impacts
-
రియల్టీ వృద్ధి: ద్రవ్యోల్బణం ప్రభావం ఎంత?
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ (రియల్టీ) రంగంలో వచ్చే ఆరు నెలల కాలానికి వృద్ధి పట్ల డెవలపర్లు, ఇన్వెస్టర్లు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్లు ఆశావహ అంచనాలతో ఉన్నాయి. అంతర్జాతీయంగా మాంద్యం భయాలు, మోర్ట్గేజ్ రేట్లు పెరుగుల ప్రభావం ఉన్నా కానీ, వృద్ధి పట్ల సానుకూల సెంటిమెంట్ నెలకొంది. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్, రియల్ ఎస్టేట్ డెవలపర్ల మండలి నరెడ్కో సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన ‘రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ క్యూ3, 2022’ నివేదికలో వెల్లడించాయి. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ క్వార్టర్లో సెంటిమెంట్ స్కోరు 62 ఉంటే, జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఇది 61కి తగ్గింది. ఈ స్కోరు 50కి పైన ఉంటా ఆశావహంగాను, 50 స్థాయిలో ఉంటే తటస్థం, అంతకు దిగువన ఉంటే నిరాశావాదంగా పరిగణిస్తారు. (Elon Musk ట్విటర్ డీల్ డన్: మస్క్ తొలి రియాక్షన్) స్వల్ప క్షీణత ‘‘అంతర్జాతీయంగా ప్రతికూల వాతావరణం, రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధంతో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో సెంటిమెంట్ స్కోరు అతి స్వల్పంగా తగ్గింది. రియల్ ఎస్టేట్ రంగం, భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడంతో ఈ రంగంలో ఇప్పటికీ సెంటిమెంట్ సానుకూలంగా ఉంది’’అని నైట్ ఫ్రాంక్ తెలిపింది. వచ్చే ఆరు నెలల కాలానికి భాగస్వామల అంచనాల ఆధారంగా నిర్ణయించే భవిష్యత్ సెంటిమెంట్ స్కోరు ఏప్రిల్-జూన్ క్వార్టర్లో 62 ఉంటే, సెప్టెంబర్ త్రైమాసికంలో 57కు తగ్గింది. ‘‘ద్రవ్యోల్బణం అధికంగానే ఉంది. దీనికితోడు మానిటరీ పాలసీ చర్యలు కఠినతరం అవుతున్నాయి. దీంతో వచ్చే ఆరు నెలల కాలానికి సంబంధించిన సెంటిమెంట్ స్కోరుపై ప్రభావం పడింది’’అని నైట్ ఫ్రాంక్ వివరించింది. (ఇన్వెస్టర్లకు రాబడులు: ఎల్ఐసీకి కేంద్రం సూచనలు) అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న ప్రతికూలతల ప్రభావం మన ఆర్థిక వ్యవస్థపై ఇంకా పూర్తి స్థాయిలో ప్రతిఫలించలేదని రియల్ ఎస్టేట్ భాగస్వాములు భావిస్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది. దీంతో ప్రస్తుత, భవిష్యత్తు అంచనాల విషయంలో కొంత అప్రమత్త ధోరణితో ఉన్నట్టు పేర్కొంది. రెపో రేట్ల పెంపు తర్వాత ఇళ్ల అందుబాటుపైనా ప్రభావం పడినట్టు తెలిపింది. ‘‘రియల్ ఎస్టేట్‌లో ఇళ్ల అమ్మకాలు గత కొన్ని నెలలుగా పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ అనిశ్చితులు, ద్రవ్యోల్బణం నెలకొన్నప్పటికీ ఈ రంగం బలమైన పనితీరు చూపిస్తోంది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కొనుగోలుదారులు రియల్టీలో పెట్టుబడులు కొనసాగిస్తారు’’అని నరెడ్కో ప్రెసిడెంట్ రాజన్ బండేల్కర్ వివరించారు. -
ఐటీ కంపెనీలకు యుద్ధం సెగ
న్యూఢిల్లీ: ఉక్రెయిన్–రష్యా సంక్షోభ ప్రభావం భారత ఐటీ కంపెనీలనూ తాకుతోంది. ప్రత్యక్షంగా భారత ఐటీ కంపెనీలపై పడే ప్రభావం కంటే పరోక్ష ప్రభావమే ఎక్కువగా ఉండనుంది. ఐరోపా ప్రాంతంలోని క్లయింట్లు ఐటీపై చేసే వ్యయాలను తగ్గించుకోవడం లేదా వాయిదా వేసుకునే పరిస్థితి నెలకొని ఉన్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే అంతర్జాతీయ కంపెనీలు కొన్ని రష్యా నుంచి తప్పుకోవడం లేదా అక్కడి కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయడాన్ని ప్రస్తావిస్తున్నారు. యుద్ధం కారణంగా పెరిగిపోయిన ద్రవ్యోల్బణ ప్రభావం కూడా కొత్త కాంట్రాక్టుల చార్జీల్లో జాప్యానికి దారితీస్తుందన్నది అంచనా. ఈ పరిస్థితులతో సాఫ్ట్వేర్ ఎగుమతిదారులు సమీప కాలంలో స్తబ్దత చూడొచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది. 227 బిలియన్ డాలర్ల దేశీ ఐటీ ఎగుమతుల్లో రష్యా వాటా 1–2 శాతం మేర ఉంటుంది. ‘‘రష్యా–ఉక్రెయిన్ మధ్య ఘర్షణతో భారత ఐటీ పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటుందని మా అభిప్రాయం. వచ్చే కొన్ని త్రైమాసికాల్లో కాంట్రాక్టులకు సంబంధించి నిర్ణయాల్లో జాప్యానికి.. మొత్తం కాంట్రాక్టుల విలువ నిదానించడానికి దారితీస్తుంది’’అని దోలత్ క్యాపిటల్ పేర్కొంది. ఐటీపై తగ్గనున్న వ్యయాలు అంతర్జాతీయంగా ఐటీ సేవల వృద్ధి అంచనాలను 2022 సంవత్సరానికి 10 శాతం నుంచి 7 శాతానికి తగ్గిస్తున్నట్టు కన్సల్టెన్సీ సంస్థ హెచ్ఎఫ్ఎస్ రీసెర్చ్ ఇటీవలే ప్రకటించింది. ద్రవ్యోల్బణం అధికంగా ఉండడం, భౌగోళిక రాజకీయ సమస్యలతో ఐటీ సేవలపై చేసే ఖర్చు తగ్గుతుందన్నది ఈ సంస్థ అంచనా. మొత్తం కాంట్రాక్టుల విలువ తగ్గొచ్చని పేర్కొంది. నిజానికి కరోనా వచ్చిన తర్వాత నుంచి ఐటీ రంగం కొత్త దశను చూస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ డిజిటైజేషన్ ఊపందుకుంది. దీంతో కంపెనీలు పెద్ద సంఖ్యలో ఆర్డర్లను సంపాదించాయి. 2021లో అంతర్జాతీయంగా 33 బిలియన్ డాలర్ల ఐటీ సేవల ఆర్డర్లలో భారత ఐటీ సంస్థలు 31 శాతం అందుకున్నాయని.. ఈ వాటా ఇంకా పెరగొచ్చని ఐటీ పరిశోధనా సంస్థ ఐఎస్జీ అంచనా. మొదటిసారి వచ్చే ఆర్డర్లపై ప్రభావం ఉండకపోవచ్చని దోలత్ క్యాపిటల్ అంటోంది. అదే సమయంలో ఆదాయం, వ్యయాలపై ఉన్న ప్రభావాన్ని విస్మరించడానికి లేదని, ఐటీ సేవలకు సంబంధించి మరీ ఎక్కువ ఆశావహ అంచనాలు సరికాదని పేర్కొంది. భారత ఐటీ రంగం కరోనా ముందు నాటితో పోలిస్తే వేగంగా రెట్టింపై 227 బిలియన్ డాలర్లకు (రూ.17 లక్షల కోట్లు) చేరుకోవడం గమనార్హం. 2021–22 నాటికి 50 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. యుద్ధం మొదలైన తర్వాత నుంచి అమెరికా, ఐరోపా దేశాలు రష్యాపై ఎన్నో ఆర్థిక ఆంక్షలు విధించడం తెలిసిందే. దీంతో రష్యాతో వ్యాపారం నిర్వహించడం దాదాపు అధిక శాతం అంతర్జాతీయ కంపెనీలకు అసాధ్యమనే చెప్పుకోవాలి. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఇంధన ఎగుమతి దేశమైన రష్యాతో చమురు సరఫరా తెంపుకోవడం కూడా ద్రవ్యోల్బణం, కమోడిటీ ధరలు మరింత పెరగడానికి దారితీయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితులు డిజిటల్, టెక్నాలజీపై చేసే వ్యయాలను తాత్కాలికంగా నిలిపివేయవచ్చన్నది దోలత్ విశ్లేషణగా ఉంది. -
Omicron impact: పెళ్లిళ్లపై ఒమిక్రాన్ పంజా, వ్యాపారం కుదేలు!
సాక్షి, హైదరాబాద్: పెళ్లిళ్లు, ఫంక్షన్లపై కరోనా మహమ్మారి మరోసారి ప్రభావం చూపనుందా? 2021లో పెళ్లి ముహూర్తాలు జోరుగా సాగాయన్న సంతోషం ఎంతో కాలం నిలవకముందే తాజాగా ఒమిక్రాన్ పంజా విసురుతోంది. దీంతో పెళ్లి వాయిదా వేసుకోవాలా? వద్దా , గెస్ట్ల్లో ఎవర్ని తగ్గించాలి రా బాబూ అనే మీమాంసలో పడిపోయారు జనం. మరోవైపు ఈ కల్లోలంతో పెళ్లిళ్ల సీజన్ కోసం ముస్తాబవుతున్న ఫంక్షన్ హాల్స్ వెలవెలబోనున్నాయనే భయం బిజినెస్ వర్గాలను వెంటాడుతోంది. ఈ సీజన్‌పై ఆధారపడ్డ ఇతర వ్యాపారస్తుల పరిస్థితి ఏంటి? నిపుణులు ఏమంటున్నారు. అలనాటి రామచంద్రుడి కన్నింటాసాటి అనే మురారి సినిమాలోని పెళ్లి పాట గుర్తుందా.. బ్యాండ్ బాజా బారాత్ అంటూ ఆ లెవల్లో పెళ్లి చేసుకోవాలని ఈ కాలపు పెళ్లీడు పిల్లలు ముచ్చపడుతుంటారు. అలాగే ఆకాశమంత పందిరి, భూదేవి అంతపీట వేసి బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభోగంగా పెళ్లి వేడుకను సంబరంగా జరిపించాలని పేరెంట్స్ కూడా కోరుకుంటారు. అయితే కరోనా ఎంటర్ అయినప్పటి నుంచి ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏ క్షణంలో కేసులు పెరుగుతాయో..ఏ నిమిషంలో ఎలాంటి ఆంక్షలు అమల్లోకి వస్తాయో తెలియని గందరగోళ పరిస్థితి 2022లో కూడా వెంటాడుతోంది. జనవరి -మార్చి నెలల కాలాన్ని శుభప్రదమైన పెళ్లిళ్ల సీజన్‌గా భావిస్తాం. పరిశ్రమ అంచనాల ప్రకారం జనవరి 14, మార్చి 31 కాలంలో 30 లక్షల ముహూర్తాలు ఖరారైనాయి. తద్వారా దాదాపు రూ. 4 లక్షల కోట్ల వ్యాపారం జరగనుందని భావించారు. దీంతో డిమాండ్‌కు తగ్గట్టుగా వ్యాపారులు కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, ముంబై, ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా ఉన్న బాంక్వెట్ హాళ్లు, హోటళ్లు, మ్యారేజ్ లాన్లు, ఫామ్‌హౌస్‌లు తదితరాలు పూర్తి స్థాయిలో ముస్తాబయ్యాయి. అంతేనా ఫైవ్ స్టార్ హోటల్స్, క్యాటరింగ్, డెకరేషన్, క్రాకరీ, లాజిస్టిక్స్, వీడియోగ్రాఫర్లు, బ్యాండ్లు, డీజేలు, లైటింగ్, టెంట్లు, ఇలా ఎండ్-టు-ఎండ్ వెడ్డింగ్ సొల్యూషన్స్ సంస్థలు, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు కూడా చాలా ఆశలు పెట్టుకున్నాయి. ఇక పట్టు వస్త్రాలు, డిజైనర్ దుస్తులు, వెండి బంగారు, ఇతర ఆభరణాలు, పాదరక్షలు తదితర వ్యాపారాలు సీజన్‌కు తగ్గట్టుగా ఫుల్‌గా ప్రిపేర్ అయిపోయాయి. కానీ తాజా పరిస్థితులు సంబంధిత వ్యాపారాలను దెబ్బతీయనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల ఉధృతి, ఫిబ్రవరి నాటికి కరోనా థర్డ్ వేవ్ పీక్ స్టేజ్‌కు చేరుకుంటుందన్న నిపుణుల హెచ్చరికలతో పెళ్లిళ్ల వాయిదాకు లేదా, సాధ్యమైనంత తక్కువ మందితో ఆ వివాహ తంతును ముగించేందుకు జనం సిద్ధపడుతున్నారు. ఈ మేరకు తమ ఇప్పటికే క్యాన్సిలేషన్ ఆర్డర్లు చాలా వచ్చాయని వెడ్డింగ్ ప్లానర్లు తెలిపారు. ఈ సీజన్లో వెడ్డింగ్ బిజినెస్ నాలుగు లక్షల కోట్ల రూపాయల నుంచి 1.5 లక్షల కోట్లకు తగ్గే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ పేర్కొన్నారు. ఈ సారి సీజన్ బావుంటుందని భావించాం కానీ, పరిస్థితి మళ్లీ మొదటి కొచ్చింది, జనవరిపై ఆశల్లేవు అంటూ ఫెర్న్స్ అండ్ పెటల్స్ ఎండీ, వ్యవస్థాపకుడు వికాస్ గుట్గుటియా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే 2020లో నాటి తీవ్ర ప్రభావం ఉండక పోవచ్చని మాట్రిమోనీ.కాం ఫౌండర్ మురుగవేల్ జానకిరామన్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నిబంధనలకు అనుగుణంగా షిప్ట్ వెడ్డింగ్స్‌పై జంటలు మొగ్గు చూపే అవకాశం ఉందన్నారు. పెళ్లిళ్లను వాయిదా వేయకుండా, వేదిక మార్చుకోవడమో, బ్యాచ్‌ల వారీగా అతిథులను అనుమతించి వేడుకను ముగించుకొని, ఆ తరువాత గ్రాండ్‌గా రిసెప్షన్ ఇచ్చుకునే అవకాశముందని నమ్ముతున్నామన వెడ్డింగ్‌వైర్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్-మార్కెటింగ్ అనమ్ జుబైర్ అన్నారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌తో ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. దేశంలో ఓ వైపు డెల్టా, మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 1,892కు చేరుకుంది.దీంతో కేసులు లోడ్ ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర , పశ్చిమ బెంగాల్ వివాహాలకు వచ్చే అతిథుల సంఖ్యను 50కి పరిమితం చేయగా, రాజస్థాన్‌లో ఇది 100గా ఉంది. ఢిల్లీలో 20 మంది అతిథులకు మాత్రమే అనుమతి. రాబోయే రోజుల్లో మరిన్ని ఆంక్షలు అమల్లోకి వస్తే ఈ సీజన్ వ్యాపారంపై ప్రభావం భారీగాపడే అవకాశముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. -
‘జెనరేషన్ జెడ్’పై ఎక్కువ ప్రభావం చూపిస్తోన్న కోవిడ్
న్యూఢిల్లీ: యువతరం కార్మికులు, ఉద్యోగులపై కరోనా మహమ్మారి ప్రభావం గట్టిగానే పడింది. జెనరేషన్ జెడ్ (18–24 వయసువారు)ను వృత్తిపరంగా, ఆర్థికంగా గట్టి దెబ్బకొట్టినట్టు ఏడీపీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. సర్వేలో పాల్గొన్న 78 శాతం మంది కరోనా తమ వృత్తి జీవితంపై ప్రభావం చూపించిందని చెప్పారు. 55 ఏళ్లకు పైన ఉన్న వారితో పోలిస్తే తమపై రెండింతల ప్రభావం పడినట్టు పేర్కొన్నారు. 17 దేశాల నుంచి 32,471 మంది కార్మికుల అభిప్రాయాలను ఏడీపీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సర్వేలో భాగంగా తెలుసుకుంది. యువ కార్మికులు ప్రతీ ఐదుగురిలో ఇద్దరు (39 శాతం) ఉద్యోగం కోల్పోయినట్టు లేదా తాత్కాలికంగా తొలగింపునకు గురైనట్టు ఈ సర్వే తెలిపింది. అన్ని వయసుల్లోని వారిని పరిగణనలోకి తీసుకుని చూస్తే.. ఇలా చెప్పిన వారు 28 శాతం మంది ఉన్నారు. భారత్‌లో సగానికి పైగా కరోనా మహమ్మారి సమయంలో ఉద్యోగం కోల్పోతామన్న ఆందోళనను ఎదుర్కొన్నట్టు చెప్పారు. ‘‘యువతరం పనివారిపై భారత్‌లో కరోనా మహమ్మారి ఎక్కువ ప్రభావం చూపించింది. స్వీయ చైతన్యంతో వారు మరింత బలంగా నిలబడి నూతన నైపుణ్యాలపై దృష్టి సారించారు’’అని ఏడీపీ ఇండియా, దక్షిణాసియా ఎండీ రాహుల్ గోయల్ తెలిపారు. చదవండి:వర్క్‌ఫ్రమ్ హోమ్ కొనసాగింపు.. ఎంప్లాయిస్‌పై నజర్! ఎప్పటివరకంటే.. -
సెల్‌ఫోన్ దెబ్బ..‘టైం’ బాగలేదు!
సాక్షి, కనగల్(నల్లగొండ) : సెల్‌ఫోన్ విప్లవంతో గడియారం టైం బాగోలేక విలవిల్లాడుతోంది. సెల్ఫోన్లోనే టైం చూపుతున్నందున ప్రజలు గడియారాలను వాడడం మానేస్తున్నారు. ఒకప్పుడు చేతికి వాచీ ఉంటే స్టేటస్ సింబల్.. ఇప్పడు చేతిలో సెల్‌ఫోన్ ఉంటే అదే ప్రపంచం. ఇలా కాలానుగుణంగా మారుతున్న లోకం పోకడలకు ఎన్నో వస్తువులు కనుమరుగువుతున్నాయి. అందులో మణికట్టు మణిహారం చేతిగడియారం ఒకటి. ఒకప్పుడు పెళ్లి కొడుకుకు గడియారం, సైకిల్, రేడియోను ఆడపెళ్లివారు పెట్టేవారు. అది ఎంతో గొప్పగా భావించేవారు. గడియారం పెట్టకపోతే పెళ్లిలు ఆగిన ఘటనలు ఉన్నాయి. ఇలా శతాబ్దాలుగా మనిషితో పెనవేసుకున్న గడియారం బంధాన్ని సెల్‌ఫోన్ తెంచేస్తోంది. మణిహారం చేతి గడియారం.. కొన్నేళ్ల క్రితం వరకు మణికట్టుకు మణిహారంగా చేతిగడియారం వెలిగిపోయేది. చేతికి గడియారం ఉంటే అదో స్టేటస్ సింబల్. గడియారంపై మమకారంతో ఇప్పటికీ కొందరు సీనియర్ సిటిజన్స్ చేతిగడియారాలను వాడుతున్నారు. మొబైల్ ఫోన్ రాకతో గడియారం స్థితిగతులు మారిపోయాయి. సెల్ఫోన్లోనే సమయంతోపాటు తేదీ నెల, సంవత్సరం చూపిస్తున్నందున ప్రజలు గడియారానికి ప్రత్యామ్నాయంగా మొబైల్ ఫోన్‌ను ఎంచుకుంటున్నారు. ఒకప్పుడు ప్రతి వీధిలో గడియారాల షాపు ఉండేది. రంగురంగుల డిజైన్లతో షాపు నిండా గోడ గడియారాలు, చేతి గడియారాలు, టేబుల్ గడియారాలు ఉండేవి. గడియారాల విక్రయాలు, రిపేర్లతో ఎంతోమంది ఉపాధి పొందేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు మారిపోయాయి. గడియారం దుకాణాలు గిరాకీ లేక మూతపడ్డాయి. దీంతో దుకాణదారులకు ఉపాధి కరువైంది. మూతపడుతున్న దుకాణాలు సెల్‌ఫోన్ దెబ్బకు గడియారంతోపాటు ఇతర ఉపకరణాలు సైతం కనుమరుగవుతున్నాయి. రంగుల లోకాలను ఒక్క క్లిక్‌తో ఫొటో ఫ్రేమ్‌లో బంధించే కెమెరా, మనసుకు హాయినిచ్చే పాటలు వినిపించే టేప్‌రికార్డర్, రేడియో, చీకట్లో దారిచూపే టార్చిలైట్, ఎంతటి లెక్కనైనా క్షణాల్లో చేసే క్యాలకులేటర్.. ఇలా ఎన్నో ఉపకరణాలను సెల్‌ఫోన్ మింగేసింది. మొబైల్లోనే ఫొటోలు దిగడం ఎవరికి పంపాలనుకుంటే వారికి క్షణాల్లో పంపుతున్నందున పనిలేక ఫోటో స్టూడియోలు మూతపడుతున్నాయి. కెమెరాకు క్రేజీ తగ్గడంతో ఎంతోమంది ఫొటోగ్రాఫర్లు జీవనోపాధిని కోల్పోయారు. -
కరోనా ప్రభావం: సామూహిక వివాహాల్లో ఒక్కటే జంట
సాక్షి, తుమకూరు(కర్ణాటక): కరోనా ప్రభావం కారణంగా ప్రజలు సాముహిక వివాహాలకు దూరంగా ఉంటున్నారు. కేవలం కొద్ది మందిలో మాత్రమే వివాహం జరుపుకుంటున్నారు. తాజాగా, తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి తాలూకాలో శ్రీధర్మస్థల గ్రామీణాభివృద్ధి సంస్థ నిర్వహించిన సామూహిక వివాహ వేడుకలో పేర్లు నమోదు చేసుకున్న ఒక్కజంటకే వివాహం జరిపించారు. దొడ్డ ఎన్నెగెరె గ్రామంలో సోమవారం బీమాసతి తీతారాజు దేవాలయంలో అనిల్ కుమార్, భూమిక జంట నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. సంస్థ అధికారి ప్రేమానంద్, భాగ్య తదితరులు పాల్గొన్నారు. వైరస్ కారణంగా ఎవరూ పెళ్లి జరుపుకోవడానికి ముందుకు రాలేదు. -
శాశ్వతంగా ఇంటినుంచేనా? నో...వే..
సాక్షి,న్యూఢిల్లీ : కరోనా కట్టడి, దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా దాదాపు ఉద్యోగులందరూ ఇంటినుంచే సేవలను అందిస్తున్న తరుణంలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కీలక వ్యాఖ్యలు చేశారు. కార్పొరేట్ దిగ్గజాలనుంచి సాధారణ సంస్థ దాకా ఉద్యోగులను ఇంటినుంచే పనిచేసేందుకు అనుమతిస్తున్న సమయంలో సిబ్బంది శాశ్వతంగా ఇంటినుంచే పనిచేసే విధానాన్ని తోసి పుచ్చారు. దీని వలన ఉద్యోగుల్లో అనేక దుష్పరిణామా లుంటాయని పేర్కొన్నారు. న్యూయార్క్ టైమ్స్‌తో మాట్లాడుతూ సత్య నాదెళ్ల ఈ వ్యాఖ్యలు చేశారు. శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం ఎంచుకున్న ఉద్యోగులకు వ్యాయామం ఎలా, వారి మానసిక ఆరోగ్య పరిస్థితి ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. రిమోట్ గా పనిచేయడం అంటే మనుషుల మధ్య సామాజిక బంధాలను నాశనం చేయడమే అన్నారు. (‘వాళ్లను అలా వదిలేయడం సిగ్గు చేటు’) శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం చేయడం వల్ల ఉద్యోగులకే ఎక్కువ ప్రమాదం వుంటుందని సత్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఉద్యోగులు సమాజంలో కలవలేని పరిస్థితులు వస్తాయని, వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని వెల్లడించారు. దీని వల్ల కంపెనీల్లోని చాలా నియమ నిబంధనలు కూడా మార్చుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయన్నారు. సమావేశాల్లో పాల్గొనేటప్పుడు భౌతికంగా కలవడానికి, ఆన్లైన్లో వర్చువల్ వీడియో కాన్ఫరెన్సుల ద్వారా కలవడానికి చాలా తేడా ఉంటుందని చెప్పారు. భౌతిక, వ్యక్తిగత సమావేశాల ప్రయోజనాలను ఇవి భర్తీ చేయ లేవన్నారు. అంతేకాదు అంతా రిమోట్ సెటప్ గా మారిపోవడం అంటే.. ఒక మూఢత్వంలోంచి మరో మూఢత్వంలోకి జారి పోవడమేనని ఆయన పేర్కొన్నారు. (కరోనా : ట్విటర్ సంచలన నిర్ణయం) కాగా కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఫేస్బుక్, ఆల్ఫాబెట్ (గూగుల్) ఇతరులు తమ ఉద్యోగులను ఇంటి నుండి సంవత్సరం చివరి వరకు పని చేయమని కోరిన తరువాత ట్విటర్ కూడా ముందుకొచ్చింది. ప్రధానంగా మహమ్మారి ప్రభావం తగ్గిన తరువాత కూడా తన సిబ్బందికి ఇంటినుండి 'ఎప్పటికీ' పనిచేసుకోవచ్చనే అవకాశాన్ని ట్విటర్ ప్రకటించిన తరువాత సత్య నాదెళ్ల వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మైక్రోసాఫ్ట్ వర్క్ ఫ్రం హోం విధానాన్ని అక్టోబర్ వరకు పొడిగించింది. -
విటమిన్ డీపై కాలుష్యం ప్రభావం ఎక్కువే!
వాతావరణంలోని కాలుష్యం శరీరంలోని విటమిన్ –డి మోతాదును ప్రభావితం చేస్తున్నట్లు నార్త్ కరోలినా స్టేట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పరిశోధన పూర్వకంగా తెలుసుకున్నారు. వాతవరణంలో ఉండే దాదాపు 400 రసాయనాలు విటమిన్ –డి పై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకునేందుకు వీరు కొన్ని పరిశోధనలు చేశారు. విటమిన్ – డి అనేది కేవలం విటమిన్ కాదని, హార్మోన్‌గా మారి ఇతర హార్మోన్లను నియంత్రించేందుకు ఉపయోగపడుతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త సేథ్ కల్మన్ తెలిపారు. మొత్తం 400 రసాయనాల్లో 21 రసాయనాలు విటమిన్ –డి ని పెంచేవి కాగా, 19 వరకు రసాయనాలు తగ్గించేవి ఉన్నట్లు తెలిసింది. ఇప్పటివరకూ ఈ రసాయనాలు విటమిన్ –డి రిసెప్టర్లకు అంటుకోవని అనుకునే వాళ్లమని, పరిశోధనశాలలో జరిగిన ప్రయోగాలు, ఆ తరువాత అత్యాధునిక సాఫ్ట్వేర్ సాయంతో జరిపిన విశ్లేషణలు ఈ అంచనా తప్పని నిరూపించాయని సేథ్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా విటమిన్ –డి లోపం ఎక్కువవుతున్న నేపథ్యంలో ఈ సమస్యకు దారితీసే రసాయనాలను గుర్తించడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని వివరించారు. విటమిన్ –డి తక్కువైతే ఊబకాయం, అల్జైమర్స్ వంటి వ్యాధులు వస్తాయని ఇప్పటికే రుజువైన నేపథ్యంలో ఈ పరిశోధనకు ప్రాధాన్యత ఏర్పడింది. -
జీఎస్టీతో శాశ్వత నష్టమే..
న్యూఢిల్లీః గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మొదటిసారి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. 29 డిమాండ్లతో కూడిన మెమోరాండంను ఆయనకు సమర్పించారు. ఈ సందర్భంలో తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను సైతం ఆమె ప్రధానికి వివరించారు. తమిళనాడుకు తగినంత ఆర్థికసాయాన్ని కూడ అందించాలని ఈ సందర్భంలో ఆమె కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్నికల తర్వాత మొదటిసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత.. దేశం కల్పించాలనుకుంటున్న ఏకీకృత పన్ను విధానం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. జీఎస్టీ ప్రభావం భారీ శాశ్వత నష్టాన్ని కలుగజేస్తుందని భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. తమిళనాడు మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలు జీఎస్టీ విషయంలో మద్దతు పలుకుతున్నాయని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్తుండగా, అదే విషయాన్ని జయలలిత ప్రధాని మోదీవద్ద ప్రస్తావించడం ప్రత్యేకతను సంతరించుకుంది. -
పిల్లల్ని నాతోనే ఉంచుకోవడానికి చట్టం సాయం చేస్తుందా?
నా వయసు 32. ఇద్దరు పిల్లలు. బాబుకి ఆరేళ్లు, పాపకి రెండేళ్లు. మా వారికీ, నాకూ మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఆయన నాతో ఉండలేను, విడిపోతానంటున్నారు. నాకు ఆయనంటే చాలా ప్రేమ. కాని పొసగనప్పుడు విడిపోవడంలో తప్పులేదనిపిస్తోంది. ఆయన పిల్లల్ని తనకు ఇచ్చేయమంటున్నారు. కానీ నాకది ఇష్టం లేదు. నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను. నెలకు ముప్పైవేలు సంపాదిస్తున్నాను. వాళ్లని పెంచుకోగలను. పైగా వాళ్లని వదిలి ఉండలేను. ఎంతచెప్పినా ఆయనకు అర్థం కావడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? పిల్లల్ని నాతోనే ఉంచుకోవడానికి చట్టం సాయం చేస్తుందా? - సంధ్యారాణి (పేరు మార్చాం), రాజమండ్రి భార్యాభర్తలు విడిపోవడం అన్నది వాళ్ల వాళ్ల పరిస్థితులు, మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. అయితే పిల్లలు ఉన్నప్పుడే సమస్య. తల్లిదండ్రులు విడిపోవడమన్నది పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది. మీరు ఇప్పటికే నిర్ణయం తీసేసుకున్నారు కాబట్టి, ఇక దానిగురించి చెప్పేదేమీ లేదు. ఇక మీరడిగిన దాని గురించి... మైనర్ పిల్లలు తల్లి సంరక్షణలోనే ఉండాలని ఇప్పటికే పలు కేసుల్లో తీర్పు వెలువడింది. చట్టం ప్రకారం పిల్లలకు తండ్రే సంరక్షకుడు. అయితే తల్లి ప్రేమ, తండ్రి కంటే తల్లే పిల్లల పట్ల ఎక్కువ అప్రమత్తంగా, బాధ్యతగా ఉంటుందన్న విషయాలు నిరూపితమయ్యాయి కాబట్టి... చాలావరకూ కేసుల్లో పిల్లల్ని తల్లికే అప్పగిస్తూ తీర్పు ఇస్తోంది న్యాయస్థానం. పైగా మీరు బాగా సంపాదిస్తున్నారు. పిల్లల్ని చూసుకునే స్థోమత ఉంది. కాబట్టి మీరు ధైర్యంగా పిల్లల కస్టడీ కోసం కేసు వేయవచ్చు. కస్టడీ కేసుల్లో తీర్పు ఇచ్చే ముందు తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులు, వ్యక్తిత్వం, ప్రవర్తన వంటి అన్ని విషయాలనూ పరిశీలిస్తారు. తండ్రి స్థోమత సరిగ్గా లేకపోయినా, అతడు మరో పెళ్లి చేసుకున్నా అతడికి పిల్లల్ని అప్పగించరు. కాకపోతే జీవితాంతం అతడికి పిల్లల్ని కలుసుకునే హక్కు మాత్రం ఉంటుంది. ఒకవేళ అతడి వల్ల పిల్లలకు ఏదైనా ప్రమాదం జరుగుతుందనిపిస్తే... కోర్టులో తల్లి పిటిషన్ వేసుకోవచ్చు. కోర్టు విజిటేషన్ రైట్స్‌ని క్యాన్సిల్ చేస్తుంది. అంతేకాదు... మీరు సంపాదిస్తున్నా కూడా, పిల్లల పోషణ కోసం మీరు అతడి నుంచి మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. మీ పిల్లలకు ఆయన ఆస్తిలో హక్కు ఉంటుంది. దాని కూడా మీరు పొందవచ్చు. అయితే ఒకటి... ముందు మీ వారితో స్పష్టంగా మాట్లాడండి. అన్నీ వివరించి ఒప్పించేందుకు ప్రయత్నించండి. ఆయన ఇక అంగీకరించరని తేల్చుకున్నాకే కోర్టుకు వెళ్లండి. ఏ సమస్య అయినా ఇంట్లో పరిష్కారమైతే బాగుంటుంది కదా!