భార్యాభర్తలు తెలుసుకోవలసిన నిజాలు!
పెళ్లి చేసుకోబోయేవారు తప్పనిసరిగా తెలుసుకోవలసిన నిజాలు కొన్ని ఉన్నాయి. ఇవి చేదు నిజాలైనా భయపడవలసిన పనేమీలేదు. అయితే ఈ నిజాలు తెలుసుకోవడం అందరికీ మంచిది. ముఖ్యంగా మగవారు తెలుసుకోవలసిన అంశాలు కొన్ని ఉన్నాయి. చీటికిమాటికీ ఆత్మహత్యలు చేసుకోవడం ఇప్పుడు పరిపాటైపోయింది. చిన్నచిన్న సంఘటనలకు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు మనం వింటూ ఉంటాం. చిన్న కారణం అయినా కొంతమంది క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటుంటారు.
ఇప్పుడు ఇక్కడ మన ప్రధాన అంశం ఆత్మహత్యలు. అందులో భార్యాభర్తల ఆత్మహత్యలు. భార్యాభర్తలలో ఎవరు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటున్నారో తెలుసుకోవడం. ఎక్కువగా భర్తలే ఆత్మహత్యలు చేసుకుంటున్న నిజాలు ఇప్పుడు వెల్లడయ్యాయి. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(ఎన్ సిఆర్ బి) గణాంకాల ద్వారానే ఈ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆ లెక్కల ప్రకారం గత ఏడాది రాష్ట్రంలో భార్యలు గానీ, భర్తలు గానీ సుమారు లక్ష మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వారిలో భార్యలు 31వేల 921 మంది ఉన్నారు. భర్తలు 63 వేల 343 మంది ఉన్నారు. అంటే భర్తలే అధిక సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు తేలింది.
ఇక విడాకులు తీసుకున్న భార్యా భర్తల ఆత్మహత్యలను పరిశీలిస్తే, అందులోనూ భర్తల ఆత్మహత్యలే అధికంగా ఉన్నాయి. భార్యలు 1,240 మంది ఆత్మహత్యలు చేసుకోగా, భర్తలు 2,043 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కుటుంబ సమస్యలతో ఆత్మహత్యలు చేసుకున్న వారిలోనూ భర్తలే ఎక్కువ మంది ఉన్నారు.
మహిళలకంటే పురుషులే సున్నితంగా మారుతున్నారు. అందులోనూ ముఖ్యంగా భర్తలు కుటుంబ సమస్యలకు తట్టుకోలేకపోతున్నారు. ఏదైనా బాధ ఉంటే మహిళలు వెళ్లగక్కేస్తారని. లేదా పెద్దల సలహాలు తీసుకుంటారని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంకా కావాలంటే మహిళలు చట్టాలను ఆశ్రయిస్తారు. అంతేకాకుండా వారికి సమాజపరంగా, కుటుంబ పరంగా అందరి ఆదరణ, మద్దతు లభిస్తోంది. భర్తల విషయంలో మాత్రం అందుకు రివర్స్. భర్తలు తమ సమస్యలను బయటకు చెప్పుకోలేరు. బాధలకు తట్టకోలేరు. కోపాన్ని, ఉద్రేకాన్ని, ఆందోళనను, ఒత్తిడిని అణుచుకుని మానసికంగా కుంగిపోతుంటారని వైద్యులు తెలుపుతున్నారు.
అమ్మ, నాన్న కలసి ఉంటేనే కుటుంబం. ఎవరు లేకపోయినా దాని ప్రభావం పిల్లలపై పడుతుంది. ముఖ్యంగా వారు విడిపోతే ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. భార్యభర్తలు విడిపోయి కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో ... లాగా ఉంటే అది పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తల్లి దగ్గర ఉండే పిల్లలు తండ్రిని కలవలేరు. తండ్రి దగ్గర ఉండే పిల్లలు తల్లిని కలవలేరు. ఆ పరిస్థితులలో పిల్లలు తీవ్ర మానసిక వత్తిడికి గురవుతారు. ఏది ఏమైనా ఈ ఆత్మహత్యల గణాంకాలు మగవారు జాగ్రత్తగా ఉండాలని, మానసికంగా దృఢంగా ఉండాలని తెలియజేస్తున్నాయి.