జిల్లాలో రైల్వే ప్రగతి ప్రతిపాదనలకే పరిమితమైంది. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న శ్రీకాళహస్తి-నడికుడి రైలుమార్గం కలగానే మిగిలింది.
నెల్లూరు (రవాణా): జిల్లాలో రైల్వే ప్రగతి ప్రతిపాదనలకే పరిమితమైంది. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న శ్రీకాళహస్తి-నడికుడి రైలుమార్గం కలగానే మిగిలింది. కృష్ణపట్నం-ఓబులాపురంల మధ్య రైలు పట్టాలు మధ్యలోనే ఆగిపోయాయి. బిట్రగుంటలో రైలు ఇంజన్లు మరమ్మతుల కర్మాగారం స్థాపన శిలాఫలకానికే పరిమితమైంది.
ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ తర్వాత రైల్వేకు అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టేది నెల్లూరు జిల్లానే. ఏడాదికి రూ.1,500 కోట్లు రాబడి జిల్లానుంచి రైల్వేకు వస్తుంది. ఎన్‌డీఏ ప్రభుత్వం గురువారం ర్వైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. నెల్లూరు వాసి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కేంద్రప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో రైల్వే బడ్జెట్‌పై జిల్లా ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నారు.
శ్రీకాళహస్తి-నడికుడి ప్రతిపాదనలకే పరిమితం
జిల్లాలో ప్రధానంగా మెట్ట ప్రాంతాలను కలుపుతూ శ్రీకాళహస్తి నుంచి గుంటూరు జిల్లా నడికుడి వరకు రైలు మార్గాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనపై 2010-11 బడ్జెట్‌లో మోక్షం లభించింది. శ్రీకాళహస్తి నుంచి రాపూరు, ఆత్మకూరు, వింజమూరు, కనిగిరి తదితర మెట్ట ప్రాంతాల మీదుగా రైల్వేలైను వేయాలని నిర్ణయించారు. 2005లో ఈమార్గానికి ప్రాథమిక సర్వే నిర్వహించారు. శ్రీకాళహస్తి-నడికుడి వరకు రైలుమార్గం వేసేందుకు సుమారు రూ. 1,310 కోట్లుతో అంచనాలు సిద్ధం చేశారు. పీపీపీలో భాగంగా రైల్వేమార్గానికి అయ్యే ఖర్చులో రాష్ట్రం సగం భరించాల్సి ఉంటుంది. అయితే 2012లో కేంద్రం కేవలం రూ. 8లక్షలే కేటాయించారు. కాని అక్కడ నుంచి ఏమాత్రం ప్రగతి లేదు.
గూడూరు-దుగ్గరాజుపట్నం రైల్వేలైన్
జిల్లాలో గూడూరు నుంచి దుగ్గరాజుపట్నం వరకు రైలుమార్గాన్ని వేయాలని ప్రతిపాదనలు చేశారు. ఆమేరకు సర్వే కూడా పూర్తి చేశారు. 2010-11లో రెల్వేలైనుకు అయ్యేఖర్చు రూ. 278 కోట్లు అంచనా వేశారు. దీనికి సంబంధించి 2013లో రైల్వే బడ్జెట్‌లో నామమాత్రంగా రూ. కోటి కేటాయించారు. ఈ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి.
కృష్ణపట్నం-ఓబులాపురం
లైనుకు పూర్తికాని భూసేకరణ
జిల్లాలోని కృష్ణపట్నం నుంచి ప్రధానంగా బొగ్గు, యూరియా, బియ్యం, ఇనుము తదితర సరుకులు ఇతర ప్రాంతాలకు రవాణా అవుతున్నాయి. వీటిని తరలించేం దుకు కృష్ణపట్నం నుంచి కడప జిల్లా ఓబులాపురం వరకు రైల్వేలైను వేయాలని నిర్ణయించారు. ఈమేరకు పూర్తిస్థాయిలో సర్వే చేశారు. నిర్మాణానికి అయ్యే ఖర్చు రూ. 930 కోట్లుగా అంచనా వేశారు. ఇందుకు గాను 2011లో మొదటివిడతగా రూ. 6 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం కృష్ణపట్నం నుంచి వెంకటాచలం వరకు రెండు లైన్లతో కూడిన ట్రాక్‌ను నిర్మించారు. ఈ రైలుమార్గానికి ప్రధానంగా భూసేకరణ అడ్డంకిగా మారింది.
కలగా మారిన రైల్వే
ఇంజన్ల కర్మాగారం
బిట్రగుంటలో రైల్వేకు సంబంధించి దాదాపు 2 వేల ఎకరాల భూమి ఉంది. రైల్వే అభివృద్ధి కోసం 2004లో అప్పటి కేంద్ర రైల్వే మంత్రి లాలూప్రసాద్ యాదవ్ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతంలో రైలు ఇంజన్ల మరమ్మతుల కర్మాగారాన్ని (ఎలక్ట్రికల్ లోకో ఫిరాడికల్ ఓవర్ హోలింగ్) నిర్మించేందుకు శిలాఫలకం వేశారు. గత పదేళ్లుగా రైల్వేబోర్డు పరిశీలనలో ఉన్నప్పటికి ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.
కొత్త రైళ్లు కలేనా ...
తిరుపతి నుంచి షిర్డీకి ఒంగోలు, విజయవాడల మీదుగా రైలును వేయాలని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. అదేవిధంగా కొత్తగా నడపనున్న విజయవాడ-ఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్ రైలును తిరుపతి నుంచి ప్రారంభించి గూడూరు, నెల్లూరుల మీదుగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గంగా కావేరి, కోరమండల్, గరీబ్థ్‌ల్రను నెల్లూరు స్టేషన్‌లో ఆగే విధంగా చూడాలి. రెండేళ్ల క్రితం నెల్లూరు నుంచి సికింద్రాబాద్‌కు ఇంటర్‌సిటీ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. ఇప్పటి వరకు ఆఊసే లేదు. నెల్లూరు నుంచి విజయవాడ, చైన్నైలకు మెమో రైళ్లను నడపాలని నిర్ణయించారు. ప్రస్తుతం అలాంటి ప్రతిపాదనలు కనబడటం లేదు.
ఏ గ్రేడుగా నెల్లూరును చేయాలి
ప్రస్తుతం ఏ1 స్టేషన్‌గా ఉన్న నెల్లూరును ఏ గ్రేడుగా చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. ఆసియాలోనే అతిపెద్ద నౌకాశ్రయం నెల్లూరులోనే ఉంది. ఇక్కడ నుంచి అత్యధికస్థాయిలో ఇతర ప్రాంతాలకు సరుకులు రవాణా అవుతున్నాయి. నెల్లూరును ఏగ్రేడ్ స్టేషన్‌గా మార్చినట్లయితే నగరాలకు ఉండే సౌకర్యాలు జిల్లావాసులకు లభిస్తాయి. అంతేగాకుండా గూడూరు నుంచి సికింద్రాబాద్ వెళ్లే సింహపురి రైలు బయలుదేరే సమయం పొడగించడంతో జిల్లా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇంతకు ముందు గూడూరులో రాత్రి 9 గంటలకు బయలుదేరే రైలు సమయాన్ని ప్రస్తుతం 10.40 మార్చడంతో సికిందరాబాద్‌కు మరుసటి రోజు 11 గంటలకు చేరుతుందని పలువురు చెబుతున్నారు. రైలు సమయం మార్పుపై నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి రైల్వే అధికారులును కలసి వినతిపత్రం సమర్పించారు. గతంలో ఉన్న సమయాన్నే పెట్టాలని విజ్ఞప్తి చేశారు.