేదు
♦ మళ్లీ భేటీ ఏర్పాటు చేస్తే రైల్వే మంత్రి లేదా బోర్డు చైర్మన్ రావాలి
 
 సాక్షి, హైదరాబాద్: ‘‘రెండు దశాబ్దాల కిందట మంజూరైన ప్రాజెక్టు పనులు ఇప్పటికీ మొదలు కాలేదంటే రైల్వేశాఖ పనితీరు ఎలా ఉందో అర్థమవుతోంది. బడ్జెట్‌లో నిధులిచ్చినా పనులు మొదలు కాలేదంటే నా జీవితంలో దాన్ని చూస్తానన్న నమ్మకం పోయింది. దీనిపై పార్లమెంటులో సభాహక్కుల తీర్మానం పెడతా.. అక్కడ నిరాహారదీక్షకు కూర్చుంటా..’’
 - నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి
 
 ‘‘ఎలాంటి ఫలితం లేని ఈ సమావేశాలతో మా విలువైన సమయాన్ని ఎందుకు వృథా చేస్తున్నారు. వచ్చే సంవత్సరం మళ్లీ భేటీ ఏర్పాటు చేస్తే రైల్వే మంత్రి లేదా రైల్వే బోర్డు చైర్మన్ రావాల్సిందే..’’
 - మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి
 
 ...రైల్వే బడ్జెట్ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్రగుప్తా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీల ఆగ్రహావేశాలివీ! బుధవారం దక్షిణ మధ్య రైల్వేలోని హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల పరిధిలోని ఎంపీలతో జీఎం రైల్‌నిలయంలో భేటీ నిర్వహించారు. ఎంపీలు నగేశ్, బూర నర్సయ్య గౌడ్, కొండా విశ్వేశ్వరరెడ్డి, బి.వినోద్‌కుమార్, సీతారాం నాయక్, జితేందర్‌రెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి, నంది ఎల్లయ్య, గుత్తా సుఖేందర్‌రెడ్డి, బాల్క సుమన్, బీబీ పాటిల్, పసునూరి దయాకర్, రాపోలు ఆనంద భాస్కర్, దేవేందర్‌గౌడ్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైల్వే పనితీరుపై ఎంపీలు నిప్పులు చెరిగారు. ప్రజలేం కోరుకుంటున్నారో గుర్తించి రైల్వే శాఖ ముందు ప్రతిపాదనలు ఉంచితే వాటిని పట్టించుకునే నాథుడే లేడంటూ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. డిమాండ్లను రైల్వే బోర్డుకు చేరవే సి చేతులు దులుపుకునే ఇలాంటి సమావేశాలతో.. సమయం వృథా తప్ప మరో ఉపయోగమే లేదంటూ మండిపడ్డారు.

 ఈసారి వాళ్లొస్తేనే మీటింగ్..
 గత బడ్జెట్ ముందు ఇదే తరహాలో నిర్వహించిన సమావేశంలో తాము చేసిన సూచనలను పట్టించుకోకపోవటాన్ని ఎంపీలు ఈ సందర్భంగా లేవనెత్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మాటలు వినడం తప్ప జీఎం చేసేదేమీ లేనప్పుడు ఈ సమావేశాలెందుకని ఎంపీ జితేందర్‌రెడ్డి ప్రశ్నించారు. రైల్వే మంత్రి లేదా రైల్వే బోర్డు చైర్మన్ పాల్గొంటే తప్ప వచ్చేసారి ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేయొద్ద న్నారు. ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పటికీ అధికారులు తమను పట్టించుకోవటం లేదని బాల్క సుమన్ మండిపడ్డారు. నియోజకవర్గానికి ఓ సీనియర్ అధికారిని నియమించి తమతో కలిసి పనుల పురోగతిని పరిశీలించే ఏర్పాటు చేస్తేనే ఉపయోగం ఉంటుందని సుమన్‌తోపాటు జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు.

 వాకౌట్ చేసిన గుత్తా
 రైల్వే శాఖ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి సమావేశం నుంచి వాకౌట్ చేశారు. నల్లగొండ-మాచెర్ల మధ్య 20 ఏళ్ల కిందట కొత్త లైన్ మంజూరైందని, దాన్ని 2011 బడ్జెట్‌లో ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తించారని చెప్పారు. గత బడ్జెట్‌లో రూ.10 కోట్లు కేటాయించారని కానీ ఇప్పటివరకు పనులే ప్రారంభించలేదన్నారు. కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి రైల్వే సహాయ మంత్రిగా ఉండగా.. పనులు  మొదలుపెట్టాలని కోరినా పట్టించుకోలేదన్నా రు. ఇదే విషయమై వచ్చే పార్లమెంటు సమావేశాల్లో సభా హక్కుల తీర్మానం ప్రవేశపెడతామని, అవసరమైతే నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. తన జీవితకాలంలో ఆ ప్రాజెక్టును చూస్తానన్న నమ్మకం కూడా లేదం టూ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. జగ్గయ్యపేట-మేళ్లచెరువు లైన్ విషయంలో భూసేకరణకు సంబంధించి జిల్లా కలెక్టర్, తాను రైతులతో మాట్లాడుతున్నా రైల్వే అధికారులెవరూ రావటం లేదని ఆయన ఆరోపించారు.

 కరీంనగర్-ముంబై ఎక్స్‌ప్రెస్ ప్రారంభించండి
 పెద్దపల్లి-నిజామాబాద్ కొత్త మార్గంలో చిన్న బిట్ మాత్రమే పెండింగులో ఉందని, ఆ పనులు వేగంగా పూర్తిచేసి తెలంగాణ ఆవి ర్భావ దినోత్సవమైన జూన్ 2న కరీంనగర్-ముంబై మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభించాలని ఎంపీవినోద్ కోరారు. ‘ఈ ప్రాంతం నుంచి ముంబై వెళ్లేవారి సంఖ్య తీవ్రంగా ఉన్నందున నిత్యం 100 బస్సులు తిరుగుతున్నాయి. అంత డిమాండ్ ఉన్న మార్గం అయినందున దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి’’ అని కోరారు. అయితే ట్రయల్ రన్ నిర్వహించాల్సి ఉన్నందున డిసెంబర్ వరకు అది సాధ్యం కాదని జీఎం తెలిపారు. మహబూబ్‌నగర్-సికింద్రాబాద్ డబ్లింగ్ పనులు ఆర్‌వీఎన్‌ఎల్‌కు కేటాయించొద్దని, నేరుగా రైల్వే శాఖనే నిర్వహించాలని ఎంపీ జితేందర్‌రెడ్డి కోరారు.

చర్లపల్లి, నాగులపల్లి, హైటెక్‌సిటీ రైల్వే స్టేష న్‌ల వద్ద ఖాళీ స్థలం అందుబాటులో ఉన్నం దున 3 చోట్ల భారీ టెర్మినళ్లు నిర్మించి ప్రస్తుత స్టేషన్‌లపై భారం తగ్గించాలని వినోద్ సూచిం చారు. బోగస్ ఎస్సీ, ఎస్టీ సర్టిఫికెట్లతో కొందరు రైల్వే ఉద్యోగాలు పొందారని, వారిని గుర్తించి విధుల్లోంచి తొలగించి కేసులు నమోదు చేయాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు. రైల్వేలోని గ్రూప్-డి పోస్టుల్లో తెలంగాణ వారిని కాదని యూపీ, బిహార్, రాజస్థాన్ వారిని స్థాని కంగా నియమించటాన్ని తప్పు పట్టారు. సమ్మక్క జాతర నేపథ్యంలో విజయవాడ-బల్లార్షా మధ్య ప్రత్యేక రైళ్లు నడపాలని కోరారు. మరోవైపు కాజీపేటకు మంజూరైన వ్యాగన్ వీల్ ఫ్యాక్టరీ ప్రతిపాదనను రైల్వే అటకెక్కించినట్లు ఈ సమావేశం ద్వారా తేలిపోయింది. అక్కడ వ్యాగన్ మరమ్మతు కేంద్రాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు జీఎం గుప్తా ఎంపీల దృష్టికి తెచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement