భార్య, భర్తల బంధం బలంగా ఉండేందుకు పలు సూచనలు
దేశంలోనే మొట్ట మొదటి ఆన్‌లైన్ శిక్షణా కేంద్రం
వేలాది మంది యువతసందేహాలను నివృత్తి చేస్తూ
మూడు నెలల పాటు వివిధ అంశాల్లో అవగాహన
గతంలో పెళ్లి జరగాలంటే వధూవరులను పెద్ద నాన్నలు, బాబాయ్‌లు, మామలు, పెద్దమ్మలు, మేనత్తలు అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసి అబ్బాయి లేదా అమ్మాయి నచి్చతే వారి గుణగణాలు తెలుసుకొని కుటుంబ పరిస్థితి తెలుసుకొని పెళ్లి జరిపించేవారు. వివాహం జరిగిన తర్వాత భర్తతో ఎలా మసలుకోవాలి?, అత్తగారింట్లో ఎలా ఉండాలి? ఇలాంటివన్నీ అమ్మమ్మలు, తాతలు, నానమ్మలు కొత్తగా పెళ్లయిన వారికి చెప్పేవారు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు కరువై యాంత్రిక జీవనం కొత్తగా పెళ్లయిన వారినే కాకుండా పెళ్లికి ముందు కూడా వధూవరులను, పెళ్లి తర్వాత భార్యా, భర్తలను మనస్పర్థలకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టోలిచౌకిలో నివసించే ఇలియాస్ షంషి అనే వ్యక్తి ‘దుల్హా–దుల్హన్’ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చాడు. దీని గురించిన మరిన్ని విశేషాలు..!
టోలిచౌకి బాల్‌రెడ్డినగర్ కాలనీలో ఏర్పాటు చేసిన దుల్హా–దుల్హన్ ఫ్యామిలీ ఇన్‌స్టిట్యూట్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఈ ఇన్‌స్టిట్యూట్‌లో కొత్తగా పెళ్లి చేసుకోబోయేవారు ఎలా ఉండాలి అనే దానిపై 15 అంశాల్లో నిర్వాహకుడు ఇలియాస్ షంషి శిక్షణ ఇస్తున్నారు. హైదరాబాద్‌లోనే కాకుండా బెంగళూరు, చెన్నై, గుజరాత్, ఢిల్లీ, కోల్‌కతాతో పాటు దుబాయ్, కెనడా, అమెరికాలో కూడా షంషి ప్రారంభించిన ఆన్‌లైన్ క్లాస్‌లకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. పెళ్లంటే ఏంటి?, పెళ్లిలో మంత్రాల అర్థం ఏంటి? వాటిని ఎలా అర్థం చేసుకోవాలి?, పెళ్లి ఎందుకు?, బాధ్యతలు, భర్తతో మనస్పర్థలు వస్తే వాటిని ఎలా పరిష్కరించుకోవాలి?, భార్య అంటే ఎలా ఉండాలి?, భర్త చేయాల్సినవి, చేయకూడనివి ఏంటి?, మీరు మంచి భర్తగా ఎలా ఉండొచ్చు తదితర అంశాలపై షంషి శిక్షణ ఇస్తున్నారు.
సందేహాలను నివృత్తి చేస్తూ..
హోమ్ మేనేజ్‌మెంట్, భర్త మనసును ఎలా గెలుచుకోవాలి, భార్య మనసును ఎలా గెలుచుకోవాలి ఇలాంటివన్నీ ఈ ట్రైనింగ్‌లో భాగమయ్యాయి. పెళ్ళికి ముందు వధూవరులు వస్తే వారు అడిగే ప్రశ్నలకు సందేహాలను నివృత్తి చేస్తూనే పెళ్లి తర్వాత మంచి భర్తగా, లేదా మంచి భార్యగా ఎలా ఉండాలి అన్న అంశాలపై ఈ శిక్షణ కొనసాగుతున్నది.
మంచి స్పందన
మేం ఈ సంస్థను ఏర్పాటు చేసినప్పుడు స్పందన అంతంత మాత్రంగానే ఉండేది. రోజులు గడుస్తున్న కొద్దీ మా సంస్థకు రెస్పాన్స్ పెరుగుతోంది. అమెరికా, దుబాయ్, కెనడా తదితర ప్రాంతాల నుంచి కూడా మేం నిర్వహించే ఆన్‌లైన్ క్లాస్‌లకు అభ్యర్థులు హాజరవుతున్నారు. పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత భార్యా, భర్తల బంధం ఎంత బలంగా ఉండాలో ఈ శిక్షణ ద్వారా సూచిస్తున్నాం. ఇప్పటి వరకూ వేలాది మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. మూడు నెలల పాటు ఈ ఆన్‌లైన్ శిక్షణ ఉంటుంది. అంతే కాదు బెస్ట్ మదర్ అనిపించుకోవడం ఎలా అన్నదానిపై కూడా మా శిక్షణ కొనసాగుతున్నది. ఇటీవల పెళ్లికి ముందే చిన్న చిన్న విషయాల్లో వధూవరులకు మనస్పర్థలు వచ్చి పెళ్లిళ్లు ఆగిపోతున్న ఘటనలూ చూస్తున్నాం. దుల్హన్ కోర్సులో ఈ విషయాలన్నింటికీ సమాధానాలు లభిస్తున్నాయి. యువతీ, యువకులకు వేర్వేరుగా ఈ క్లాసులు ఉంటాయి. ముఖ్యంగా భార్య, భర్తల బంధం బలంగా ఉండాలంటే ఎలా ఉండాలో చూపిస్తున్నాం.
– ఇలియాస్, షంషీ, ట్రైనర్ ఫ్యామిలీ
ఇన్‌స్టిట్యూట్ 2019లో ఏర్పాటు..
ప్రతిరోజూ పాతిక మంది వరకూ ఆన్‌లైన్ క్లాసులకు హాజరయ్యే ఈ ఫ్యామిలీ ఇన్‌స్టిట్యూట్ 2019లో ఏర్పాటైంది. ఇప్పటి వరకూ వేల సంఖ్యలో యువతీ, యువకులకు శిక్షణతో పాటు తగిన సూచనలు జారీ చేశారు షంషి. భార్యా, భర్తల మధ్య ఏదైనా గొడవ వస్తే వాటిని పరిష్కరించే దిశలోనే ఆయన అడుగులు వేస్తున్నారు. ఎవరికైనా ఇలాంటి సలహాలు, సంప్రదింపులు కావాలంటే తమ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ కావొచ్చు అని కూడా పేర్కొంటునారు. పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత మేం చెప్పబోయే అంశాలు ఏమిటి అన్న దానిపై వివరిస్తూ స్పష్టంగా వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment