పట్టాలు తప్పిన రైల్ షేర్లు
ఆకట్టుకోని రైల్వే బడ్జెట్ లాభాల్లో లాజిస్టిక్స్ షేర్లు పలు రైల్వే షేర్లకు నష్టాలు
ముంబై: దలాల్ స్ట్రీట్‌లో సురేశ్ ప్రభు ఆధ్వర్యంలోని ట్రైన్ నంబర్ టూజీరోవన్‌సిక్స్(2016) పట్టాలు తప్పింది. రైల్వే షేర్లు లాభాల ప్లాట్‌ఫామ్‌పై ఆగకుండా నష్టాల పట్టాలపై పరుగులు పెట్టాయి. ప్రయాణికుల, సరుకు రవాణా చార్జీల పెంపుకు సురేష్ ప్రభు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోయినప్పటికీ, స్టాక్ మార్కెట్... ప్రభు బడ్జెట్‌కు రెడ్ సిగ్నల్‌నే ఇచ్చింది. రైల్వే బడ్జెట్ నేపథ్యంలో రైల్వే షేర్లు బాగా నష్టపోయాయి. కొన్ని షేర్లు మాత్రం స్వల్పంగా లాభపడ్డాయి. రైల్వే బడ్జెట్‌లో మూలధన కేటాయింపులు ఆశించిన స్థాయిలో లేవని నిపుణులంటున్నారు. రైల్వే బడ్జెట్‌కు ముందు ఒడిదుడుకుల్లో ట్రేడైన రైల్వే షేర్లు..సురేశ్ ప్రభు బడ్జెట్ ప్రసంగం మొదలైన తర్వాత నష్టాల బాటలో సాగాయి. బడ్జెట్ ప్రసంగం పూర్తయిన తర్వాత మరింతగా క్షీణించాయి. రైల్వే మంత్రి తన పరిధి మేరకు మంచి బడ్జెట్‌నే అందించారని డాల్టన్ క్యాపిటల్ అడ్వైజర్స్ ఎండీ యూ. ఆర్. భట్ పేర్కొన్నారు. అయితే వ్యాగన్‌లు తయారు చేసే కంపెనీలకు భారీ ఆర్డర్లేమీ లేవని పెదవి విరిచారు.
ప్రతిపాదనలు-షేర్ల ప్రతిస్పందన
2,000 కిమీ రైల్వే లైన్‌ల విద్యుదీకరించాలని ప్రతిపాదించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ విద్యుదీకరణ బడ్జెట్ 50 శాతం అధికం. అయినప్పటికీ, రైల్వేల విద్యుదీకరణతో సంబంధమున్న షేర్లు మిశ్రమంగా స్పందించాయి. కేఈసీ ఇంటర్నేషనల్ 3 శాతం లాభపడి రూ.106 వద్ద ముగిసింది. సీమెన్స్, ఆల్‌స్టోమ్ టీ అండ్ డీ ఇండియా షేర్లు క్షీణించాయి.
వ్యాగన్‌లు తయారు చేసే కాళింది రైల్, టెక్స్‌మాకో రైల్, టిటాఘర్ వ్యాగన్స్ 8-9శాతం రేంజ్‌లో నష్టపోయాయి.రైల్ సైట్ లాజిస్టిక్ పార్క్‌ల అభివృద్ధి చేస్తారన్న ప్రతిపాదన, రవాణా చార్జీలు పెంచకపోవడం, ప్రతిపాదిత కొత్త రవాణా కారిడార్ల కారణంగా రవాణా వ్యయం తగ్గడం తదితర కారణాల వల్ల లాజిస్టిక్స్ కంపెనీలైన కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, గేట్ వే డిస్ట్రిపార్క్స్, అల్‌కార్గో లాజిస్టిక్స్ గతి, టిమ్‌కెన్‌లు మాత్రం 0.4 శాతం నుంచి 3 శాతం వరకూ పెరిగాయి.
మరింత భద్రత కోసం రైల్వే స్టేషన్లలో సీసీటీవీలను ఏర్పాటు చేస్తారన్న ప్రతిపాదన కారణంగా రైల్వే సంబంధిత టెక్నాలజీ కంపెనీలు మిశ్రమంగా ముగిశాయి. మిక్ ఎలక్ట్రానిక్స్ 0.5 శాతం, జికామ్ ఎలక్ట్రానిక్స్ 6.2 శాతం చొప్పున లాభపడ్డాయి. అయితే ఇదే కేటగిరిలోని స్టోన్ ఇండియా 6 శాతం వరకూ క్షీణించింది.
రైల్వే ఆర్డర్లపై ఆధారపడి కార్యకలాపాలు నిర్వహించే కంపెనీల షేర్లు క్షీణించాయి. టెక్స్‌మాకో రైల్ అండ్ ఇంజినీరింగ్ 8.8 శాతం, కాళింది రైల్ నిర్మాణ్ 9.2 శాతం, టిటాఘర్ వ్యాగన్స్ 8 శాతం, కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్, 4.8 శాతం, హింద్ రెక్టిఫైర్స్ 7.6 శాతం, భెల్ , బీఈఎంఎల్ 4 శాతం, స్టోన్ ఇండియా 6 శాతం చొప్పున నష్టపోయాయి.
వంద స్టేషన్లలో వైఫై సేవలందించనున్న ప్రతిపాదన కారణంగా డి-లింక్ ఇండియా షేర్ ఇంట్రాడేలో 12 శాతం లాభపడి రూ.140ను తాకింది, చివరకు 2 శాతం లాభంతో రూ.126 వద్ద ముగిసింది. స్మార్ట్‌లింక్ నెట్‌వర్క్ సిస్టమ్స్ 20 శాతం అప్పర్ సర్క్యూట్ తో రూ.97 వద్ద ముగిసింది. షేర్ల బై బ్యాక్ చేస్తామని కంపెనీ ప్రకటించడం కూడా ఈ కంపెనీ జోరుకు కలసి వచ్చింది