న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ (రియల్టీ) రంగంలో వచ్చే ఆరు నెలల కాలానికి వృద్ధి పట్ల డెవలపర్లు, ఇన్వెస్టర్లు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్లు ఆశావహ అంచనాలతో ఉన్నాయి. అంతర్జాతీయంగా మాంద్యం భయాలు, మోర్ట్‌గేజ్ రేట్లు పెరుగుల ప్రభావం ఉన్నా కానీ, వృద్ధి పట్ల సానుకూల సెంటిమెంట్ నెలకొంది. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్, రియల్ ఎస్టేట్ డెవలపర్ల మండలి నరెడ్కో సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన ‘రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ క్యూ3, 2022’ నివేదికలో వెల్లడించాయి. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో సెంటిమెంట్ స్కోరు 62 ఉంటే, జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఇది 61కి తగ్గింది. ఈ స్కోరు 50కి పైన ఉంటా ఆశావహంగాను, 50 స్థాయిలో ఉంటే తటస్థం, అంతకు దిగువన ఉంటే నిరాశావాదంగా పరిగణిస్తారు. (Elon Musk ట్విటర్ డీల్ డన్: మస్క్ తొలి రియాక్షన్)
స్వల్ప క్షీణత
‘‘అంతర్జాతీయంగా ప్రతికూల వాతావరణం, రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధంతో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో సెంటిమెంట్ స్కోరు అతి స్వల్పంగా తగ్గింది. రియల్ ఎస్టేట్ రంగం, భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడంతో ఈ రంగంలో ఇప్పటికీ సెంటిమెంట్ సానుకూలంగా ఉంది’’అని నైట్ ఫ్రాంక్ తెలిపింది. వచ్చే ఆరు నెలల కాలానికి భాగస్వామల అంచనాల ఆధారంగా నిర్ణయించే భవిష్యత్ సెంటిమెంట్ స్కోరు ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో 62 ఉంటే, సెప్టెంబర్ త్రైమాసికంలో 57కు తగ్గింది. ‘‘ద్రవ్యోల్బణం అధికంగానే ఉంది. దీనికితోడు మానిటరీ పాలసీ చర్యలు కఠినతరం అవుతున్నాయి. దీంతో వచ్చే ఆరు నెలల కాలానికి సంబంధించిన సెంటిమెంట్ స్కోరుపై ప్రభావం పడింది’’అని నైట్ ఫ్రాంక్ వివరించింది. (ఇన్వెస్టర్లకు రాబడులు: ఎల్‌ఐసీకి కేంద్రం సూచనలు)
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న ప్రతికూలతల ప్రభావం మన ఆర్థిక వ్యవస్థపై ఇంకా పూర్తి స్థాయిలో ప్రతిఫలించలేదని రియల్ ఎస్టేట్ భాగస్వాములు భావిస్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది. దీంతో ప్రస్తుత, భవిష్యత్తు అంచనాల విషయంలో కొంత అప్రమత్త ధోరణితో ఉన్నట్టు పేర్కొంది. రెపో రేట్ల పెంపు తర్వాత ఇళ్ల అందుబాటుపైనా ప్రభావం పడినట్టు తెలిపింది. ‘‘రియల్ ఎస్టేట్‌లో ఇళ్ల అమ్మకాలు గత కొన్ని నెలలుగా పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ అనిశ్చితులు, ద్రవ్యోల్బణం నెలకొన్నప్పటికీ ఈ రంగం బలమైన పనితీరు చూపిస్తోంది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కొనుగోలుదారులు రియల్టీలో పెట్టుబడులు కొనసాగిస్తారు’’అని నరెడ్కో ప్రెసిడెంట్ రాజన్ బండేల్కర్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment