level crossings
-
ఇక ‘లెవల్’ క్లియర్
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారుల తరహాలో క్రాసింగ్స్ లేకుండా రైల్వే లైన్లను నిర్మించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. రైలు మార్గాన్ని రోడ్లు క్రాస్ చేసే ప్రాంతాల్లో, వాటి మీదుగా వెళ్లే వాహనాల రద్దీ ఆధారంగా రోడ్ ఓవర్ బ్రిడ్జీలు, రోడ్ అండర్ బ్రిడ్జీలు, తక్కువ ఎత్తున్న అండర్‌పాస్‌లను నిర్మించనున్నారు. ప్రాజెక్టు ప్రణాళికల సమయంలోనే ఇందుకు ఏర్పాట్లు చేసి అంచనా వ్యయాన్ని నిర్ధారించనున్నారు. ప్రస్తుతం కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారుల్లో ఎక్కడా ఇతర రోడ్లు క్రాస్ చేయకుండా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే తరహాలో రైల్వే లైన్లను కూడా నిర్మించాలని తాజాగా రైల్వే శాఖ నిర్ణయించింది. నిర్ణయించటమే కాకుండా వెంటనే అమలులోకి తెచ్చింది. ఇప్పటికే మొదలైన ప్రాజెక్టుల్లో సైతం: ఈ నిర్ణయం తీసుకునేసరికే మొదలై పనులు జరుగుతున్న ప్రాజెక్టుల విషయంలోనూ దీన్ని అమలు చేయాలని నిర్ణయించటం విశేషం. ప్రస్తుతం రాష్ట్రంలో మనోహరాబాద్–కొత్తపల్లి కొత్త లైన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇది కీలక ప్రాజెక్టు. మేడ్చల్ సమీపంలోని మనోహరాబాద్ స్టేషన్ నుంచి ఈ కొత్త లైన్ మొదలై గజ్వేల్, సిద్దిపేట మీదుగా కొత్తపల్లి (కరీంనగర్ సమీపం) వరకు ఇది కొనసాగుతుంది. ప్రస్తుతం సిద్దిపేట వరకు పనులు పూర్తయ్యాయి. గజ్వేల్ సమీపంలోని కొడకండ్ల–సిద్దిపేట మధ్య ఈనెల 15న రైల్వే సేఫ్టీ కమిషనర్ ఆధ్వర్యంలో ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఇది పూర్తి అయ్యాక వీలైనంత తొందరలో సిద్దిపేట నుంచి రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమవుతోంది. ఈమేరకు అనుమతి ఇవ్వాల్సిందిగా రైల్వే బోర్డుకు లేఖ కూడా రాసింది. ఈ ప్రాజెక్టులో కీలక ప్రాంతాల్లో ఆర్ఓబీలు, ఆర్‌యూబీలు ప్లాన్ చేసినా.. ఇంకా నాలుగు లెవల్ క్రాసింగ్స్ ఉన్నాయి. మనోహరాబాద్–కొత్తపల్లి లైన్‌లోని ఆ నాలుగులెవల్ క్రాసింగ్స్ కూడా తొలగింపు తాజాగా రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం మేరకు, ఆ నాలుగు లెవల్ క్రాసింగ్స్‌ను కూడా తొలగించాలని నిర్ణయించటం విశేషం. గజ్వేల్ దాటిన తర్వాత ఉన్న కొడకండ్ల శివారులోని రామచంద్రాపూర్ రోడ్డు వద్ద లెవల్ క్రాసింగ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు అక్కడ 3.5 మీటర్ల ఎత్తుతో లిమిటెడ్ ఆర్యూబీ నిర్మించాలని నిర్ణయించారు. కుకునూరుపల్లి దాటిన తర్వాత కొండపోచమ్మ దేవాలయానికి వెళ్లే రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన లెవల్ క్రాసింగ్‌ను తొలగించి ఆర్యూబీ నిర్మించనున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొమురవెల్లికి వెళ్లే రెండో కమాన్ రోడ్డు వద్ద ఉన్న లెవల్ క్రాసింగ్‌ను తొలగించి దాదాపు అరకి.మీ. నిడివితో ఏడు మీటర్ల ఎత్తు గల ఆర్ఓబీని నిర్మించాలని నిర్ణయించారు. సిద్దిపేట శివారులోని రంగదామ్‌పల్లి లెవల్ క్రాసింగ్ వద్ద ఆర్యూబీ నిర్మించాలని నిర్ణయించారు. ఇంకా 1,150 లెవల్ క్రాసింగ్స్... దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పాత లైన్ల మీద ఇంకా 1,150 వరకు లెవల్ క్రాసింగ్స్ ఉన్నాయి. కాపలా లేని క్రాసింగ్స్‌ను పూర్తిగా తొలగించినా, కాపలా ఉన్న లెవల్ క్రాసింగ్స్ ఇంకా కొనసాగుతున్నాయి. వాటిని దశల వారీగా తొలగించే పని జరుగుతోంది. కానీ, కొత్తగా చేపట్టిన, చేపట్టబోయే ప్రాజెక్టుల్లో మాత్రం అసలు లెవల్ క్రాసింగ్స్ ఉన్న ఊసే ఉండకపోవటం విశేషం. -
ఇంకా 1166 కాపలా లెవల్ క్రాసింగ్స్!
సాక్షి, హైదరాబాద్: యుద్ధప్రాతిపదికన కాపలా లేని లెవల్ క్రాసింగ్స్‌ను గతంలో తొలగించిన రైల్వే శాఖ, ఇప్పుడు కాపలా ఉన్న లెవల్ క్రాసింగ్స్ (మ్యాన్డ్ లెవల్ క్రాసింగ్స్)ను తొలగించే విషయంలో చేతులెత్తేస్తున్నట్టే కనిపిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 80 మ్యాన్డ్లెవల్ క్రాసింగ్స్‌ను తొలగించినట్టు అధికారులు ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 80 క్రాసింగ్స్‌ను తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. కానీ, ఆర్థిక సంవత్సరం మొదలై రెండున్నర నెలలు గడుస్తున్నా కేవలం ఏడు చోట్ల మాత్రమే పనులు పూర్తయినట్టు తెలిసింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇంకా 1166 మ్యాన్డ్ లెవల్ క్రాసింగ్స్ ఇంకా ఉన్నాయి. ఇవన్నీ తొలగించటం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఫలితంగా ప్రజలే అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా భారీ ప్రమాదాలు తప్పవు. రైల్వే విన్నపాన్ని పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం గతంలో చాలా ప్రాంతాల్లో కాపలా లేని లెవల్ క్రాసింగ్స్ ఉండేవి. ఆయా చోట్ల పట్టాలు దాటుతూ పాదచారులు, వాహనదారులు రైలు ప్రమాదాలకు గురై దుర్మరణం పాలయ్యేవారు. వాటిని మోదీ ప్రభుత్వం వచ్చాక యుద్ధప్రాతిపదికన తొలగించారు. ఇప్పుడు కాపలాదారు ఉండే లెవల్ క్రాసింగ్స్ వద్ద రోడ్ అండర్ బ్రిడ్జీ(ఆర్యూబీ)లు, రోడ్ ఓవర్ బ్రిడ్జీ(ఆర్ఓబీ)లు, తక్కువ ఎత్తున్న అండర్‌పాస్‌లను నిర్మించటం ద్వారా గేట్లు తొలగించాలన్నది లక్ష్యం. కానీ ఒక్క ఆర్యూబీ నిర్మాణానికి రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. అదే ఆర్ఓబీలకైతే ఒక్కోదానికి దాని నిడివిని బట్టి రూ.20 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది రైల్వేకు భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దీంతో వాటిని చేపట్టే విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది. వీలైనన్ని ఆర్‌యూబీలతో సరిపెట్టే ప్రయత్నం చేస్తున్నా.. బడ్జెట్ పెద్ద అడ్డంకిగా మారింది. దీంతో రాష్ట్రప్రభుత్వాలతో సంయుక్తంగా పనులు చేపడుతోంది. కానీ, వీటికి నిధులిచ్చే విషయంలో రాష్ట్రప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపటం లేదు ప్రజలూ జర భద్రం: దక్షిణ మధ్య రైల్వే లెవల్ క్రాసింగ్స్ వద్ద అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే తాజాగా విజ్ఞప్తి చేసింది. ‘ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్’ విజ్ఞప్తి మేరకు జూన్ 15ను లెవల్క్రాసింగ్స్ అవేర్నెస్ డేగా జరుపుతున్నారు. దీన్ని పరస్కరించుకుని లెవల్ క్రాసింగ్స్ విషయంలో ప్రజలను మరింత చైతన్యవంతును చేసేందుకు నాటికలు లాంటి ప్రదర్శనల ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్టు ప్రకటించింది. రైలు వచ్చేముందు గేటు పడటం, గేటు తెరుచుకునేవరకు ఓపికగా ఎదురుచూడటం, గేటు కింద నుంచి వెళ్లకపోవటం, పట్టాలు దాటేప్పుడు రైలు వస్తుందో లేదో అటూఇటూ చూసి వెళ్లటం లాంటి అంశాలను జనం మదిలో ఉంచుకోవాలని సూచిస్తోంది. -
లెవల్ క్రాసింగ్స్ తొలగిస్తాం
సాక్షి, హైదరాబాద్: రైళ్లు ఆటంకం లేకుండా, సురక్షితంగా గమ్యం చేరేలా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో లెవల్ క్రాసింగ్స్‌ను తొలగిస్తున్నామని జోన్ జనరల్ మేనేజర్ (జీఎం) గజానన్ మాల్యా తెలిపారు. ఏడాదిలోగా వందకుపైగా క్రాసింగ్స్‌ను తొలగించి.. ఓవర్, అండర్ బ్రిడ్జీలను నిర్మిస్తామని వెల్లడించారు. మంగళవారం ఆయన రైల్వే డివిజన్ల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రైళ్లు పూర్తిస్థాయిలో నడపనున్నందున ప్రయాణికుల భద్రత కోసం అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణ నుంచి తొలి కిసాన్ రైలు తెలంగాణ నుంచి తొలి కిసాన్ రైలు మంగళవారం 284 టన్నుల ఉల్లిపాయల లోడుతో 12 పార్శిల్ వ్యాన్లతో కాచిగూడ స్టేషన్ నుంచి అగర్తలాకు బయలుదేరింది. రైల్వేకు రూ.18.30లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. -
లెవెల్ క్రాసింగ్‌ల వద్ద వంతెనల నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న 460 రైల్వే లెవెల్ క్రాసింగుల వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ)లను నిర్మించాలని రాష్ట్ర రోడ్లు–భవనాలు, రైల్వే శాఖలు నిర్ణయించాయి. ఈ ఏడాది 52 ఆర్వోబీలను నిర్మించాలని ప్రతిపాదించాయి. వీటికి అయ్యే రూ.2,700 కోట్ల ఖర్చును రెండు శాఖలు చెరి సగం భరించనున్నాయి. బుధవారం ఇక్కడ రోడ్లు, భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు, రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్‌తో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నాలుగు వరుసల రోడ్ల నిర్మాణం ముమ్మరంగా సాగుతున్నందున ఆర్వోబీలు కూడా నాలుగు వరుసలుగా ఉండేవిధంగా చూడాలని మంత్రులు కోరగా రైల్వే జీఎం అంగీకరించారు. గతంలో నాలుగు వరుసల రోడ్లపై రెండు వరుసల ఆర్‌వోబీలనే నిర్మించారు. వంతెనల్లో పట్టాల మీదుగా నిర్మించే భాగాన్ని ఇప్పటిదాకా రైల్వే శాఖ చేపడుతోంది. ఇక్కడ సమన్వయలోపం కారణంగా ఆ పనులు పెండింగ్‌లో ఉండటంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక నుంచి ఆ భాగాన్ని రాష్ట్రప్రభుత్వం చేపట్టాలని నిర్ణయించారు. రైల్వేవాటా నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తే పనులను రాష్ట్ర యంత్రాంగమే చేపడుతుంది. పాత ఆర్వోబీలను తొలగించి కొత్తవాటిని నిర్మించేందుకు రైల్వే జీఎం అంగీకరించారు. మియాపూర్– పటాన్చెరు మధ్య రైల్వే టెర్మినల్ నిర్మించాలని ప్రతిపాదిస్తున్నట్టు తుమ్మల తెలిపారు. మెదక్– అక్కంపల్లి రైల్వేలైన్ నిర్మాణం ఈ సంవత్సరాంతానికి పూర్తి అవుతుందని హరీశ్ ప్రకటించారు. -
2017 నాటికి ‘క్రాసింగ్’ల తొలగింపు
సాక్షి, హైదరాబాద్: కాపలాలేని లెవల్ క్రాసింగ్‌ల తొలగింపుపై దక్షిణ మధ్య రైల్వే ప్రత్యే క కార్యాచరణకు ఉపక్రమించింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా తాజా రైల్వే బడ్జెట్లో చేసిన ప్రతిపాదనలకు అనుగుణంగా పనులను ప్రారంభించింది. గత ఏడాది మెదక్ జిల్లా మాసాయిపేటలో చోటు చేసుకున్న ఘోర దుర్ఘటన అనంతరం చేపట్టిన పనులను ఈ నెలాఖరు నాటికి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవ జోన్‌లోని ఆరు డివిజన్ల రైల్వే మేనేజర్లను, వివిధ విభాగాల ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం సికిం ద్రాబాద్ రైల్‌నిలయంలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో భద్రతాపర మైన అంశాలపైనా, బడ్జెట్లో చేసిన ప్రతిపాదనలపైనా ఆయన సమీక్ష నిర్వహించారు. జోన్ పరిధిలో మొత్తం 1,154 కాపలాలేని లెవల్ క్రాసింగ్‌లు ఉండగా.. వాటిలో 601 లెవల్ క్రాసింగ్‌ల తొలగింపునకు పనులు చేపట్టారు. మిగిలిన 553 కాపలాలేని లెవల్ క్రాసింగ్లను 2017 నాటికి తొలగించే విధం గా కార్యాచరణను సిద్ధం చేశారు. ఈ మేరకు పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు. కాపలాలేని లెవల్ క్రాసింగ్లను తొలగించడమే కాక దక్షిణ మధ్య రైల్వేను ప్రమాదరహిత జోన్ స్థాయికి అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. రైలు నడిపే సమయంలో లొకో పెలైట్లకు సిగ్నల్లు అన్నీ ఒకేవైపు కనిపించేవిధంగా అవకాశం ఉన్న అన్ని చోట్లా చర్యలు తీసుకోవాలి. రైల్వే యార్డుల్లో రైళ్ల రాకపోకలపై అప్రమత్తం గా ఉండాలి. అనూహ్య రీతిలో యాక్సిల్ వేడెక్కి ప్రమాద సంకేతాలు అందితే వెంటనే ఆడియో విజువల్ అలారమ్ ద్వారా స్టేషన్‌మాస్టర్లను అప్రమత్తం చేయాలి. గత ఫిబ్రవరి 18న హైదరాబాద్ - చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమా దాన్ని గమనించి వెంటనే రైలును ఆపి, పైఅధికారులకు సమాచారం అందజేసిన గుంటూరు డివిజన్ సీనియర్ టెక్నీషియన్ జి.వెంకటేశ్వర్లుకు జీఎం నగదు అవార్డును అందజేశారు. -
మృత్యు గేట్లు
ఖమ్మం: రైల్వే క్రాసింగ్ గేట్లు మృత్యు మార్గాలుగా మారుతున్నాయి. జిల్లా రైల్వే జోన్ పరిధిలోని మొత్తం 42 రైల్వే క్రాసింగ్‌లు ఉండగా, అందులో 30 శాతం పైగానే గేట్లు లేవని రైల్వే అధికారులే చెపుతున్నారు. ఈ గేట్ల ఏర్పాటులో రైల్వే శాఖ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వానికి తోడు మానవ తప్పిదాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా రైల్వే క్రాసింగ్‌లు దాటి స్కూళ్లకు వెళ్లే పిల్లలు తిరిగి ఇంటికి వచ్చేంతవరకు ఎప్పుడేం జరుగుతుందోనని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం మెదక్ జిల్లాలో ప్యాసింజర్ రైలు స్కూలు బస్సును ఢీకొని 20 మందికిపైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన నేపథ్యంలో జిల్లాలోని విద్యార్థుల తల్లిదండ్రుల గుండెలు గుభేల్మన్నాయి. జిల్లాలోని మారుమూల ప్రాంతాల మధ్యలో ఉన్న రైల్వే క్రాసింగ్ గేట్లు, వాటి వద్ద రైల్వే ఉద్యోగులు లేకపోవడం, పలుమార్లు ప్రమాదాలు జరిగిన ఘటనలను గుర్తు చేసుకుంటూ వారు ఆందోళన చెందుతున్నారు. జిల్లా రైల్వే అధికారులు పట్టించుకోకపోవడం, పలు చోట్ల అండర్ బ్రిడ్జిల నిర్మాణం కోసం నిధులు మంజూరైనా పనులు ప్రారంభించక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గేట్లు లేని చోట తక్షణమే నిర్మించాలని, కాపలా ఉద్యోగులను నియమించాలని రైలే ్వ అధికారులను కోరుతున్నారు. క్రాసింగ్‌ల వద్ద తరుచూ జరుగుతున్న ప్రమాదాలు... వరంగల్ జిల్లా సరిహద్దులోని గార్ల నుంచి కృష్ణాజిల్లా సరిహద్దు కొండపల్లి వరకు, డోర్నకల్ నుంచి కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు వరకు జిల్లాలో రైల్వే లైన్లు ఉన్నాయి. ఈ లైన్ల మధ్యలో జిల్లా పరిధిలో 42 లెవెల్ క్రాసింగ్‌లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే గార్ల నుంచి కొండపల్లి వరకు ఉన్న బ్రాడ్‌గేజీ లైన్లు జాతీయ రైల్వే లైన్లను కలుపుతూ ఉంటాయి. డోర్నకల్ నుంచి మణుగూరు వరకు ఉన్న లైన్లలో ఒకటి రెండు ప్యాసింజర్ ట్రైన్లతోపాటు, తరచూ బొగ్గును రవాణా చేసే రైళ్లు తిరుగుతుంటాయి. అయితే ఈ రైల్వే క్రాసింగ్‌లో పలుచోట్ల ఉద్యోగులు కాపలా ఉండగా, మరికొన్ని చోట్ల ఎటువంటి ప్రమాద హెచ్చరికలు కానీ, రైళ్లు వచ్చే సమాచారం కానీ ఇచ్చే నాథుడే ఉండడు. గేట్లు ఉన్న ప్రాంతాల్లో కూడా వాటి కింద నుంచి వాహ నాలు తీసుకెళ్లి ప్రమాదానికి గురైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. జిల్లా పరిధిలోకి వచ్చే మోటమర్రి- జగ్గయ్యపేట మధ్యలో ఉన్న క్రాసింగ్ వద్ద గతంలో ట్రాక్టర్‌ను రైలు ఢీకొన్న ఘటనలో పలువురు మృతి చెందారు. గంగినేని - చెరువు మాదారం మధ్యలో జరిగిన ప్రమాదంలో పలుమార్లు గేదెలు, గొర్రెలు చనిపోయాయి. మధిరలో ఉన్న గేట్ పక్కనుంచే వాహనాలు వెళ్లి పలువురు మృతి చెందగా స్పందించిన అధికారులు గేటుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఖమ్మం- కొండపల్లి మధ్యలో ఉన్న లైన్లకు రైల్వే ఆధునీకరణలో భాగంగా గేట్లకు సిగ్నల్‌కు అనుసంధానం చేశారు. దీంతో గేట్లు తీసిఉంటే ప్రమాద హెచ్చరిక వెలగడంతో రైలు డ్రైవర్లు అప్రమత్తం అవుతారు. కానీ డోర్నకల్- మణుగూరు లైన్లలో మాత్రం ఇలాంటి అవకాశం లేదు. దీనికి తోడు ఈ లైన్లలో కొత్తగూడెం పార్కు, భేతంపూడి, తడికలపుడి తండ, కారేపల్లి- ఇల్లెందు మధ్యలో 3 కేకే గేట్, ఇల్లెందు సిటీస్టేషన్ గేట్ల వద్ద లెవెల్ క్రాసింగ్‌లు ఉన్నాయి. వీటితోపాటు గార్ల మండలం పోచారం తదితర మారుమూల గ్రామాలు, తండాల సమీపంలో ఉన్న గేట్ల గురించి రైల్వే అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పలుమార్లు అధికారులకు విన్నవించినా వారు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు చెపుతున్నారు. ఈ గేట్ల నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు పాఠశాల బస్సులు, ఆటోలు, లారీలు తిరుగుతుంటాయి. వాహనాలను గేటు దాటించేటప్పుడు రైలు వస్తుందా లేదా అని చూసుకొని భయంతో వెళ్లాల్సి వస్తోందని డ్రైవర్లు అంటున్నారు. మెదక్ ఘటపై దిగ్భ్రాంతి... మెదక్ జిల్లాలో స్కూల్ బస్సును రైలు ఢీకొన్న ప్రమాదంలో ముక్కుపచ్చలారని పిల్లలు మృతి చెందడంతో జిల్లా ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఉదయం నుంచి మారాం చేస్తే.. అమ్మ లాలించి.. గోరుముద్దలు పెట్టి స్కూల్ బస్సు ఎక్కించి టా.. టా.. చెబుతూ వెళ్లిన పిల్లలు కాసేపట్లో మృత్యువాత పడటం చూసి కన్నీరు పెట్టని హృదయాలు లేవు. రోజువారిగా తమ పిల్లలు కూడా స్కూల్ బస్సు ఎక్కి వెళ్తారు... వారికి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో.. అని ఊహించుకుంటూ ఆందోళన చెందుతున్నారు. రెండేళ్ల క్రితం చండ్రుగొండ సమీపంలో ఉన్న పెదవాగులో పడి 8 మంది చిన్నారులు మృతి చెందిన సంఘటనను గుర్తు చేసుకుంటున్నారు. -
'వారం రోజుల్లో రైల్వేక్రాసింగ్‌ల వద్ద గేట్లు'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల్లోగా కాపలా లేని రైల్వే క్రాసింగ్ వద్ద గేట్లు ఏర్పాటు చేస్తామని దక్షిణ మధ్య రేల్వే జీఎం శ్రీవాత్సవ గురువారం హైదరాబాద్‌లో వెల్లడించారు. అంతకు ముందు మెదక్ జిల్లాలో రైలు ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్... జీ ఎం శ్రీవాత్సవతో మాట్లాడారు. ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రైల్వే క్రాసింగ్ వద్ద గేట్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఈ సందర్బంగా శ్రీవాత్సవకు విజ్ఞప్తి చేశారు. దాంతో వారం రోజుల్లోగా రైల్వే క్రాసింగ్ వద్ద గేట్లు ఏర్పాటు చేస్తామని శ్రీవాత్సవ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు హమీ ఇచ్చారు.