ఖమ్మం: రైల్వే క్రాసింగ్ గేట్లు మృత్యు మార్గాలుగా మారుతున్నాయి. జిల్లా రైల్వే జోన్ పరిధిలోని మొత్తం 42 రైల్వే క్రాసింగ్‌లు ఉండగా, అందులో 30 శాతం పైగానే గేట్లు లేవని రైల్వే అధికారులే చెపుతున్నారు. ఈ గేట్ల ఏర్పాటులో రైల్వే శాఖ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వానికి తోడు మానవ తప్పిదాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా రైల్వే క్రాసింగ్‌లు దాటి స్కూళ్లకు వెళ్లే పిల్లలు తిరిగి ఇంటికి వచ్చేంతవరకు ఎప్పుడేం జరుగుతుందోనని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గురువారం మెదక్ జిల్లాలో ప్యాసింజర్ రైలు స్కూలు బస్సును ఢీకొని 20 మందికిపైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన నేపథ్యంలో జిల్లాలోని విద్యార్థుల తల్లిదండ్రుల గుండెలు గుభేల్‌మన్నాయి. జిల్లాలోని మారుమూల ప్రాంతాల మధ్యలో ఉన్న రైల్వే క్రాసింగ్ గేట్లు, వాటి వద్ద రైల్వే ఉద్యోగులు లేకపోవడం, పలుమార్లు ప్రమాదాలు జరిగిన ఘటనలను గుర్తు చేసుకుంటూ వారు ఆందోళన చెందుతున్నారు.
జిల్లా రైల్వే అధికారులు పట్టించుకోకపోవడం, పలు చోట్ల అండర్ బ్రిడ్జిల నిర్మాణం కోసం నిధులు మంజూరైనా పనులు ప్రారంభించక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గేట్లు లేని చోట తక్షణమే నిర్మించాలని, కాపలా ఉద్యోగులను నియమించాలని రైలే ్వ అధికారులను కోరుతున్నారు.
క్రాసింగ్‌ల వద్ద తరుచూ జరుగుతున్న ప్రమాదాలు...
వరంగల్ జిల్లా సరిహద్దులోని గార్ల నుంచి కృష్ణాజిల్లా సరిహద్దు కొండపల్లి వరకు, డోర్నకల్ నుంచి కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు వరకు జిల్లాలో రైల్వే లైన్లు ఉన్నాయి. ఈ లైన్ల మధ్యలో జిల్లా పరిధిలో 42 లెవెల్ క్రాసింగ్‌లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే గార్ల నుంచి కొండపల్లి వరకు ఉన్న బ్రాడ్‌గేజీ లైన్లు జాతీయ రైల్వే లైన్లను కలుపుతూ ఉంటాయి. డోర్నకల్ నుంచి మణుగూరు వరకు ఉన్న లైన్లలో ఒకటి రెండు ప్యాసింజర్ ట్రైన్లతోపాటు, తరచూ బొగ్గును రవాణా చేసే రైళ్లు తిరుగుతుంటాయి.
అయితే ఈ రైల్వే క్రాసింగ్‌లో పలుచోట్ల ఉద్యోగులు కాపలా ఉండగా, మరికొన్ని చోట్ల ఎటువంటి ప్రమాద హెచ్చరికలు కానీ, రైళ్లు వచ్చే సమాచారం కానీ ఇచ్చే నాథుడే ఉండడు. గేట్లు ఉన్న ప్రాంతాల్లో కూడా వాటి కింద నుంచి వాహ నాలు తీసుకెళ్లి ప్రమాదానికి గురైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. జిల్లా పరిధిలోకి వచ్చే మోటమర్రి- జగ్గయ్యపేట మధ్యలో ఉన్న క్రాసింగ్ వద్ద గతంలో ట్రాక్టర్‌ను రైలు ఢీకొన్న ఘటనలో పలువురు మృతి చెందారు.
గంగినేని - చెరువు మాదారం మధ్యలో జరిగిన ప్రమాదంలో పలుమార్లు గేదెలు, గొర్రెలు చనిపోయాయి. మధిరలో ఉన్న గేట్ పక్కనుంచే వాహనాలు వెళ్లి పలువురు మృతి చెందగా స్పందించిన అధికారులు గేటుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఖమ్మం- కొండపల్లి మధ్యలో ఉన్న లైన్లకు రైల్వే ఆధునీకరణలో భాగంగా గేట్లకు సిగ్నల్‌కు అనుసంధానం చేశారు. దీంతో గేట్లు తీసిఉంటే ప్రమాద హెచ్చరిక వెలగడంతో రైలు డ్రైవర్లు అప్రమత్తం అవుతారు. కానీ డోర్నకల్- మణుగూరు లైన్లలో మాత్రం ఇలాంటి అవకాశం లేదు.
దీనికి తోడు ఈ లైన్లలో కొత్తగూడెం పార్కు, భేతంపూడి, తడికలపుడి తండ, కారేపల్లి- ఇల్లెందు మధ్యలో 3 కేకే గేట్, ఇల్లెందు సిటీస్టేషన్ గేట్‌ల వద్ద లెవెల్ క్రాసింగ్‌లు ఉన్నాయి. వీటితోపాటు గార్ల మండలం పోచారం తదితర మారుమూల గ్రామాలు, తండాల సమీపంలో ఉన్న గేట్ల గురించి రైల్వే అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పలుమార్లు అధికారులకు విన్నవించినా వారు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు చెపుతున్నారు. ఈ గేట్ల నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు పాఠశాల బస్సులు, ఆటోలు, లారీలు తిరుగుతుంటాయి. వాహనాలను గేటు దాటించేటప్పుడు రైలు వస్తుందా లేదా అని చూసుకొని భయంతో వెళ్లాల్సి వస్తోందని డ్రైవర్లు అంటున్నారు.
మెదక్ ఘటపై దిగ్భ్రాంతి...
మెదక్ జిల్లాలో స్కూల్ బస్సును రైలు ఢీకొన్న ప్రమాదంలో ముక్కుపచ్చలారని పిల్లలు మృతి చెందడంతో జిల్లా ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఉదయం నుంచి మారాం చేస్తే.. అమ్మ లాలించి.. గోరుముద్దలు పెట్టి స్కూల్ బస్సు ఎక్కించి టా.. టా.. చెబుతూ వెళ్లిన పిల్లలు కాసేపట్లో మృత్యువాత పడటం చూసి కన్నీరు పెట్టని హృదయాలు లేవు. రోజువారిగా తమ పిల్లలు కూడా స్కూల్ బస్సు ఎక్కి వెళ్తారు... వారికి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో.. అని ఊహించుకుంటూ ఆందోళన చెందుతున్నారు. రెండేళ్ల క్రితం చండ్రుగొండ సమీపంలో ఉన్న పెదవాగులో పడి 8 మంది చిన్నారులు మృతి చెందిన సంఘటనను గుర్తు చేసుకుంటున్నారు.
మృత్యు గేట్లు
Published Fri, Jul 25 2014 2:42 AM | Last Updated on Sat, Sep 2 2017 10:49 AM
Advertisement
Advertisement