నా భర్త ఓ అపరిచితుడు | My husband is a stranger | Sakshi
Sakshi News home page

నా భర్త ఓ అపరిచితుడు

Published Tue, Jul 7 2015 10:46 PM | Last Updated on Sun, Sep 3 2017 5:04 AM

నా భర్త  ఓ అపరిచితుడు

నా భర్త ఓ అపరిచితుడు

భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తో, వేరేవేరే కారణాల వల్లో గొడవలు వస్తే... రాజీపడి, సర్దుబాటు చేసుకుని, సరిదిద్దుకుని, వాటిని పరిష్కరించుకోవచ్చు. కానీ కాంప్రమైజ్‌కు కూడా అవకాశం ఇవ్వని దురదృష్టకర సంఘటనలు జరిగితే మాత్రం అవి దారుణమైన పర్యవసానాలకు దారితీస్తాయి. జీవితాన్నే తలకిందులు చేస్తాయి. ఇలాంటప్పుడు విడిపోవడమే ఆరోగ్యకరమైన పరిష్కారమేమో ననిపిస్తుంది.
 
ప్రశ్న - జవాబు


మా పెళ్లయ్యి ఏడు సంవత్సరాలయింది. మాది ఎంతో అన్యోన్యమైన దాంపత్యం. మంచి ఉద్యోగాలు. నా భర్త నన్నూ, పాపనూ ఎంతో ప్రేమగా చూసుకునేవారు. కానీ నా జీవితంలో దిగ్భ్రాంతికి లోనయ్యే సంఘటన జరిగింది. నా నమ్మకం, విశ్వాసం దెబ్బతిన్నాయి. నేను తీవ్రమైన మానసిక వేదనకు గురై, ప్రస్తుతం మానసిక వైద్యుల ఆధ్వర్యంలో చికిత్స తీసుకుంటున్నాను. మనుషుల మీద అంటే మగవాళ్ల మీద నమ్మకం పోయింది. విషయం ఏమిటంటే మా పక్కింట్లో ఉండే దంపతులకు ఒక చిన్న పాప ఉంది.వయసు ఎనిమిదేళ్లుంటాయి. అంకుల్ అంకుల్ అంటూ మా వారికి బాగా చేరిక అయింది. రోజూ మా ఇంటికి వస్తూ పోతూ ఉండేది. ఒకరోజు నేను ఇంట్లోలేని సమయంలో పాప వచ్చిందట. మా వారిలో మృగాడు మేల్కొన్నాడు. కూతురులాంటి పాపను పాశవికంగా చిదిమి వేశాడు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ప్రస్తుతం జైలులో ఉన్నాడు. నాకు వాడి ముఖం చూడ టం కూడా ఇష్టం లేదు. నా పాపపై వాడి నీడ కూడా పడకూడదు. ఆ పశువు చేతుల్లో నా పాపకు కూడా రక్షణ ఉండదు. నేను వైద్యశాలలో ఇన్‌పేషెంట్‌గా ఉండి లెటర్ రాస్తున్నాను. దయచేసి మార్గం సూచించండి.
 - ఒక సోదరి, హైదరాబాద్

 మీకు నా సానుభూతి తెల్పుతున్నాను. పొదరిల్లు లాంటి మీ జీవితం ఒక్క సంఘటనతో ఎలా కూలిపోయిందో తెలుస్తుంది. మీ భర్త పైశాచికానికి మీ మనసెంతగా విలపిస్తున్నదో అర్థమవుతోంది. మీరు నిశ్చింతగా విడాకులు తీసుకోండి. దానితోపాటు పాప కష్టడీ కూడా. హిందూ వివాహ చట్టం 1955 సెక్షన్ 13(2) (జీఠి) భార్య మాత్రమే విడాకులు పొందడానికి గల అదనపు గ్రౌండ్స్ గురించి వివరిస్తుంది. భర్త ఇతర స్త్రీల మీద  అత్యాచారం చేసినా, పశువులతో సంపర్కం చేసినా, అసహజ లైంగిక చర్యలకు పాల్పడినా (సొడోమి) భార్య విడాకులు పొందవచ్చు. దీనితోపాటు మిమ్ములను తీవ్రమైన వేదనకు గురి చేశారు కనుక క్రూయల్టీ కూడా ఒక కారణమవుతుంది. వెంటనే విడాకులకు అప్లై చేయండి.
 
నా వివాహమై పది సంవత్సరాలు అయింది. నా భర్త హుసేన్. మాకిద్దరు సంతానం. ఇద్దరూ ఆడపిల్లలే, వాళ్లు పుట్టినప్పటినుంచి మావారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇద్దరూ ఆడపిల్లల్ని కన్నానని నన్ను వేధింపులకు గురి చేస్తున్నారు. ఆర్థికంగా స్థిరపడిన కుటుంబం మాది. పిల్లలను చక్కగా పోషించే స్తోమత ఉంది. కాని నా భర్త చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. ఎన్నోసార్లు నాపై చేయి చేసుకున్నారు. నేను టీచర్‌గా పని చేస్తున్నాను. రెండేళ్లనుంచి పైసా కూడా ఖర్చుపెట్టడం మానేశారు. అదేమంటే నీ జీతంతో సర్దుకుపో అంటున్నారు. ఏమిటా అని ఎంక్వయిరీ చేయిస్తే, అతను మరో వివాహం చేసుకున్నాడని తెలిసింది. అదేమంటే తను నాలుగు వివాహాలు చేసుకోవచ్చని వాదిస్తున్నారు. నాపై, పిల్లలపై వేధింపులు ఎక్కువైనాయి. తాగివచ్చి విపరీతంగా కొడుతున్నారు. పిల్లలు తండ్రంటేనే భయపడుతున్నారు. నాకు అతనితో ఉండాలని లేదు. విడాకులిమ్మంటే ఇవ్వడు. ప్రవర్తన మార్చుకోమంటే మార్చుకోడు. నన్నేం చేయమంటారు? మార్గం చెప్పండి.
 - రజియా, హైదరాబాద్

మీరు మానసికంగా, శారీరకంగా ఎంతో ఆవేదనకు లోనై ఈ నిర్ణయం తీసుకున్నారని అర్థమౌతోంది. ముస్లిం వివాహాలు, విడాకులు చాలా సంక్లిష్టమైనవి. మగవారికి ఎన్నో రకాల తలాక్‌లు ఉన్నాయి. కానీ ముస్లిం మహిళలు విడాకులు కావాలంటే కోర్టును ఆశ్రయించి పొందడానికి ఉన్న చట్టమే డిజల్యూషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజ్ యాక్ట్ 1939. కేవలం వివాహిత ముస్లిం మహిళలు మాత్రమే ఈ చట్టం ద్వారా విడాకులు పొందవచ్చు. ఈ చట్టాన్ని అనుసరించి విడాకులు పొందాలంటే, కొన్ని గ్రౌండ్స్ ఉన్నాయి. కుటుంబాన్ని పోషించకుండా ఉంటే, అది కూడా విడాకులకు సహేతుక కారణమవుతుంది.

మీ విషయంలో మీ భర్త గత రెండు సంవత్సరాలనుండి మిమ్మల్ని పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. చట్టంలో కూడా రెండు సంవత్సరాలనుండి భార్యాపిల్లల పోషణ బాధ్యత వహించకుండా నిర్లక్ష్యం చేస్తే అది విడాకులకు కారణమవుతుందని చెప్పారు. అంతేకాకుండా తీవ్రమైన శారీరక, మానసిక వేధింపులకు గురి చేసినా అది కూడా విడాకులకు సహేతుకమైన కారణమవుతుందని చట్టంలో చెప్పారు కనుక మీరు ఈ చట్టాన్ని అనుసరించి రెండు కారణాలతో విడాకులకు అప్లై చేసుకోవచ్చు. ధైర్యంగా ఉండండి. ఒకవేళ మీ భర్త ఒప్పుకుంటే, కోర్టుకు వెళ్లకుండా మీ మతచట్టాన్ని అనుసరించి మీరిరువురూ కన్సెంట్ డైవర్స్ అంటే పరస్పర అంగీకారపూర్వకమైన విడాకులు పొందవచ్చు. మీ భర్త అంగీకరించట్లేదంటున్నారు కనక మీరు కోర్టుకు వెళ్లవలసిందే.
 నాకు 40 సంవత్సరాలు. నేను అవివాహితురాలిని. మా పుట్టింట్లో అన్నదమ్ముల కుటుంబాలతో కలసి ఉంటున్నాను. మేముండే ఇల్లు చాలా పాతబడి పోయింది. దానికి రిపేర్లు చేయించుకుందామంటే నా సోదరులు ఒప్పుకోవడం లేదు. నాన్నగారు వీలునామా రాయకుండా మరణించారు. నాకైతే నా పోర్షన్ నాకిస్తే దాన్ని ఆధునీకరించుకోవాలని ఉంది. నా వాటా నాకు పంచమని అడిగే హక్కు నాకు లేదా?
 - ఒక సోదరి, అనకాపల్లి

ఉమ్మడి నివాస గృహాన్ని విభజించమని అడిగే హక్కు మీకు ఉంది. ఈ హక్కు హిందూ వారసత్వ చట్టం 2005 కేంద్ర సవరణను అనుసరించి వచ్చింది. పాత చట్టం ప్రకారం, అంటే హిందూ వారసత్వ చట్టం 1986 ఉమ్మడి ఆస్తిలో మహిళలకు సమాన హక్కులున్నప్పటికీ ఉమ్మడి నివాస గృహంలో విభజన కోరే హక్కు వారికి లేదు. కొడుకులు ఆస్తి విభజన కోరే వరకు కూతుళ్లు ఆగవలసి వచ్చేది. కేంద్ర సవరణ చట్టం దీన్ని రద్దు చేసింది. దీని ప్రకారం ఆ గృహాన్ని విభజించమని కోరి, మీ భాగంలో మీ ఇష్టం వచ్చినట్లు మార్పు చేర్పులు చేయించుకోవచ్చు. ముందు మీ సోదరులను మంచిమాటలతో అడగండి. వినకుంటే కోర్టును ఆశ్రయించి, పార్టిషన్ సూట్ వేసుకోండి.
 
కేస్ స్టడీ
 
లాజిక్ మేజిక్
అనిత, అక్బర్‌లు గత 5 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇరువురూ ఉన్నత విద్యావంతులు, ఆధునిక భావాలు కలవారు. మంచి ఉద్యోగాలు చేసుకుంటూ ఏ బాధ్యతలూ లేని జీవితం గడుపుతున్నవారు. ఇటీవలే వారి ప్రేమ విషయం పెద్దలకు చెప్పి, వివాహానికి అనుమతి కోరారు. ఇరువురి తలిదండ్రులూ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. మతాంతర వివాహానికి ససేమిరా అన్నారు. ఎన్నో రకాలుగా నచ్చచెప్పే ప్రయత్నం చేశారు అనిత, అక్బర్‌లు. అనిత తలిదండ్రులు దిగి రాలేదు. బెదిరించినా, ప్రాధేయపడినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదన్నారు. అక్బర్ తలిదండ్రులు కాస్త మెత్తబడ్డారు. కానీ ఒక బాంబ్ పేల్చారు. అదేమంటే ఒక ముస్లిమ్ యువకుడు హిందూ మహిళను వివాహమాడాలంటే ఆమె తప్పనిసరిగా ముస్లిం మతాన్ని స్వీకరించాలని చెప్పారు. అంతేకాకుండా వారి ‘లా’ మతాంతర వివాహాలను అంగీకరించదని, హిందువులను వివాహమాడాలంటే మతమార్పిడి తప్పనిసరి అని చెప్పారు. ఇప్పుడు విషయం అనిత నుండి సానుకూల పడాలి. ఎంత ఆధునిక భావాలున్నా, ఆమె సనాతన కుటుంబం నుండి వచ్చింది. మతమార్పిడి ఆమెకు ససేమిరా ఇష్టం లేదు. ఇరువురూ బుర్రబద్దలు కొట్టుకుని ఆలోచించి, పరిష్కారం కనిపించక, చివరకు స్నేహితుల సలహాతో న్యాయవాదిని సంప్రదించారు. న్యాయవాది వారికి ప్రత్యేక వివాహ చట్టం 1954 గురించి వివరించారు. దానినే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అంటారనీ, దీనిననుసరించి జరిగే వివాహాలను రిజిస్టర్ వివాహాలని సామాన్య పరిభాషలో అంటారని వివరించారు. ఈ చట్టాన్ననుసరించి భిన్నమతాలకు చెందిన వారు వివాహాలు చేసుకోవచ్చనీ, వివాహాలకు లౌకిక లక్షణం కల్పించడం ఈ చట్టం ముఖ్యోద్దేశ్యమనీ, కులం, మతం, ఆచారాలతో సంబంధం లేకుండా వివాహం చేసుకోవచ్చనీ, ఈ వివాహాలకు చట్టబద్ధత ఉందని, అంతేగాక న్యాయపరంగా కూడా అన్ని హక్కులు, రక్షణలూ లభిస్తాయని చెప్పారు. ఈ వివాహాలు రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిపిస్తారని చెప్పారు. అనిత, అక్బర్‌లు ఊపిరి పీల్చుకున్నారు. తమ ప్రేమను సుసంసన్నం చేసుకునేందుకు రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లారు. వారి ప్రేమ కథ ఆ విధంగా సుఖాంతం అయింది.
 
 ఇ.పార్వతి
 అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement