పిల్లల్ని నాతోనే ఉంచుకోవడానికి చట్టం సాయం చేస్తుందా?
నా వయసు 32. ఇద్దరు పిల్లలు. బాబుకి ఆరేళ్లు, పాపకి రెండేళ్లు. మా వారికీ, నాకూ మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఆయన నాతో ఉండలేను, విడిపోతానంటున్నారు. నాకు ఆయనంటే చాలా ప్రేమ. కాని పొసగనప్పుడు విడిపోవడంలో తప్పులేదనిపిస్తోంది. ఆయన పిల్లల్ని తనకు ఇచ్చేయమంటున్నారు. కానీ నాకది ఇష్టం లేదు. నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను. నెలకు ముప్పైవేలు సంపాదిస్తున్నాను. వాళ్లని పెంచుకోగలను. పైగా వాళ్లని వదిలి ఉండలేను. ఎంతచెప్పినా ఆయనకు అర్థం కావడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? పిల్లల్ని నాతోనే ఉంచుకోవడానికి చట్టం సాయం చేస్తుందా?
- సంధ్యారాణి (పేరు మార్చాం), రాజమండ్రి
భార్యాభర్తలు విడిపోవడం అన్నది వాళ్ల వాళ్ల పరిస్థితులు, మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. అయితే పిల్లలు ఉన్నప్పుడే సమస్య. తల్లిదండ్రులు విడిపోవడమన్నది పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది. మీరు ఇప్పటికే నిర్ణయం తీసేసుకున్నారు కాబట్టి, ఇక దానిగురించి చెప్పేదేమీ లేదు.
ఇక మీరడిగిన దాని గురించి... మైనర్ పిల్లలు తల్లి సంరక్షణలోనే ఉండాలని ఇప్పటికే పలు కేసుల్లో తీర్పు వెలువడింది. చట్టం ప్రకారం పిల్లలకు తండ్రే సంరక్షకుడు. అయితే తల్లి ప్రేమ, తండ్రి కంటే తల్లే పిల్లల పట్ల ఎక్కువ అప్రమత్తంగా, బాధ్యతగా ఉంటుందన్న విషయాలు నిరూపితమయ్యాయి కాబట్టి... చాలావరకూ కేసుల్లో పిల్లల్ని తల్లికే అప్పగిస్తూ తీర్పు ఇస్తోంది న్యాయస్థానం. పైగా మీరు బాగా సంపాదిస్తున్నారు. పిల్లల్ని చూసుకునే స్థోమత ఉంది. కాబట్టి మీరు ధైర్యంగా పిల్లల కస్టడీ కోసం కేసు వేయవచ్చు.
కస్టడీ కేసుల్లో తీర్పు ఇచ్చే ముందు తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులు, వ్యక్తిత్వం, ప్రవర్తన వంటి అన్ని విషయాలనూ పరిశీలిస్తారు. తండ్రి స్థోమత సరిగ్గా లేకపోయినా, అతడు మరో పెళ్లి చేసుకున్నా అతడికి పిల్లల్ని అప్పగించరు. కాకపోతే జీవితాంతం అతడికి పిల్లల్ని కలుసుకునే హక్కు మాత్రం ఉంటుంది. ఒకవేళ అతడి వల్ల పిల్లలకు ఏదైనా ప్రమాదం జరుగుతుందనిపిస్తే... కోర్టులో తల్లి పిటిషన్ వేసుకోవచ్చు. కోర్టు విజిటేషన్ రైట్స్‌ని క్యాన్సిల్ చేస్తుంది.
అంతేకాదు... మీరు సంపాదిస్తున్నా కూడా, పిల్లల పోషణ కోసం మీరు అతడి నుంచి మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. మీ పిల్లలకు ఆయన ఆస్తిలో హక్కు ఉంటుంది. దాని కూడా మీరు పొందవచ్చు. అయితే ఒకటి... ముందు మీ వారితో స్పష్టంగా మాట్లాడండి. అన్నీ వివరించి ఒప్పించేందుకు ప్రయత్నించండి. ఆయన ఇక అంగీకరించరని తేల్చుకున్నాకే కోర్టుకు వెళ్లండి. ఏ సమస్య అయినా ఇంట్లో పరిష్కారమైతే బాగుంటుంది కదా!