న్యూఢిల్లీ: ఉక్రెయిన్–రష్యా సంక్షోభ ప్రభావం భారత ఐటీ కంపెనీలనూ తాకుతోంది. ప్రత్యక్షంగా భారత ఐటీ కంపెనీలపై పడే ప్రభావం కంటే పరోక్ష ప్రభావమే ఎక్కువగా ఉండనుంది. ఐరోపా ప్రాంతంలోని క్లయింట్లు ఐటీపై చేసే వ్యయాలను తగ్గించుకోవడం లేదా వాయిదా వేసుకునే పరిస్థితి నెలకొని ఉన్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే అంతర్జాతీయ కంపెనీలు కొన్ని రష్యా నుంచి తప్పుకోవడం లేదా అక్కడి కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయడాన్ని ప్రస్తావిస్తున్నారు.
యుద్ధం కారణంగా పెరిగిపోయిన ద్రవ్యోల్బణ ప్రభావం కూడా కొత్త కాంట్రాక్టుల చార్జీల్లో జాప్యానికి దారితీస్తుందన్నది అంచనా. ఈ పరిస్థితులతో సాఫ్ట్‌వేర్ ఎగుమతిదారులు సమీప కాలంలో స్తబ్దత చూడొచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది. 227 బిలియన్ డాలర్ల దేశీ ఐటీ ఎగుమతుల్లో రష్యా వాటా 1–2 శాతం మేర ఉంటుంది. ‘‘రష్యా–ఉక్రెయిన్ మధ్య ఘర్షణతో భారత ఐటీ పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటుందని మా అభిప్రాయం. వచ్చే కొన్ని త్రైమాసికాల్లో కాంట్రాక్టులకు సంబంధించి నిర్ణయాల్లో జాప్యానికి.. మొత్తం కాంట్రాక్టుల విలువ నిదానించడానికి దారితీస్తుంది’’అని దోలత్ క్యాపిటల్ పేర్కొంది.
ఐటీపై తగ్గనున్న వ్యయాలు
అంతర్జాతీయంగా ఐటీ సేవల వృద్ధి అంచనాలను 2022 సంవత్సరానికి 10 శాతం నుంచి 7 శాతానికి తగ్గిస్తున్నట్టు కన్సల్టెన్సీ సంస్థ హెచ్‌ఎఫ్‌ఎస్ రీసెర్చ్ ఇటీవలే ప్రకటించింది. ద్రవ్యోల్బణం అధికంగా ఉండడం, భౌగోళిక రాజకీయ సమస్యలతో ఐటీ సేవలపై చేసే ఖర్చు తగ్గుతుందన్నది ఈ సంస్థ అంచనా. మొత్తం కాంట్రాక్టుల విలువ తగ్గొచ్చని పేర్కొంది. నిజానికి కరోనా వచ్చిన తర్వాత నుంచి ఐటీ రంగం కొత్త దశను చూస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ డిజిటైజేషన్ ఊపందుకుంది. దీంతో కంపెనీలు పెద్ద సంఖ్యలో ఆర్డర్లను సంపాదించాయి. 2021లో అంతర్జాతీయంగా 33 బిలియన్ డాలర్ల ఐటీ సేవల ఆర్డర్లలో భారత ఐటీ సంస్థలు 31 శాతం అందుకున్నాయని.. ఈ వాటా ఇంకా పెరగొచ్చని ఐటీ పరిశోధనా సంస్థ ఐఎస్‌జీ అంచనా.
మొదటిసారి వచ్చే ఆర్డర్లపై ప్రభావం ఉండకపోవచ్చని దోలత్ క్యాపిటల్ అంటోంది. అదే సమయంలో ఆదాయం, వ్యయాలపై ఉన్న ప్రభావాన్ని విస్మరించడానికి లేదని, ఐటీ సేవలకు సంబంధించి మరీ ఎక్కువ ఆశావహ అంచనాలు సరికాదని పేర్కొంది. భారత ఐటీ రంగం కరోనా ముందు నాటితో పోలిస్తే వేగంగా రెట్టింపై 227 బిలియన్ డాలర్లకు (రూ.17 లక్షల కోట్లు) చేరుకోవడం గమనార్హం. 2021–22 నాటికి 50 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. యుద్ధం మొదలైన తర్వాత నుంచి అమెరికా, ఐరోపా దేశాలు రష్యాపై ఎన్నో ఆర్థిక ఆంక్షలు విధించడం తెలిసిందే. దీంతో రష్యాతో వ్యాపారం నిర్వహించడం దాదాపు అధిక శాతం అంతర్జాతీయ కంపెనీలకు అసాధ్యమనే చెప్పుకోవాలి. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఇంధన ఎగుమతి దేశమైన రష్యాతో చమురు సరఫరా తెంపుకోవడం కూడా ద్రవ్యోల్బణం, కమోడిటీ ధరలు మరింత పెరగడానికి దారితీయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితులు డిజిటల్, టెక్నాలజీపై చేసే వ్యయాలను తాత్కాలికంగా నిలిపివేయవచ్చన్నది దోలత్ విశ్లేషణగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment