ఆగని మోదీ బండి | The capital of the depression in the railway budget | Sakshi
Sakshi News home page

ఆగని మోదీ బండి

Published Fri, Feb 27 2015 12:05 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

ఆగని మోదీ బండి - Sakshi

ఆగని మోదీ బండి

నగరవాసుల ఆశలు అడియాసలే.. ఉస్సూరనిపించిన రైల్వేబడ్జెట్ ఊసులేని టర్మినల్స్  రెండో దశకు రూ.8 కోట్లు  కొత్త రైళ్ల ప్రతిపాదనే లేదు  కొత్తపల్లి, మహబూబ్‌నగర్ మార్గాలకు నిధులు  నగరంలోని ప్రధాన స్టేషన్లు, పలు ఎంఎంటీఎస్‌ల్లో వైఫై సౌకర్యం
 
నరేంద్ర మోడీ, సురేష్ ప్రభు రైలు భాగ్యనగరంలో ఆగకుండానే వెళ్లిపోయింది. గురువారం కేంద్ర రైల్వేమంత్రి సురేష్ ప్రభు ప్రవేశపెట్టిన బడ్జెట్ నగరవాసుల ఆశలను అడియాశలు చేసింది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ ప్రధాన రైల్వేస్టేషన్‌లతో పాటు కొన్ని ఎంఎంటీఎస్ స్టేషన్‌లకు  వైఫై సేవలను అందుబాటులోకి  తేవడం, ప్రధాన రైళ్ల రాకపోకలపై ప్రయాణికులకు ఎస్సెమ్మెస్ ద్వారా సమాచారం అందజేయడం మినహా ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తిగా విస్మరించారు. సుమారు రూ.850 కోట్లతో చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశకు ఈ ఏడాది కేవలం రూ.8 కోట్లు కేటాయిస్తున్నట్లు  ప్రకటించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నివారించేందుకు గత బడ్జెట్‌లో మౌలాలి, వట్టినాగులపల్లిలో  భారీ టర్మినళ్లు నిర్మించనున్నట్లు ప్రకటించినా అందుకు సంబందించి సప్రస్తుత బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం గమనార్హం. సికింద్రాబాద్ స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలనే  ప్రతిపాదనపై కూడా ఎలాంటి ప్రస్తావ చేయలేదు. సికింద్రాబాద్ నుంచి మహబూబ్‌నగర్, మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు రెండు  కొత్త రైలు మార్గాలకు మాత్రం  అరకొర నిధులు కేటాయించారు. మొత్తంగా  రైల్వే బడ్జెట్ కొద్దిపాటి సదుపాయాలు మినహా  ఎలాంటి హామీలు, నిధులు, ప్రాజెక్టులు, ప్రతిపాదనలు లేకుండానే ఏటేటా వచ్చే ఒక తంతులాగా సాగిపోయింది.
 - సాక్షి,సిటీబ్యూరో
 
అందుబాటులోకి వైఫై సేవలు...
 
నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి,కాచిగూడ ప్రధాన రైల్వేస్టేషన్‌లతో పాటు, బేగంపేట్, లింగంపల్లి, హైటెక్‌సిటీ, మల్కాజిగిరి, మౌలాలీ, ఉందానగర్, తదితర ఎంఎంటీఎస్ స్టేషన్‌లలో  ప్రయాణికులకు కొత్తగా వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. అలాగే ప్రయాణికులు తాము బుక్ చేసుకొన్న  రైళ్ల రాకపోకలపై ఎస్సెమ్మెస్ ద్వారా మొబైల్ ఫోన్లకు సమాచారం అందించే సదుపాయం కల్పించారు. కౌంటర్ల కొరత కారణంగా  జనరల్ బోగీ  ప్రయాణికులకు సకాలంలో టిక్కెట్లు దొరక్క రైళ్లు అందుకోలేకపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు అన్ని ఎంఎంటీఎస్ స్టేషన్‌లతో పాటు, సికింద్రాబాద్, నాంపల్లి,కాచిగూడ రైల్వేస్టేషన్‌లలో  జనరల్ కౌంటర్ల సంఖ్యను పెంచనున్నారు. మరిన్ని ఆటోమెటిక్ టిక్కెట్ వెండింగ్ యంత్రాలను అందుబాటులోకి తేనున్నారు. మహిళా ప్రయాణికుల భద్రత  దృష్ట్యా   అన్ని లేడీ కంపార్టుమెంట్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు నగరంలోని ఎంఎంటీఎస్ రైళ్లు, మాతృభూమి లేడీస్ స్పెషల్ ట్రైన్‌లో  పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయడంతో బోగీల్లో సీసీ కెమెరాలు అందుబాటులోకి రానున్నాయి. జనరల్ బోగీల్లో ప్రయాణించేవారికి మొబైల్ రీ చార్జింగ్ సదుపాయం అందుబాటులో తేనున్నారు.
 
వంతెన’ దాట వేశారు
 
ఈసారి  బడ్జెట్‌లో రైల్వే వంతెనల నిర్మాణంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. నగరంలో 13 ప్రాంతాల్లో ఆర్‌ఓబీలు, ఆర్‌యూబీలు నిర్మించాలన్న ప్రతిపాదనలు ఉన్నా ఇప్పటి వరకు లక్డికాఫూల్, ఆలుగడ్డ బావి మినహా ఎక్కడా పూర్తి కాలేదు. కొన్ని చోట్ల నిర్మాణ దశలో ఉన్నాయి. అయితే ఈ ఏడాది వాటిని పూర్తి చేసేందుకు ఒక్కపైసా విడుదల చేయలేదు.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను వరల్డ్‌క్లాస్ స్టేషన్‌గా అభివృద్ధి చేయడానికి బదులు స్టేషన్ పైన ఉన్న ఖాళీ స్థలాన్ని వాణిజ్య అవసరాల కోసం వినియోగించుకోనున్నట్లు పేర్కొన్నారు. హోటళ్లు, షాపింగ్‌కాంప్లెక్‌లు, ప్రయాణికుల వసతి కేంద్రాలను  ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు దక్షిణమధ్య రైల్వే జీఎం పి.కె.శ్రీవాస్తవ  పేర్కొన్నారు.
 
 
క్రమసంఖ్య       {పతిపాదన                                        పురోగతి
 
1)   వట్టినాగులపల్లి,మౌలాలీ టర్మినళ్లు                          ఒక్క రూపాయి  కూడా కేటాయించలేదు.
2 )   కింద్రాబాద్ వరల్డ్‌క్లాస్  స్టేషన్‌గా అభివృద్ధి                 పూర్తిగా విస్మరించారు.
3)    లాలాపేట్ ఆసుపత్రికి సూపర్‌స్పెషాలిటీ హోదా          నిధుల ఊసు లేదు.
4)    రైల్వే నర్సింగ్ కళాశాల                                        మరిచిపోయారు.
5)    ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మార్పు           మరిచారు.
6)    ఎంఎంటీఎస్ రెండో దశ                                         రూ.8 కోట్లు
7)    సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ రైలు మార్గం (113కి.మీ.)    రూ.27.44 కోట్లు
8)    మనోహరాబాద్-కొత్తపల్లి  (150 కి.మీ.)మార్గం          రూ.20 కోట్లు
9)    సికింద్రాబాద్-అజ్మీర్ దర్గా, హైదరాబాద్-తిరువనంతపురం రైళ్లు    {పస్తావన లేదు.
10)  సికింద్రాబాద్-షిరిడీ వైపు కొత్త రైళ్లు    లేవు
11)   హైదరాబాద్-జిల్లా కేంద్రాలకు ఇంటర్‌సిటీ సర్వీసులు   ప్రస్తావన లేదు
 
పత్తా లేని కొత్త రైళ్లు...
 
దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలకు హబ్‌గా ఉన్న హైదరాబాద్‌లో ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా పెరుగుతున్నా అందుకు తగినట్లుగా రైళ్ల సంఖ్య పెరగడం  లేదు. న్యూఢిల్లీ, ముంబయి, బెంగళూర్ వంటి నగరాలతో పాటు, తిరుపతి, షిరిడీ, అజ్మీర్,తదితర ప్రాంతాలకు రైళ్లను పెంచాలని  ప్రయాణికులే కాకుండా  న గరానికి చెందిన ప్రజాప్రతినిధులు, ఎంపీలు కూడా అనేక సార్లు  ప్రతిపాదించారు. అయితే ఈ సారి  బడ్జెట్‌లో కూడా  కొత్త రైళ్ల ఏర్పాటుపై ఎలాంటి ప్రస్తావన లేదు. నగరం నుంచి షిరిడీ  వెళ్లే  భక్తులకు  ప్రస్తుతం మన్మాడ్ ఎక్స్‌ప్రెస్  ఒక్కటే  ఉంది. కాకినాడ నుంచి నేరుగా షిరిడీ వరకు  సాయినగర్ ఎక్స్‌ప్రెస్ వారానికి రెండు రోజులే నడుస్తుంది. ఈ రూట్‌లో  హైదరాబాద్ నుంచి మరో రైలు నడపాలనే డిమాండ్ ఉన్నా పట్టించుకోలేదు. అలాగే ప్రస్తుతం అయ్యప్ప భక్తుల కోసం శబరి ఎక్స్‌ప్రెస్ ఒక్కటే ఉంది. నగరం నుంచి తిరువనంతపురంకు మరో ఎక్స్‌ప్రెస్ తప్పనిసరి. అయితే ఆయా మార్గాల్లో ఒక్క రైలును కూడా అదనంగా ప్రకటించకపోవడం ప్రయాణికులను తీవ్ర నిరాశకు గురి చేసింది.
 
కొత్త లైన్‌లు...
 
సికింద్రాబాద్ నుంచి మహబూబ్‌నగర్‌కు నిర్మించతలపెట్టిన 110 కిలోమీటర్‌ల కొత్త లైన్‌లకు  ఈ బడ్జెట్‌లో  రూ.27.44 కోట్లు కేటాయించారు. అలాగే మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే మార్గానికి  మరో రూ.20 కోట్లు కేటాయించారు. ఈ రెండు మార్గాలు తప్ప మిగతా ఏ రూట్‌లోనూ కొత్త లైన్‌లపైన ప్రతిపాదనలు లేవు.
 
నర్సింగ్ కాలేజీ మరిచారు...
 
లాలాగూడలోని దక్షిణమధ్య రైల్వే కేంద్రీయ ఆసుపత్రిని సూపర్‌స్పెషాలిటీ హోదాకు పెంచడంతో పాటు, నర్సింగ్ కళాశాలను నిర్మించాలనే గత బడ్జెట్ ప్రతిపాదన కూడా  ఈ సారి  ఆచరణకు నోచుకోలేదు. ఈ రెండు  భవనాల కోసం ఎలాంటి కేటాయింపులు జరపకపోవడం గమనార్హం.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement