లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు చేరుకున్నారు. అక్కడి కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ ధ్యాన మండపంలో ధ్యానం చేస్తున్నారు. ఈ మెమోరియల్ నిర్మాణంలో అప్పటి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధాన కార్యదర్శి ఏక్‌నాథ్ రనడే పాత్ర ఎంతో ఉంది.
వివేకానంద రాక్ మెమోరియల్‌లో ప్రధాని మోదీ ఉదయాన్నే సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించి, పూజలు చేసిన తరువాత ధ్యానంలో మునిగిపోయారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలలో ప్రధాని మోదీ కాషాయ దుస్తులు ధరించి, సన్యాసిలా ఏకాంతవాసాన్ని కొనసాగిస్తున్నారు.
2019 ఎన్నికల ప్రచారం తర్వాత ప్రధాని కేదార్‌నాథ్‌లో ధ్యానం చేశారు. ఈసారి కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్‌కి వచ్చారు. కాగా స్థానికులు ఇప్పుడు స్వామి వివేకానందతో నరేంద్ర మోదీని పోల్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాని పేరు.. వివేకానందుని చిన్ననాటి పేరు కూడా నరేంద్ర కావడం విశేషం అని ఇక్కడివారు అంటున్నారు. అందుకే నాటి వివేకానందునిలా భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా మార్చాలనే సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని కన్యాకుమారివాసులు చెబుతున్నారు. మోదీ హయాంలో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతున్నదని స్థానిక మహిళలు అంటున్నారు.
కన్యాకుమారిలోని వివేకానంద ఆశ్రమం మీడియా సెల్ కోఆర్డినేటర్ కృష్ణ కుమార్ మాట్లాడుతూ ఈ ఆశ్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జాయింట్ డైరెక్టర్ ఏక్‌నాథ్ రనడే సమాధి ఉందన్నారు. నాటి రోజుల్లో అనేక నిరసనలను ఎదుర్కొంటూ, దేశవ్యాప్తంగా 10 కోట్ల మందికి పైగా ప్రజల నుండి రూపాయి నుండి ఐదు రూపాయల వరకు విరాళాలు తీసుకొని వివేకానంద రాక్ మెమోరియల్ నిర్మించారన్నారు. వివేకానంద ఆశ్రమానికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, అయితే భారతదేశ తత్వాన్ని, ఆధ్యాత్మికతను ప్రపంచవ్యాప్తంగా విస్తరించే పనిని ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment