‘శ్రీవల్లి నా పెళ్లాం. పెళ్లాం మాట మొగుడు వింటే ఎట్టా ఉంటుందో పెపంచకానికి చూపిస్తా’ అని తాజాగా విడుదలైన ‘పుష్ప2’ ట్రైలర్‌లో హీరో అంటాడు. సానుకూల వివాహ అనుబంధంలో భార్య మాటకు విలువ ఇవ్వడం కుటుంబానికి మంచిది అంటారు నిపుణులు. ‘భార్య మాట వినే భర్త’ను లొంగుబాటుగా చెప్పే పితృస్వామ్య పరంపర ఉన్నా దాని వల్ల లాభం కంటే నష్టాలే ఎక్కువ అంటున్నారు.
కుటుంబ జీవనంలో కీలక నిర్ణయాలే కాదు మంచీ చెడూల్లో భార్య సలహా వినదగ్గది. కొన్ని పరిశీలనలు. ఒక వివాహబంధం విజయవంతం కావాలంటే ముందు వినడం నేర్చుకోవాలి’ అంటున్నారు ప్రవర్తనా నిపుణులు. ‘భార్యాభర్తలు మొదట ఎదుటి వారు ఏం చెప్తున్నారనేది ఓపిగ్గా వింటే చాలు ఆ బంధం సగం సఫలమైనట్టే’ అని వారు అంటున్నారు. మన సమాజంలో భార్య మాట వినే భర్త గురించి పరిహాసం ఆడటం ఉంది. ‘భార్యా విధేయుడు’ అంటూ గేలి చేసేవారు కూడా ఉంటారు.
సమాజం ఇంత ముందడుగు వేసినా ‘భార్య మాట వినడంలో తప్పు ఏముంది’ అని ఆలోచించే పరిస్థితి లేదు. అమెరికాలో కొత్తగా పెళ్లయిన దాదాపు 130 జంటలను పరిశీలించిన ఒక జాన్ గోట్‌మ్యాన్ అనే సైకాలజిస్ట్ ‘భార్య చెప్పేది సానుకూలంగా వినే భర్త ఉన్న జంటలు సంతోషంగా గడపడం’ గమనించాడు. ‘అలాగని ఈ జంటల్లో భర్త మాట భార్య వినకపోవడం అంటూ లేదు. వారు ఎలాగూ వింటారు’ అంటాడు గోట్ మ్యాన్. భారతీయ సమాజంలో భర్తకు ఎదురు నిలవడం అందరు భార్యలు చేయరు.
అయితే జోక్‌గానో, గొణుగుతున్నట్టుగానో, అనునయంగానో చెప్పే భార్యలు ఉంటారు. ‘అలాంటి భార్యలు చెప్పింది విని ముందుకు సాగే భర్త ఉన్న జంటలు కూడా ఇంచుమించు గొడవలు లేకుండా ఉంటున్నాయి’ అంటాడు గోట్‌మ్యాన్. భార్యాభర్తల్లో ‘అతను చెప్పేది ఏముందిలే’ అని భార్య అనుకున్నా ‘ఆమెకేం తెలుసు ఆమె ముఖం’ అని భర్త అనుకున్నా ఆ వివాహబంధం ప్రమాదంలో పడుతుంది. ఏ వివాహ బంధమైనా ఒకరి దృష్టికోణం నుంచి నడవదు. కాపురంలో తల్లి తరపు వాళ్లు, తండ్రి తరుపు వారు ఉంటారు.
స్నేహితులు ఉంటారు. ఇద్దరి వేరు వేరు కెరీర్‌లు ఉంటాయి. అంటే ఒక సమస్యకు కచ్చితంగా కనీసం రెండు దృష్టికోణాలుంటాయి. భర్తలు కేవలం తమ దృష్టికోణమే సరైనది అనుకోకూడదు. ‘స్త్రీలు జాగ్రత్తగా అన్నీ గమనించి భర్తకు సూచనలు చేస్తారు. ఆ సూచనలను భర్త ఆమెతో చర్చించాలి. నా మాటే నెగ్గాలి అని తప్పు నిర్ణయం తీసుకోవడం వల్ల నష్టం ఇద్దరికీ వస్తుంది’ అంటాడు గోట్‌మ్యాన్.
భర్త తన స్పందన, అప్పులు, ఇచ్చిన హామీలు, కొన్న/కొనబోయే ఆస్తులు, పిల్లల కోసం పొదుపు, ఆరోగ్య విషయాలు... ఇవన్నీ భార్యకు తెలియచేస్తూ ఆమె సలహాను వినాల్సి ఉంటుంది. అలాగే భర్త ఇంట్లో లేనప్పుడు పిల్లల ప్రవర్తన, వారి కదలికలు, బంధువుల రాకపోకలు వచ్చే డిమాండ్లు ఇవన్నీ భార్య తప్పకుండా భర్తకు చేరవేయాలి. ముఖ్యంగా పిల్లలను కరెక్ట్ చేయాల్సిన అంశాలు భార్య లేవనెత్తినప్పుడు భర్త నిర్లక్ష్యం చేయరాదు.
అవి సమస్యలు తెస్తాయి. అందుకే గతంలో స్త్రీల మాట చెల్లుబాటయ్యే సందేశం ఇస్తూ ‘పెళ్లాం చెబితే వినాలి’ లాంటి సినిమాలు వచ్చాయి. ఇన్నేళ్ల తర్వాత ‘ఫైర్’లాంటి పుష్ప కూడా ‘పెళ్లాం మాట వినాలి’ అంటున్నాడు. భార్య సరైన సలహా ఇస్తే దానిని ఎందుకు వినకూడదు చెప్పండి?
(చదవండి: హృతిక్ రోషన్ సోదరి సునైనా వెయిట్ లాస్ స్టోరీ: ఏకంగా 50 కిలోలు..!)
Comments
Please login to add a commentAdd a comment