యముళ్లైన మొగుళ్లు..
మూడు ముళ్లు.. ఏడడుగులు.. అగ్ని సాక్షిగా చేసిన ప్రమాణాలు.. నీటి మూటలే అవుతున్నాయి. సంసార సాగరంలో చిన్నపాటి ఒడిదుడుకులకే సహనం కోల్పోతున్నారు. కడదాక కంటికి రెప్పలా కాపాడుకుంటాడనుకున్న భర్తే, భార్యాపిల్లల పాలిట యమకింకరుడవుతున్నాడు. నగరంలో ఇటీవల జరిగిన వరుస సంఘటనలు పలువురిని కలచివేస్తున్నాయి.
సాక్షి, సిటీబ్యూరో: ఇంట్లో, బయట భార్యకు పూర్తి రక్షణ కల్పించాల్సిన బాధ్యత భర్తదేనని ఇటీవల ఓ తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే రక్షణ సంగతి దేవుడెరుగు కట్టుకున్న భర్తలే భార్యలను కడతేరుస్తున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. అందంగా లేవని ఒకరు, అనుమానంతో మరొకరు, సట్టా ఆడొద్దనందుకు మనస్పర్థలతో.. ఇలా చిన్న చిన్న కారణాలతో భార్యలను అత్యంత దారుణంగా హతమార్చిన ఉదంతాలు పలువురిని కలిచివేశాయి. మరోపక్క భర్తలు పెట్టే బాధలు భరించలేక పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలూ వెలుగుచూస్తున్నాయి. సంసార సాగరంలో చిన్నిచిన్న సమస్యలను సర్థుకుపోవాల్సిన చోట పంతాలకు పోయి, ప్రాణాల మీదకుతెచ్చుకుంటున్నారు. ఈ నెలలో నగరంలో ఏడు కుటుంబాల్లో చోటుచేసుకున్న ఘోర ఉదంతాలు ఇలా..
సట్టా ఆడవద్దన్నందుకు..
తిరుమలగిరి పోలీసు స్టేషన్ పరిధిలోని చిన్నకమేళాకు చెందిన నర్సింగ్‌రావు, తార దంపతులు. సట్టాకు బానిసైన నర్సింగ్‌రావును తార మందలించింది. ఈ పాపానికి ఈ నెల 5వ తేదీన మద్యం సేవించి ఇంటికి వచ్చిన నర్సింగ్‌రావు భార్యతో గొడవపడి ఉరివేసి చంపేశాడు. ప్రస్తుతం అతడు చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నాడు.
మనస్పర్థలతో..
భవానీనగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని జహంగీర్‌నగర్‌కు చెందిన సయ్యద్ జాఫర్(35), నజియా బేగం (32) దంపతుల మధ్య చిన్న విషయంలో మనస్పర్థలు వచ్చాయి. ఆవేశానికిలోనైన జాఫర్ ఈ నెల 10వ తేదీన భార్యను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అందంగా లేదని..
గాజులరామారానికి చెందిన ఎజాస్ (22),మోసిన్ (19)లకు ఐదు నెలల క్రితమే పెళ్లి అయ్యింది. భార్య అందంగా లేదని చీటికిమాటికి ఆమెతో గొడవపడేవాడు. ఈ నెల 16వ తేదీన కూడా ఇదే విషయమై ఘర్షణకు దిగి మోసిన్ గొంతు నులిమి చంపేశాడు. ప్రస్తుతం ఎజాస్ జైలులో ఉన్నాడు.
అనుమానంతో..
గుండ్లపోచంపల్లికి చెందిన కనకవ్వ (30), నర్సింహ (36) దంపతులు. భార్యపై అనుమానంతో నర్సింహ ఈ నెల 19న ఆమెతో గొడవపడి కొట్టి హ తమార్చాడు. ప్రస్తుతం నర్సింహ జైలులో రిమాండ్‌లో ఉన్నాడు.
అత్తింటి వేధింపులతో..
అత్తింటి వేధింపులు భరించలేక గాంధీనగర్‌కు చెందిన స్వప్న (24) తన కూతురు శాన్వీ (20 నెలలు)తో కలిసి ఈ నెల 13న ఘట్‌కేసర్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది.
భార్యపై కోపంతో..
భార్యపై కోపంతో ఓ ప్రొఫెసర్ తన ఇద్దరు పిల్లలను దారుణంగా నరికి చంపి, తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అల్వాల్‌కు చెందిన గురుప్రసాద్, సుహాసిని దంపతుల విడాకుల కేసు పెండింగ్‌లో ఉంది. భార్యపై ఉన్న కోపంతో గురుప్రసాద్ తన ఇద్దరు పిల్లలు విఠల్ విరించి (09), నందవిహారి (05)లను ఈ నెల 6న కిరాతకంగా చంపి, తాను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
భర్త వేధింపులు భరించలేక..
ఏపీ టెక్ట్స్‌బుక్ కాలనీలో నివసించే దినేష్, కవిత (40) దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు వైష్ణవి (18) భావన (16) ఉన్నారు. ఆస్తి వివాదంలో భర్త వేధింపులు భరించలేని కవిత శుక్రవారం తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా వైష్ణవి, భావన మృతి చెందారు. కవిత పరిస్థితి విషమంగా ఉంది.
పిల్లల్ని చంపకండి
దంపతుల గొడవల మధ్య క్షణికావేశంలో పిల్లలను చంపడం సమంజసం కాదు. ఏదైనా సమస్య ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలి. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని నడుచుకుంటే సంసారం కలకాలం సుఖ సంతోషాలతో ఉంటుంది.
-అనురాధారావు బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు
బంధం బలహీనపడటంతోనే..
దంపతులు ఒకరి నొకరు అర్థం చేసుకోవాల్సింది పోయి ఎవరికి వారు పంతాలకు పోతున్నారు. వీటికి కొన్ని టీవీ సీరియళ్లు కూడా తోడవుతున్నాయి. ఎంతో అన్యోన్యంగా సాగాల్సిన దాంపత్య జీవితం అనుమానాలు, అసూయతో గొడవలు, విడాకులు, ఆత్మహత్యలు, హత్యలకు దారితీస్తోంది. మనుషుల మధ్య తగ్గిన నమ్మకం, పెరిగిన అనుమానాలే ఇందుకు కారణం.
-డాక్టర్ కల్యాణ్‌చక్రవర్తి, సైక్రియాటిస్ట్