కూతలా! కోతలా!!
సామాన్యుడికి అందుబాటులో ఉండే ప్రయాణ సాధనం రైలు మాత్రమే! అందుకే.. రైల్వే బడ్జెట్ వస్తోందంటే, కొత్త రైళ్ల కోసం, ఉన్న రైలు మార్గాల పొడిగింపు కోసం, కొత్త మార్గాల మంజూరు కోసం, రైల్వే స్టేషన్లలో సౌకర్యాల కోసం వారు వేయి కళ్లతో ఎదురు చూస్తూ ఉం టారు. కానీ, వారికి ఏటా నిరాశే మిగులుతోంది. రైల్వే మంత్రుల బండ్లు ఇందూరు స్టేషన్‌లో ఆగకుండానే దాటిపోతున్నారుు. దశాబ్దాల కోరికలన్నీ కలలుగానే మిగిలిపోతున్నాయి. ఈసారి సురేష్ ‘ప్రభు’ ఏం చేస్తారో?
రైల్వే బడ్జెట్‌లో వాటాపై ఉత్కంఠ
⇒ గతంలోనూ ఒరిగిందేమీ లేదు
⇒ సురేష్ ‘ప్రభు’ ఈసారి కరుణిస్తారా
⇒ బోధన్-బీదర్ రైల్వే మార్గానికి ‘లైన్’ క్లియర్ అవుతుందా
⇒ పెద్దపల్లి-నిజామాబాద్ రూట్‌కు రైల్వే మంత్రి భరోసా ఇస్తారా
⇒ మన ఎంపీల ప్రతిపాదనలకు మోక్షం కలుగుతుందా!?
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మొన్న త్రివేది, బన్సల్... నిన్న మల్లికార్జున ఖర్గే... తాజాగా సురేష్ ప్రభు... కేంద్ర రైల్వే మంత్రులు ఎవరైనా వారి బడ్జెట్‌లో జిల్లాకు ప్రయోజనం అంతంతే. 2014- 15 లో కొంత మోదం, మరికొంత ఖేదం మిగిల్చిన రైల్వే బడ్జెట్ ఈసారైనా ఆశాజనకంగా ఉంటుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 67 ఏళ్లుగా నానుతున్న పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వేలైన్ ఇంకా 16 కిలోమీటర్లయి పూర్తవుతుంది. దీనికి నిధుల కేటాయింపుపైనే ప్రధానంగా అందరి దృష్టి కేంద్రీకృతమైంది.
2013-14 బడ్జెట్‌లో సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్ మీదుగా బాసర, ముథ్కేడ్, ఆదిలాబాద్ వరకు డబుల్ లైన్ మంజూరు చేసినా అరకొర నిధులే కేటాయించారు. 2014-15 బడ్జెట్‌లో వాటి ఊసే ఎత్తలేదు. నిజామాబాద్-ముంబాయి వరకు వేసిన ఎక్స్‌ప్రె స్ రైళ్లు అంత ఆశాజనకంగా లేకపోగా, ఆర్మూరు-ఆదిలాబాద్ వరకు కొత్త రైల్వేలైన్ ప్రతిపాదనలు ఏమవుతాయో తెలియడం లేదు. రైల్వే మంత్రి సురేష్ ప్రభు గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లోనైనా జిల్లాకు ప్రయోజనం దక్కుతుం దా? అన్న సంశయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
గత బడ్జెట్‌లో జిల్లాకు కొత్త రైళ్లు, నిధులు కేటాయింపులపై రాజకీయ పక్షాలు, ప్రజల నుంచి భిన్నస్వరాలు వినిపించగా, ఆ బడ్జెట్‌లో పేర్కొన్న పలు అంశాలు అమలుకు నోచుకోలేదు. రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ, ఫ్లైఓవర్, పుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, రైల్వే అభివృద్ధిపై బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు. ఎప్పుడో పూర్తి కావాల్సిన మోర్తాడ్-ఇందూరు రైల్వేలైన్ ఇంకా నత్త నడకనే సాగుతోంది. దీనిని పూర్తి చేస్తామని ఇచ్చిన హామీ కూడా అమలు నోచుకోలేదు. ఆర్మూర్- ఆదిలాబాద్ వరకు కొత్త రైల్వేలైన్ పనులు చేపట్టలేదు.
జిల్లా వ్యవసాయక, పారిశ్రామిక, వ్యాపార అభివృద్ధికి ప్రధానమైన ఈ రెండు కొత్త రైల్వేలైన్ల పనులకు ఈసారైనా తు ది రూపు వస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆరేడు దశాబ్దాలుగా కలల ప్రాజెక్టుగా ఉన్న పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వేలైన్ పనుల పూర్తికి సరిగా నిధులు రావడం లేదు. సుమారు 178 కిలోమీటర్ల పొడవున్న ఈ రైలుమార్గం 162 కిలోమీటర్లు పూర్తరుుంది. పెర్కిట్ నుంచి నిజామాబాద్ వరకు ఇంకా 16 కిలోమీటర్ల కు నిధులు ఇవ్వాల్సి ఉంది. గత బడ్జెట్‌లో రూ.76 కోట్లు కేటాయిం చినా 34.98 కోట్లు మాత్రమే విడుదల చేశారు.
ఎంపీల ప్రతిపాదనలు ఫలించేనా!
రైల్వే బడ్జెట్ సందర్భంగా నిజామాబాద్, జహీరాబాద్ ఎంపీలు కల్వకుంట్ల కవిత, బీబీ పాటిల్ చేసిన ప్రతిపాదనలకు ఈసారైనా పూర్తిస్థాయిలో మోక్షం లభిస్తుంమోనని ఇందూరు ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు. గత బడ్జెట్‌లో ఆర్మూర్ ఆదిలాబాద్ వరకు కొత్త రైల్వేలైన్ వేయటానికి గ్రీన్ సిగ్నల్ లభించినప్పటికిఆ బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించలేదు. ఫలితంగా అది ప్రతిపాదనలకే పరిమితమైంది. బోధన్-బీదర్ లైన్, ఆర్మూర్-నిర్మల్ - ఆదిలాబాద్ లైన్లను మరచి పూర్తిగా నిరాశకు గురి చేశారు. సరుకు రవాణా భారం తగ్గించకపోగా మరింత పెంచి, ఆదర్శ స్టేషన్ల అభివృద్ధికి పైసా కూడ విదిల్చలేదు.
కొత్త ప్యాసింజర్ రైళ్ల ప్రతిపాదనలకు మోక్షం కలగలేదు. ఈ నేపథ్యంలో పాత, కొత్త సమస్యలు, ప్రతిపాదనలను కేంద్రం దష్టికి తీసుకెళ్లినట్లు ఎంపీ కవిత ప్రకటించారు. ఈసారి బడ్జెట్‌లో జిల్లాకు అన్యాయం జరగ కుండా ఉండేందుకు ముఖ్యమైన పనులకు సంబంధించిన ప్రతిపాదనలను రెండు నెలల కిందటే సమర్పించామని ఆమె ఇటీవల ‘మీ ట్ దిప్రెస్’లోనూ వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజా బడ్జెట్‌లో జిల్లా సమస్యలు ఏ మేరకు పరిష్కారం అవుతాయి? ఎంపీల ప్రతిపాదనలకు మోక్షం కలుగుతుందా? అన్న చర్చ జరుగుతోంది.