సాక్షి, హైదరాబాద్: యుద్ధప్రాతిపదికన కాపలా లేని లెవల్ క్రాసింగ్స్‌ను గతంలో తొలగించిన రైల్వే శాఖ, ఇప్పుడు కాపలా ఉన్న లెవల్ క్రాసింగ్స్ (మ్యాన్డ్ లెవల్ క్రాసింగ్స్)ను తొలగించే విషయంలో చేతులెత్తేస్తున్నట్టే కనిపిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 80 మ్యాన్డ్‌లెవల్ క్రాసింగ్స్‌ను తొలగించినట్టు అధికారులు ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 80 క్రాసింగ్స్‌ను తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు.
కానీ, ఆర్థిక సంవత్సరం మొదలై రెండున్నర నెలలు గడుస్తున్నా కేవలం ఏడు చోట్ల మాత్రమే పనులు పూర్తయినట్టు తెలిసింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇంకా 1166 మ్యాన్డ్ లెవల్ క్రాసింగ్స్ ఇంకా ఉన్నాయి. ఇవన్నీ తొలగించటం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఫలితంగా ప్రజలే అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా భారీ ప్రమాదాలు తప్పవు.
రైల్వే విన్నపాన్ని పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం
గతంలో చాలా ప్రాంతాల్లో కాపలా లేని లెవల్ క్రాసింగ్స్ ఉండేవి. ఆయా చోట్ల పట్టాలు దాటుతూ పాదచారులు, వాహనదారులు రైలు ప్రమాదాలకు గురై దుర్మరణం పాలయ్యేవారు. వాటిని మోదీ ప్రభుత్వం వచ్చాక యుద్ధప్రాతిపదికన తొలగించారు. ఇప్పుడు కాపలాదారు ఉండే లెవల్ క్రాసింగ్స్ వద్ద రోడ్ అండర్ బ్రిడ్జీ(ఆర్‌యూబీ)లు, రోడ్ ఓవర్ బ్రిడ్జీ(ఆర్‌ఓబీ)లు, తక్కువ ఎత్తున్న అండర్‌పాస్‌లను నిర్మించటం ద్వారా గేట్లు తొలగించాలన్నది లక్ష్యం.
కానీ ఒక్క ఆర్‌యూబీ నిర్మాణానికి రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. అదే ఆర్‌ఓబీలకైతే ఒక్కోదానికి దాని నిడివిని బట్టి రూ.20 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది రైల్వేకు భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దీంతో వాటిని చేపట్టే విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది.
వీలైనన్ని ఆర్‌యూబీలతో సరిపెట్టే ప్రయత్నం చేస్తున్నా.. బడ్జెట్ పెద్ద అడ్డంకిగా మారింది. దీంతో రాష్ట్రప్రభుత్వాలతో సంయుక్తంగా పనులు చేపడుతోంది. కానీ, వీటికి నిధులిచ్చే విషయంలో రాష్ట్రప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపటం లేదు
ప్రజలూ జర భద్రం: దక్షిణ మధ్య రైల్వే
లెవల్ క్రాసింగ్స్ వద్ద అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే తాజాగా విజ్ఞప్తి చేసింది. ‘ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్’ విజ్ఞప్తి మేరకు జూన్ 15ను లెవల్‌క్రాసింగ్స్ అవేర్‌నెస్ డేగా జరుపుతున్నారు.
దీన్ని పరస్కరించుకుని లెవల్ క్రాసింగ్స్ విషయంలో ప్రజలను మరింత చైతన్యవంతును చేసేందుకు నాటికలు లాంటి ప్రదర్శనల ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్టు ప్రకటించింది. రైలు వచ్చేముందు గేటు పడటం, గేటు తెరుచుకునేవరకు ఓపికగా ఎదురుచూడటం, గేటు కింద నుంచి వెళ్లకపోవటం, పట్టాలు దాటేప్పుడు రైలు వస్తుందో లేదో అటూఇటూ చూసి వెళ్లటం లాంటి అంశాలను జనం మదిలో ఉంచుకోవాలని సూచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment