రైల్వే బడ్జెట్‌లో తమిళనాడుకు ప్రత్యేకంగా కేటాయింపులు జరపాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం జయలలిత విజ్ఞప్తి చేశారు. పాత పథకాలకు నిధులు, కొత్త ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేయాలని కోరారు. గురువారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అందులో రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పథకాల పనులు, కొత్త ప్రాజెక్టులను వివరించారు.
సాక్షి, చెన్నై : తమిళనాడు అభివృద్ధి పథంలో దూసుకెళుతోందని, ఇక్కడ పెట్టుబడులకు పెద్ద ఎత్తున విదేశీ సంస్థలు ముందుకు వస్తున్నాయని వివరించారు. పరిశ్రమల స్థాపన , నిర్మాణాల వేగం పెరిగిందని పేర్కొంటూ, విజన్ 2023 గురించి వివరించారు. తాము రూపకల్పన చేసిన విజన్ మేరకు పది ముఖ్య రైల్వే పథకాలను గురించి ఇప్పటికే రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్లి ఉన్నామన్నారు. ఇందులో చెన్నై - కన్యాకుమారి రెండు రైల్వే మార్గం, శ్రీ పెరంబదూరు - గిండి మధ్య గూడ్స్ రైల్వే మార్గం, చెన్నై , తూత్తుకుడి మధ్య మరో గూడ్స్ మార్గం , చెన్నై - మదురై, కన్యాకుమారి, మదురై - కోయంబత్తూరు, కోయంబత్తూరు - చెన్నై, చెన్నై - బెంగళూరుల మధ్య సూపర్ ఫాస్ట్ రైళ్ల కోసం ప్రత్యేక మార్గాలు ఉన్నాయని వివరించారు.
అలాగే, చెన్నై - బెంగళూరు గూడ్స్ ట్రాక్, ఆవడి - గూడువాంజేరి గూడ్స్ రైళ్ల ట్రాక్, ఆవడి- హార్బర్ వైపుగా మరో ట్రాక్ పనులు గుర్తించామని సూచించారు. వీటిలో తొలి ప్రాధాన్యతగా చెన్నై -తూత్తుకుడి గూడ్స్ రైలు మార్గం, మదురై - కన్యాకుమారి మధ్య సూపర్ ఫాస్ట్‌కు ప్రత్యేక మార్గాన్ని ఎంపిక చేశామని పేర్కొన్నారు. తమ విజన్‌లో ఉన్న పథకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చే పట్టేందుకు సిద్ధం అని , ఇందుకు తగ్గ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఇక, గతంలో ప్రవేశ పెట్టిన రైల్వే బడ్జెట్‌లలో తమిళనాడుకు పథకాలు, ప్రాజెక్టుల్ని కేటాయించారని, అయితే, అవి అమలుకు నోచుకోక పోవడం శోచనీయమన్నారు.
ఈ పథకాల్ని అమల్లోకి తెచ్చే విధంగా ప్రత్యేక కేటాయింపులు, ప్రాధాన్యత ఇవ్వాలని విన్నవించారు. ఆ మేరకు గతంలో జరిగిన బడ్జెట్ ప్రకటనల్లోని ప్రాజెక్టులను తమరి దృష్టికి తీసుకొస్తున్నట్టు వివరించారు. ఇందులో మొరన్‌పూర్ - ధర్మపురి కొత్త రైల్వే మార్గం, చెన్నై సెంట్రల్- విల్లివాక్కం ఐదు, ఆరో మార్గం, విల్లివాక్కం - కాట్పాడి కొత్త మార్గం , అరియలూరు - చిదంబరం మీదుగా ఆత్తూరుకు కొత్త మార్గం, దిండివనం - కన్యాకుమారి రెండో ట్రాక్ పనులు, బోడి - కొట్టాయం కొత్త మార్గం, రేణిగుంట - అరక్కోణం రెండో రైల్వే మార్గం,గుమ్మిడి పూండి - అత్తి పట్టు మధ్య మూడు, నాలుగో మార్గం పనులు ఉన్నాయని గుర్తు చేశారు.
అలాగే, కృష్ణగిరి మీదుగా జోలార్ పేట నుంచి హోసూరుకు కొత్త మార్గం, మైలాడుతురై నుంచి తిరుక్కడయూర్, తరంగంబాడి, తిరునల్లారు మీదుగా కారైక్కాల్‌కు కొత్త మార్గం, తూత్తుకుడి నుంచి తిరుచెందూరు మీదుగా రామనాధ పురం, కన్యాకుమారిలకు కొత్త మార్గం, రామనాధపురంకు మీదుగా తూత్తుకుడి కారైక్కుడి మీదు కొత్త మార్గం, శీర్గాలి , కారైక్కాల్ కొత్త మార్గం, పెరంబలూరు, అరియలూరు, కారైక్కాల్ మీదుగా సేలం, నామక్కల్‌కు కొత్త మార్గం, మదురై - బోడి నాయకనూర్ మార్గం విస్తరణ,
బోడి నాయకనూర్- ఎర్నాకులం కొత్త మార్గం, బోడి నాయకనూర్ , తేని మీదుగా దిండుగల్ కుములికి కొత్త మార్గం, తిరునల్వేలి - నాగర్ కోవిల్ మీదుగా కన్యాకుమారికి రెండో మార్గం, సైదా పేట శ్రీ పెరంబదూరు కొత్త మార్గం, చెన్నై నుంచి అరియలూరుకు కొత్త రైల్వే మార్గం, మేలూరు మీదుగా మదురై కారైక్కుడి కి కొత్త మార్గం పనులు ఉన్నాయని వివరించా రు. ఈపనులు చేపట్టేందుకు తగ్గ నిధు లు కేటాయించాలని, తమిళనాడుకు ప్రత్యేకంగా కేటాయింపులు జరపాలని విన్నవించారు. కాగా, అంతకు ముందు సచివాలయంలో వీడియో కాన్పెరెన్స్ ద్వారా సీఎం జయలలిత పలు ప్రారంభోత్సవాలు , శంకుస్థాపనలు చేశారు.
ప్రారంభోత్సవాలు : పెరంబలూరులో నిర్మించిన వృత్తి శిక్షణా కేంద్రాన్ని, కార్మిక శాఖ నేతృత్వంలో రూ. తొమ్మిది కోట్లతో నిర్మించిన భవనాలను, రూ. 30 కోట్లతో కుటీర, చిన్నతరహా పరిశ్రమల కోసం నిర్మించిన భవనాలు ప్రారంభించారు. అలాగే, రూ. 49 కోట్లతో కార్మిక శాఖ కోసం నిర్మించనున్న భవనం కోసం శంకుస్థాపన చేశారు. ఇక, భవన నిర్మాణ రంగంలో ఉన్న కూలి కార్మికుల కోసం వైద్య సేవల్ని అందించేందుకు వీలుగా మూడు ప్రత్యేక అంబులెన్స్‌లకు జెండా ఊపారు. ఇక, నిర్మాణ రంగంలో ఉన్న కార్మికులు ప్రమాద వశాత్తు మరణిస్తే నష్ట పరిహారంగా అందిస్తున్న రూ. లక్షను రూ. ఐదు లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పెంపును అమల్లోకి తెస్తూ, ఇటీవల సేలంలో మరణించిన కుమార్ భార్య భానుమతికి రూ. ఐదు లక్షలకు గాను చెక్కును సీఎం జయలలిత అందజేశారు.
రైల్వే బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వండి
Published Fri, Feb 12 2016 2:03 AM | Last Updated on Fri, Aug 24 2018 2:20 PM
Advertisement