సాక్షి, హైదరాబాద్: కాపలాలేని లెవల్ క్రాసింగ్‌ల తొలగింపుపై దక్షిణ మధ్య రైల్వే ప్రత్యే క కార్యాచరణకు ఉపక్రమించింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా తాజా రైల్వే బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనలకు అనుగుణంగా పనులను ప్రారంభించింది. గత ఏడాది మెదక్ జిల్లా మాసాయిపేటలో చోటు చేసుకున్న ఘోర దుర్ఘటన అనంతరం చేపట్టిన పనులను ఈ నెలాఖరు నాటికి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవ జోన్‌లోని ఆరు డివిజన్ల రైల్వే మేనేజర్లను, వివిధ విభాగాల ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఈ మేరకు మంగళవారం సికిం ద్రాబాద్ రైల్‌నిలయంలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో భద్రతాపర మైన అంశాలపైనా, బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనలపైనా ఆయన సమీక్ష నిర్వహించారు. జోన్ పరిధిలో మొత్తం 1,154 కాపలాలేని లెవల్ క్రాసింగ్‌లు ఉండగా.. వాటిలో 601 లెవల్ క్రాసింగ్‌ల తొలగింపునకు పనులు చేపట్టారు. మిగిలిన 553 కాపలాలేని లెవల్ క్రాసింగ్‌లను 2017 నాటికి తొలగించే విధం గా కార్యాచరణను సిద్ధం చేశారు. ఈ మేరకు పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు. కాపలాలేని లెవల్ క్రాసింగ్‌లను తొలగించడమే కాక దక్షిణ మధ్య రైల్వేను ప్రమాదరహిత జోన్ స్థాయికి అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
రైలు నడిపే సమయంలో లొకో పెలైట్‌లకు సిగ్నల్‌లు అన్నీ ఒకేవైపు కనిపించేవిధంగా అవకాశం ఉన్న అన్ని చోట్లా చర్యలు తీసుకోవాలి. రైల్వే యార్డుల్లో రైళ్ల రాకపోకలపై అప్రమత్తం గా ఉండాలి. అనూహ్య రీతిలో యాక్సిల్ వేడెక్కి ప్రమాద సంకేతాలు అందితే వెంటనే ఆడియో విజువల్ అలారమ్ ద్వారా స్టేషన్‌మాస్టర్లను అప్రమత్తం చేయాలి. గత ఫిబ్రవరి 18న హైదరాబాద్ - చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమా దాన్ని గమనించి వెంటనే రైలును ఆపి, పైఅధికారులకు సమాచారం అందజేసిన గుంటూరు డివిజన్ సీనియర్ టెక్నీషియన్ జి.వెంకటేశ్వర్లుకు జీఎం నగదు అవార్డును అందజేశారు.