Souring
-
కుచ్ కుచ్ నహీ హై
‘కరణ్ జోహార్ తీసిన ‘కుచ్ కుచ్ హోతా హై’ అంటే నాకు చాలా ఇష్టం’’ అంటున్నారు ప్రభాస్. మరి.. మీ ఇద్దరి మధ్య కుచ్ కుచ్ ప్రాబ్లమ్ హై అట? అంటే.. ‘కుచ్ కుచ్ నహీ హై’ అనే సమాధానం ప్రభాస్ నుంచి వస్తుంది. అంటే.. ఇద్దరి మధ్య ఏమీ సమస్య లేదని అర్థం. బాలీవుడ్ దర్శక–నిర్మాత కరణ్ జోహార్ ‘బాహుబలి’ రెండు భాగాలను హిందీలో విడుదల చేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి కరణ్–ప్రభాస్‌ల మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ప్రభాస్‌తో సినిమా తీయాలని కరణ్ అనుకుంటే.. యంగ్ రెబల్‌స్టార్ కుదరదన్నారని గతంలో ఓ వార్త వచ్చింది. ఇటీవల మరోసారి ఓ సినిమాకి అడిగితే ఈసారి కూడా ప్రభాస్ రిజెక్ట్ చేశారనే వార్త షికారు చేస్తోంది. అలాగే ఆ సినిమాకి ప్రభాస్ 30 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని, దీనివల్ల కరణ్– ప్రభాస్ మధ్య మనస్పర్థలు వచ్చాయని చెప్పుకుంటున్నారు. ‘అదేం కాదు’ అని ప్రభాస్ దుబాయ్‌లో ఓ డైలీతో పేర్కొన్నారు. ‘‘ఈ మధ్య కరణ్ నాకు ఫోన్ చేసి, మన గురించి ఏవో ఫాల్స్ న్యూసులు వస్తున్నాయి’’ అన్నారు. ‘‘అవును.. నాకూ తెలిసింది’’ అన్నాను. ‘‘మా ఇద్దరి మధ్య మనస్పర్థలు లేవు. మేం ఎప్పటిలానే బాగానే ఉన్నాం. కరణ్ దర్శకత్వం వహించిన ‘కుచ్ కుచ్ హోతా హై’ నా ఫేవరెట్ మూవీస్‌లో ఒకటి’’ అని ప్రభాస్ అన్నారు. అదండీ సంగతి.. కుచ్ కుచ్ నహీ హై. -
ఆ వార్తల్లో నిజం లేదు
...అంటున్నారు మిల్కీ బూటీ తమన్నా. ఇంతకీ ఆ వార్త ఏంటనేగా మీ డౌట్. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన ‘క్వీన్’ హిందీ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రీమేక్ చేస్తోన్న విషయం తెలిసిందే. తెలుగులోనూ ‘క్వీన్’ పేరుతో వస్తోన్న ఈ చిత్రంలో తమన్నా టైటిల్ రోల్ చేస్తుండగా నీలకంఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆ మధ్య మొదలైంది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ‘క్వీన్’ చిత్రీకరణ లో నీలకంఠకూ, తమన్నాకు మధ్య మనస్పర్థలు వచ్చాయనీ, దాంతో నీలకంఠ ఆ సినిమా నుంచి తప్పుకున్నారనే వార్తలు ఫిల్మ్‌నగర్‌లో హల్చల్ చేయడంతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారాయి. ఈ వార్తలు అటూ ఇటూ తిరిగి తెలుగు క్వీన్ చెవిన పడ్డట్టున్నాయి. అందుకే కాబోలు తాజాగా తమన్నా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ‘‘నీలకంఠ సార్ అంటే నాకు చాలా గౌరవం. నేను ఆయనతో గొడవ పడ్డానని వస్తున్న వార్తల్లో నిజం లేదు. మా మధ్య ఎటువంటి మనస్పర్థలు లేవు. సినిమా నిర్మాణం విషయంలో నాకు, నా టీమ్‌కి కానీ ఎటువంటి అధికారం లేదు. పూర్తి అధికారం నిర్మాత మను కుమారన్‌దే. నాలుగు భాషల్లో ఏక కాలంలో రానున్న ‘క్వీన్’ మా అందరికీ ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటిది. అందుకోసం యూనిట్ అంతా కష్టపడి పనిచేస్తోంది’’ అని సెలవిచ్చారు తమన్నా. అయితే.. ప్రస్తుతం ‘క్వీన్’ షూటింగ్ జరుగుతోందా? ఆగిపోయిందా? అనే క్లారిటీ ఇవ్వలేదు మిల్కీ బ్యూటీ. -
నా భర్త ఓ అపరిచితుడు
భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తో, వేరేవేరే కారణాల వల్లో గొడవలు వస్తే... రాజీపడి, సర్దుబాటు చేసుకుని, సరిదిద్దుకుని, వాటిని పరిష్కరించుకోవచ్చు. కానీ కాంప్రమైజ్‌కు కూడా అవకాశం ఇవ్వని దురదృష్టకర సంఘటనలు జరిగితే మాత్రం అవి దారుణమైన పర్యవసానాలకు దారితీస్తాయి. జీవితాన్నే తలకిందులు చేస్తాయి. ఇలాంటప్పుడు విడిపోవడమే ఆరోగ్యకరమైన పరిష్కారమేమో ననిపిస్తుంది. ప్రశ్న - జవాబు మా పెళ్లయ్యి ఏడు సంవత్సరాలయింది. మాది ఎంతో అన్యోన్యమైన దాంపత్యం. మంచి ఉద్యోగాలు. నా భర్త నన్నూ, పాపనూ ఎంతో ప్రేమగా చూసుకునేవారు. కానీ నా జీవితంలో దిగ్భ్రాంతికి లోనయ్యే సంఘటన జరిగింది. నా నమ్మకం, విశ్వాసం దెబ్బతిన్నాయి. నేను తీవ్రమైన మానసిక వేదనకు గురై, ప్రస్తుతం మానసిక వైద్యుల ఆధ్వర్యంలో చికిత్స తీసుకుంటున్నాను. మనుషుల మీద అంటే మగవాళ్ల మీద నమ్మకం పోయింది. విషయం ఏమిటంటే మా పక్కింట్లో ఉండే దంపతులకు ఒక చిన్న పాప ఉంది.వయసు ఎనిమిదేళ్లుంటాయి. అంకుల్ అంకుల్ అంటూ మా వారికి బాగా చేరిక అయింది. రోజూ మా ఇంటికి వస్తూ పోతూ ఉండేది. ఒకరోజు నేను ఇంట్లోలేని సమయంలో పాప వచ్చిందట. మా వారిలో మృగాడు మేల్కొన్నాడు. కూతురులాంటి పాపను పాశవికంగా చిదిమి వేశాడు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ప్రస్తుతం జైలులో ఉన్నాడు. నాకు వాడి ముఖం చూడ టం కూడా ఇష్టం లేదు. నా పాపపై వాడి నీడ కూడా పడకూడదు. ఆ పశువు చేతుల్లో నా పాపకు కూడా రక్షణ ఉండదు. నేను వైద్యశాలలో ఇన్‌పేషెంట్‌గా ఉండి లెటర్ రాస్తున్నాను. దయచేసి మార్గం సూచించండి. - ఒక సోదరి, హైదరాబాద్ మీకు నా సానుభూతి తెల్పుతున్నాను. పొదరిల్లు లాంటి మీ జీవితం ఒక్క సంఘటనతో ఎలా కూలిపోయిందో తెలుస్తుంది. మీ భర్త పైశాచికానికి మీ మనసెంతగా విలపిస్తున్నదో అర్థమవుతోంది. మీరు నిశ్చింతగా విడాకులు తీసుకోండి. దానితోపాటు పాప కష్టడీ కూడా. హిందూ వివాహ చట్టం 1955 సెక్షన్ 13(2) (జీఠి) భార్య మాత్రమే విడాకులు పొందడానికి గల అదనపు గ్రౌండ్స్ గురించి వివరిస్తుంది. భర్త ఇతర స్త్రీల మీద అత్యాచారం చేసినా, పశువులతో సంపర్కం చేసినా, అసహజ లైంగిక చర్యలకు పాల్పడినా (సొడోమి) భార్య విడాకులు పొందవచ్చు. దీనితోపాటు మిమ్ములను తీవ్రమైన వేదనకు గురి చేశారు కనుక క్రూయల్టీ కూడా ఒక కారణమవుతుంది. వెంటనే విడాకులకు అప్లై చేయండి. నా వివాహమై పది సంవత్సరాలు అయింది. నా భర్త హుసేన్. మాకిద్దరు సంతానం. ఇద్దరూ ఆడపిల్లలే, వాళ్లు పుట్టినప్పటినుంచి మావారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇద్దరూ ఆడపిల్లల్ని కన్నానని నన్ను వేధింపులకు గురి చేస్తున్నారు. ఆర్థికంగా స్థిరపడిన కుటుంబం మాది. పిల్లలను చక్కగా పోషించే స్తోమత ఉంది. కాని నా భర్త చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. ఎన్నోసార్లు నాపై చేయి చేసుకున్నారు. నేను టీచర్‌గా పని చేస్తున్నాను. రెండేళ్లనుంచి పైసా కూడా ఖర్చుపెట్టడం మానేశారు. అదేమంటే నీ జీతంతో సర్దుకుపో అంటున్నారు. ఏమిటా అని ఎంక్వయిరీ చేయిస్తే, అతను మరో వివాహం చేసుకున్నాడని తెలిసింది. అదేమంటే తను నాలుగు వివాహాలు చేసుకోవచ్చని వాదిస్తున్నారు. నాపై, పిల్లలపై వేధింపులు ఎక్కువైనాయి. తాగివచ్చి విపరీతంగా కొడుతున్నారు. పిల్లలు తండ్రంటేనే భయపడుతున్నారు. నాకు అతనితో ఉండాలని లేదు. విడాకులిమ్మంటే ఇవ్వడు. ప్రవర్తన మార్చుకోమంటే మార్చుకోడు. నన్నేం చేయమంటారు? మార్గం చెప్పండి. - రజియా, హైదరాబాద్ మీరు మానసికంగా, శారీరకంగా ఎంతో ఆవేదనకు లోనై ఈ నిర్ణయం తీసుకున్నారని అర్థమౌతోంది. ముస్లిం వివాహాలు, విడాకులు చాలా సంక్లిష్టమైనవి. మగవారికి ఎన్నో రకాల తలాక్‌లు ఉన్నాయి. కానీ ముస్లిం మహిళలు విడాకులు కావాలంటే కోర్టును ఆశ్రయించి పొందడానికి ఉన్న చట్టమే డిజల్యూషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజ్ యాక్ట్ 1939. కేవలం వివాహిత ముస్లిం మహిళలు మాత్రమే ఈ చట్టం ద్వారా విడాకులు పొందవచ్చు. ఈ చట్టాన్ని అనుసరించి విడాకులు పొందాలంటే, కొన్ని గ్రౌండ్స్ ఉన్నాయి. కుటుంబాన్ని పోషించకుండా ఉంటే, అది కూడా విడాకులకు సహేతుక కారణమవుతుంది. మీ విషయంలో మీ భర్త గత రెండు సంవత్సరాలనుండి మిమ్మల్ని పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. చట్టంలో కూడా రెండు సంవత్సరాలనుండి భార్యాపిల్లల పోషణ బాధ్యత వహించకుండా నిర్లక్ష్యం చేస్తే అది విడాకులకు కారణమవుతుందని చెప్పారు. అంతేకాకుండా తీవ్రమైన శారీరక, మానసిక వేధింపులకు గురి చేసినా అది కూడా విడాకులకు సహేతుకమైన కారణమవుతుందని చట్టంలో చెప్పారు కనుక మీరు ఈ చట్టాన్ని అనుసరించి రెండు కారణాలతో విడాకులకు అప్లై చేసుకోవచ్చు. ధైర్యంగా ఉండండి. ఒకవేళ మీ భర్త ఒప్పుకుంటే, కోర్టుకు వెళ్లకుండా మీ మతచట్టాన్ని అనుసరించి మీరిరువురూ కన్సెంట్ డైవర్స్ అంటే పరస్పర అంగీకారపూర్వకమైన విడాకులు పొందవచ్చు. మీ భర్త అంగీకరించట్లేదంటున్నారు కనక మీరు కోర్టుకు వెళ్లవలసిందే. నాకు 40 సంవత్సరాలు. నేను అవివాహితురాలిని. మా పుట్టింట్లో అన్నదమ్ముల కుటుంబాలతో కలసి ఉంటున్నాను. మేముండే ఇల్లు చాలా పాతబడి పోయింది. దానికి రిపేర్లు చేయించుకుందామంటే నా సోదరులు ఒప్పుకోవడం లేదు. నాన్నగారు వీలునామా రాయకుండా మరణించారు. నాకైతే నా పోర్షన్ నాకిస్తే దాన్ని ఆధునీకరించుకోవాలని ఉంది. నా వాటా నాకు పంచమని అడిగే హక్కు నాకు లేదా? - ఒక సోదరి, అనకాపల్లి ఉమ్మడి నివాస గృహాన్ని విభజించమని అడిగే హక్కు మీకు ఉంది. ఈ హక్కు హిందూ వారసత్వ చట్టం 2005 కేంద్ర సవరణను అనుసరించి వచ్చింది. పాత చట్టం ప్రకారం, అంటే హిందూ వారసత్వ చట్టం 1986 ఉమ్మడి ఆస్తిలో మహిళలకు సమాన హక్కులున్నప్పటికీ ఉమ్మడి నివాస గృహంలో విభజన కోరే హక్కు వారికి లేదు. కొడుకులు ఆస్తి విభజన కోరే వరకు కూతుళ్లు ఆగవలసి వచ్చేది. కేంద్ర సవరణ చట్టం దీన్ని రద్దు చేసింది. దీని ప్రకారం ఆ గృహాన్ని విభజించమని కోరి, మీ భాగంలో మీ ఇష్టం వచ్చినట్లు మార్పు చేర్పులు చేయించుకోవచ్చు. ముందు మీ సోదరులను మంచిమాటలతో అడగండి. వినకుంటే కోర్టును ఆశ్రయించి, పార్టిషన్ సూట్ వేసుకోండి. కేస్ స్టడీ లాజిక్ మేజిక్ అనిత, అక్బర్లు గత 5 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇరువురూ ఉన్నత విద్యావంతులు, ఆధునిక భావాలు కలవారు. మంచి ఉద్యోగాలు చేసుకుంటూ ఏ బాధ్యతలూ లేని జీవితం గడుపుతున్నవారు. ఇటీవలే వారి ప్రేమ విషయం పెద్దలకు చెప్పి, వివాహానికి అనుమతి కోరారు. ఇరువురి తలిదండ్రులూ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. మతాంతర వివాహానికి ససేమిరా అన్నారు. ఎన్నో రకాలుగా నచ్చచెప్పే ప్రయత్నం చేశారు అనిత, అక్బర్లు. అనిత తలిదండ్రులు దిగి రాలేదు. బెదిరించినా, ప్రాధేయపడినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదన్నారు. అక్బర్ తలిదండ్రులు కాస్త మెత్తబడ్డారు. కానీ ఒక బాంబ్ పేల్చారు. అదేమంటే ఒక ముస్లిమ్ యువకుడు హిందూ మహిళను వివాహమాడాలంటే ఆమె తప్పనిసరిగా ముస్లిం మతాన్ని స్వీకరించాలని చెప్పారు. అంతేకాకుండా వారి ‘లా’ మతాంతర వివాహాలను అంగీకరించదని, హిందువులను వివాహమాడాలంటే మతమార్పిడి తప్పనిసరి అని చెప్పారు. ఇప్పుడు విషయం అనిత నుండి సానుకూల పడాలి. ఎంత ఆధునిక భావాలున్నా, ఆమె సనాతన కుటుంబం నుండి వచ్చింది. మతమార్పిడి ఆమెకు ససేమిరా ఇష్టం లేదు. ఇరువురూ బుర్రబద్దలు కొట్టుకుని ఆలోచించి, పరిష్కారం కనిపించక, చివరకు స్నేహితుల సలహాతో న్యాయవాదిని సంప్రదించారు. న్యాయవాది వారికి ప్రత్యేక వివాహ చట్టం 1954 గురించి వివరించారు. దానినే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అంటారనీ, దీనిననుసరించి జరిగే వివాహాలను రిజిస్టర్ వివాహాలని సామాన్య పరిభాషలో అంటారని వివరించారు. ఈ చట్టాన్ననుసరించి భిన్నమతాలకు చెందిన వారు వివాహాలు చేసుకోవచ్చనీ, వివాహాలకు లౌకిక లక్షణం కల్పించడం ఈ చట్టం ముఖ్యోద్దేశ్యమనీ, కులం, మతం, ఆచారాలతో సంబంధం లేకుండా వివాహం చేసుకోవచ్చనీ, ఈ వివాహాలకు చట్టబద్ధత ఉందని, అంతేగాక న్యాయపరంగా కూడా అన్ని హక్కులు, రక్షణలూ లభిస్తాయని చెప్పారు. ఈ వివాహాలు రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిపిస్తారని చెప్పారు. అనిత, అక్బర్లు ఊపిరి పీల్చుకున్నారు. తమ ప్రేమను సుసంసన్నం చేసుకునేందుకు రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లారు. వారి ప్రేమ కథ ఆ విధంగా సుఖాంతం అయింది. ఇ.పార్వతి అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ -
పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్యాయత్నం
వాల్మీకిపురం: వాల్మీకిపురం మండలంలో శుక్రవారం ఓ వ్యక్తి తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి, తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మండలంలోని సాకిరేవుపల్లె పంచాయతీ వడ్డిపల్లెకు చెందిన డి.శేఖర్ (35) కొన్ని సంవత్సరాలుగా కలికిరి ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటూ ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా భార్య భర్త మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. జీవితంపై విరక్తి చెందిన శేఖర్ శుక్రవారం ఉదయం తన పిల్లలు లక్ష్మి (10), ప్రదీప్ (8), ప్రణీత (7)లను వడ్డిపల్లెలోని తన వ్యవసాయ పొలం వద్దకు తీసుకెళ్లాడు. విషం కలిపిన సీతలపానీయం వారికి తాపి, తానూ తాగేశాడు. స్థానికులు గమనించి హుటాహుటిన వాల్మీకిపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వారి పరిస్థితి కుదుటపడినట్లు వైద్యులు తెలిపారు. -
ఐశ్వర్యతో మనస్పర్థలా?
నటుడు ధనుష్ చాలా బిజీ హీరో. తమిళం, హిందీ అంటూ జాతీయ స్థాయిని అధిగమిస్తున్నారు. అదేవిధంగా ఆయన అర్ధాంగి ఐశ్వర్య దర్శకురాలిగా తనను నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. అలాంటి దంపతుల మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయనే ప్రచారం హల్చల్ చేస్తున్నది. వీటికి స్పందించిన ధనుష్, అవన్నీ వట్టి వదంతులేనని కొట్టి పారేశారు. ఆయన మాట్లాడుతూ, తనను అందగాడిగా మార్చింది తన భార్య ఐశ్వర్య అన్నారు. ఇంటిలో తమ కుటుంబ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. తాను ఐశ్వర్య, పిల్ల లు, అమ్మానాన్న, అన్నయ్య అంటూ ఉమ్మడి కుటుం బంగా జీవిస్తుం డడం ఆనందంగా ఉందన్నారు. తాను షూటింగ్లలో బిజీగా ఉండి, ఇంటి కి వచ్చినప్పుడు చాలా ప్రశాంతంత లభిస్తుంద న్నారు. వృత్తి రీత్యా, తాను ఇంట్లో లేనప్పుడు కుటుంబ బాధ్యతలన్నీ ఐశ్వర్య చూసుకుంటున్నారని, అంతకంటే, తాను ఆశించేదేముంటుందని ధనుష్ అన్నారు. -
యముళ్లైన మొగుళ్లు..
మూడు ముళ్లు.. ఏడడుగులు.. అగ్ని సాక్షిగా చేసిన ప్రమాణాలు.. నీటి మూటలే అవుతున్నాయి. సంసార సాగరంలో చిన్నపాటి ఒడిదుడుకులకే సహనం కోల్పోతున్నారు. కడదాక కంటికి రెప్పలా కాపాడుకుంటాడనుకున్న భర్తే, భార్యాపిల్లల పాలిట యమకింకరుడవుతున్నాడు. నగరంలో ఇటీవల జరిగిన వరుస సంఘటనలు పలువురిని కలచివేస్తున్నాయి. సాక్షి, సిటీబ్యూరో: ఇంట్లో, బయట భార్యకు పూర్తి రక్షణ కల్పించాల్సిన బాధ్యత భర్తదేనని ఇటీవల ఓ తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే రక్షణ సంగతి దేవుడెరుగు కట్టుకున్న భర్తలే భార్యలను కడతేరుస్తున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. అందంగా లేవని ఒకరు, అనుమానంతో మరొకరు, సట్టా ఆడొద్దనందుకు మనస్పర్థలతో.. ఇలా చిన్న చిన్న కారణాలతో భార్యలను అత్యంత దారుణంగా హతమార్చిన ఉదంతాలు పలువురిని కలిచివేశాయి. మరోపక్క భర్తలు పెట్టే బాధలు భరించలేక పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలూ వెలుగుచూస్తున్నాయి. సంసార సాగరంలో చిన్నిచిన్న సమస్యలను సర్థుకుపోవాల్సిన చోట పంతాలకు పోయి, ప్రాణాల మీదకుతెచ్చుకుంటున్నారు. ఈ నెలలో నగరంలో ఏడు కుటుంబాల్లో చోటుచేసుకున్న ఘోర ఉదంతాలు ఇలా.. సట్టా ఆడవద్దన్నందుకు.. తిరుమలగిరి పోలీసు స్టేషన్ పరిధిలోని చిన్నకమేళాకు చెందిన నర్సింగ్‌రావు, తార దంపతులు. సట్టాకు బానిసైన నర్సింగ్రావును తార మందలించింది. ఈ పాపానికి ఈ నెల 5వ తేదీన మద్యం సేవించి ఇంటికి వచ్చిన నర్సింగ్‌రావు భార్యతో గొడవపడి ఉరివేసి చంపేశాడు. ప్రస్తుతం అతడు చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. మనస్పర్థలతో.. భవానీనగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని జహంగీర్‌నగర్‌కు చెందిన సయ్యద్ జాఫర్(35), నజియా బేగం (32) దంపతుల మధ్య చిన్న విషయంలో మనస్పర్థలు వచ్చాయి. ఆవేశానికిలోనైన జాఫర్ ఈ నెల 10వ తేదీన భార్యను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అందంగా లేదని.. గాజులరామారానికి చెందిన ఎజాస్ (22),మోసిన్ (19)లకు ఐదు నెలల క్రితమే పెళ్లి అయ్యింది. భార్య అందంగా లేదని చీటికిమాటికి ఆమెతో గొడవపడేవాడు. ఈ నెల 16వ తేదీన కూడా ఇదే విషయమై ఘర్షణకు దిగి మోసిన్ గొంతు నులిమి చంపేశాడు. ప్రస్తుతం ఎజాస్ జైలులో ఉన్నాడు. అనుమానంతో.. గుండ్లపోచంపల్లికి చెందిన కనకవ్వ (30), నర్సింహ (36) దంపతులు. భార్యపై అనుమానంతో నర్సింహ ఈ నెల 19న ఆమెతో గొడవపడి కొట్టి హ తమార్చాడు. ప్రస్తుతం నర్సింహ జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. అత్తింటి వేధింపులతో.. అత్తింటి వేధింపులు భరించలేక గాంధీనగర్‌కు చెందిన స్వప్న (24) తన కూతురు శాన్వీ (20 నెలలు)తో కలిసి ఈ నెల 13న ఘట్కేసర్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. భార్యపై కోపంతో.. భార్యపై కోపంతో ఓ ప్రొఫెసర్ తన ఇద్దరు పిల్లలను దారుణంగా నరికి చంపి, తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అల్వాల్‌కు చెందిన గురుప్రసాద్, సుహాసిని దంపతుల విడాకుల కేసు పెండింగ్‌లో ఉంది. భార్యపై ఉన్న కోపంతో గురుప్రసాద్ తన ఇద్దరు పిల్లలు విఠల్ విరించి (09), నందవిహారి (05)లను ఈ నెల 6న కిరాతకంగా చంపి, తాను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త వేధింపులు భరించలేక.. ఏపీ టెక్ట్స్‌బుక్ కాలనీలో నివసించే దినేష్, కవిత (40) దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు వైష్ణవి (18) భావన (16) ఉన్నారు. ఆస్తి వివాదంలో భర్త వేధింపులు భరించలేని కవిత శుక్రవారం తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా వైష్ణవి, భావన మృతి చెందారు. కవిత పరిస్థితి విషమంగా ఉంది. పిల్లల్ని చంపకండి దంపతుల గొడవల మధ్య క్షణికావేశంలో పిల్లలను చంపడం సమంజసం కాదు. ఏదైనా సమస్య ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలి. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని నడుచుకుంటే సంసారం కలకాలం సుఖ సంతోషాలతో ఉంటుంది. -అనురాధారావు బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు బంధం బలహీనపడటంతోనే.. దంపతులు ఒకరి నొకరు అర్థం చేసుకోవాల్సింది పోయి ఎవరికి వారు పంతాలకు పోతున్నారు. వీటికి కొన్ని టీవీ సీరియళ్లు కూడా తోడవుతున్నాయి. ఎంతో అన్యోన్యంగా సాగాల్సిన దాంపత్య జీవితం అనుమానాలు, అసూయతో గొడవలు, విడాకులు, ఆత్మహత్యలు, హత్యలకు దారితీస్తోంది. మనుషుల మధ్య తగ్గిన నమ్మకం, పెరిగిన అనుమానాలే ఇందుకు కారణం. -డాక్టర్ కల్యాణ్‌చక్రవర్తి, సైక్రియాటిస్ట్ -
పిల్లల్ని నాతోనే ఉంచుకోవడానికి చట్టం సాయం చేస్తుందా?
నా వయసు 32. ఇద్దరు పిల్లలు. బాబుకి ఆరేళ్లు, పాపకి రెండేళ్లు. మా వారికీ, నాకూ మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఆయన నాతో ఉండలేను, విడిపోతానంటున్నారు. నాకు ఆయనంటే చాలా ప్రేమ. కాని పొసగనప్పుడు విడిపోవడంలో తప్పులేదనిపిస్తోంది. ఆయన పిల్లల్ని తనకు ఇచ్చేయమంటున్నారు. కానీ నాకది ఇష్టం లేదు. నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను. నెలకు ముప్పైవేలు సంపాదిస్తున్నాను. వాళ్లని పెంచుకోగలను. పైగా వాళ్లని వదిలి ఉండలేను. ఎంతచెప్పినా ఆయనకు అర్థం కావడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? పిల్లల్ని నాతోనే ఉంచుకోవడానికి చట్టం సాయం చేస్తుందా? - సంధ్యారాణి (పేరు మార్చాం), రాజమండ్రి భార్యాభర్తలు విడిపోవడం అన్నది వాళ్ల వాళ్ల పరిస్థితులు, మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. అయితే పిల్లలు ఉన్నప్పుడే సమస్య. తల్లిదండ్రులు విడిపోవడమన్నది పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది. మీరు ఇప్పటికే నిర్ణయం తీసేసుకున్నారు కాబట్టి, ఇక దానిగురించి చెప్పేదేమీ లేదు. ఇక మీరడిగిన దాని గురించి... మైనర్ పిల్లలు తల్లి సంరక్షణలోనే ఉండాలని ఇప్పటికే పలు కేసుల్లో తీర్పు వెలువడింది. చట్టం ప్రకారం పిల్లలకు తండ్రే సంరక్షకుడు. అయితే తల్లి ప్రేమ, తండ్రి కంటే తల్లే పిల్లల పట్ల ఎక్కువ అప్రమత్తంగా, బాధ్యతగా ఉంటుందన్న విషయాలు నిరూపితమయ్యాయి కాబట్టి... చాలావరకూ కేసుల్లో పిల్లల్ని తల్లికే అప్పగిస్తూ తీర్పు ఇస్తోంది న్యాయస్థానం. పైగా మీరు బాగా సంపాదిస్తున్నారు. పిల్లల్ని చూసుకునే స్థోమత ఉంది. కాబట్టి మీరు ధైర్యంగా పిల్లల కస్టడీ కోసం కేసు వేయవచ్చు. కస్టడీ కేసుల్లో తీర్పు ఇచ్చే ముందు తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులు, వ్యక్తిత్వం, ప్రవర్తన వంటి అన్ని విషయాలనూ పరిశీలిస్తారు. తండ్రి స్థోమత సరిగ్గా లేకపోయినా, అతడు మరో పెళ్లి చేసుకున్నా అతడికి పిల్లల్ని అప్పగించరు. కాకపోతే జీవితాంతం అతడికి పిల్లల్ని కలుసుకునే హక్కు మాత్రం ఉంటుంది. ఒకవేళ అతడి వల్ల పిల్లలకు ఏదైనా ప్రమాదం జరుగుతుందనిపిస్తే... కోర్టులో తల్లి పిటిషన్ వేసుకోవచ్చు. కోర్టు విజిటేషన్ రైట్స్‌ని క్యాన్సిల్ చేస్తుంది. అంతేకాదు... మీరు సంపాదిస్తున్నా కూడా, పిల్లల పోషణ కోసం మీరు అతడి నుంచి మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. మీ పిల్లలకు ఆయన ఆస్తిలో హక్కు ఉంటుంది. దాని కూడా మీరు పొందవచ్చు. అయితే ఒకటి... ముందు మీ వారితో స్పష్టంగా మాట్లాడండి. అన్నీ వివరించి ఒప్పించేందుకు ప్రయత్నించండి. ఆయన ఇక అంగీకరించరని తేల్చుకున్నాకే కోర్టుకు వెళ్లండి. ఏ సమస్య అయినా ఇంట్లో పరిష్కారమైతే బాగుంటుంది కదా!