జీఎస్టీతో శాశ్వత నష్టమే..
న్యూఢిల్లీః గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మొదటిసారి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. 29 డిమాండ్లతో కూడిన మెమోరాండంను ఆయనకు సమర్పించారు. ఈ సందర్భంలో తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను సైతం ఆమె ప్రధానికి వివరించారు. తమిళనాడుకు తగినంత ఆర్థికసాయాన్ని కూడ అందించాలని ఈ సందర్భంలో ఆమె కోరినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఎన్నికల తర్వాత మొదటిసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత.. దేశం కల్పించాలనుకుంటున్న ఏకీకృత పన్ను విధానం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. జీఎస్టీ ప్రభావం భారీ శాశ్వత నష్టాన్ని కలుగజేస్తుందని భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. తమిళనాడు మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలు జీఎస్టీ విషయంలో మద్దతు పలుకుతున్నాయని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్తుండగా, అదే విషయాన్ని జయలలిత ప్రధాని మోదీవద్ద ప్రస్తావించడం ప్రత్యేకతను సంతరించుకుంది.