రైల్వే బడ్జెట్‌పై తెలుగు ప్రజల్లో నిరసన | Railway budget On Telugu people Protest | Sakshi
Sakshi News home page

రైల్వే బడ్జెట్‌పై తెలుగు ప్రజల్లో నిరసన

Published Fri, Feb 27 2015 12:12 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

రైల్వే బడ్జెట్‌పై తెలుగు ప్రజల్లో నిరసన - Sakshi

రైల్వే బడ్జెట్‌పై తెలుగు ప్రజల్లో నిరసన

ఒక్క ప్రతిపాదన  కూడా పరిశీలించలేదని అసహనం
సాక్షి ముంబై: కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రవేశపెట్టిన 2015-16 రైల్వే బడ్జెట్ మహారాష్ట్రలోని తెలుగు ప్రజలతోపాటు అనేక మందిని నిరాశపరిచింది. ముంబైకి చెందిన ప్రభు రైల్వే శాఖ మంత్రిగా ఉన్నందున ముంబైకి వరాలు ప్రకటిస్తారని ప్రజలు భావించారు. ముంబై నుంచి నిజామాబాద్ మార్గంలో కొత్త రైలు లేదా వారానికి ఒకసారి నడిచే ఎల్‌టిటి-నిజామాబాద్ రైలును ప్రతి రోజు నడిపించడం లాంటి ప్రకటనలు వస్తాయని అనుకున్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్లన్నింటిని ఠాణేలో నిలపాలనే డిమాండ్‌తోపాటు షోలాపూర్-హైదరాబాద్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, పుణే-హైదరాబాద్‌ల మధ్య మరో రైలు నడపాలన్న డిమాండ్లలో ఏదో ఒకటి పూర్తవుతుందని భావించారు. అయితే వీటిలో ఏ ఒక్క డిమాండ్‌ను పరిశీలించలేదు. దీంతో తెలుగు ప్రజల్లో నిరసన వ్యక్తమవుతోంది. అయితే రైళ్ల చార్జీలు పెంచకపోవడంతో కొంత ఊరటలభిందని చెప్పొచ్చు. మరోవైపు 2014-15 బడ్జెట్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ముంబై-కాజిపేట(వరంగల్) వయా బల్లార్షా వారానికి ఒకసారి కొత్త ఎక్స్‌ప్రెస్ రైలును ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనికి ఇంతవరకు మోక్షం లభించలేదు.  
 
రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి రిక్తహస్తాలే..

సాక్షి ముంబై: కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్(2015-16)లో ప్రయాణికులపై ఎలాంటి భారం మోపకపోయినా..మహారాష్ట్ర ప్రజలకు పెద్దగా ఒరిగిందేమీలేదు. కొత్త రైళ్లు, జనాకర్షక పథకాల జోలికి వెళ్లకుండా కేవలం స్వచ్చత, భద్రత, ఆధునీకరణకు పెద్దపీట వేయడం వంటి తదితర అంశాలతోనే ముగించారు. ముఖ్యంగా కొత్త రైలు ఒక్కటీ ప్రకటించకుండానే బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి రైల్వే మంత్రిగా సురేష్ ప్రభు రికార్డు సృష్టించారని చెప్పుకోవచ్చు. మహారాష్ట్రను దృష్టిలో ఉంచుకుని పెద్దగా జనాకర్షక ప్రకటన ఏదీ చేయకపోయినా.. కోంకణ్ రైల్వేలో రాబోయే మూడేళ్లలో 50 వేల ఉద్యోగాల భర్తీ చేస్తామని ఆయన ప్రకటించారు.

ముంబైకి కొంత ఊరట...!

ముంబై-మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన సురేష్ ప్రభు రైల్వే మంత్రిగా ఉండడంతో రాష్ట్రానికి పెద్దపీట వేస్తారని ప్రజలంతా భావించారు. అనుకున్న స్థాయిలో పథకాలు ప్రవేశపెట్టకపోయినా... ముంబై వాసులకు ఎయిర్ కండిషన్ లోకల్ రైలు, ముంబై-ఢిల్లీ మార్గంలో హైస్పీడ్ రైళ్లు, ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు వంటి వాటి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరుగుతోందన్నారు. బుల్లెట్ రైలును ప్రవేశపెట్టేందుకు మాత్రం మరికొంత సమయం పడుతుందని పేర్కొన్నారు.
 
మహిళా భద్రత దృష్టి కోణంతో మహిళ బోగీలతోపాటు ముంబై సబర్బన్ (ఉపనగరం) రైల్వేస్టేషన్లలో సీసీ టీవీలు అమర్చనున్నారు. దీంతోపాటు ఐరోలి-కల్వా ఎలివేటెడ్ మార్గం కోసం రూ. 428 కోట్లను కేటాయించారు. విరార్-డహాను మధ్య మూడో, నాలుగో ట్రాక్‌ల నిర్మాణం కోసం రూ. 3,555 కోట్లు, లోకల్ రైళ్ల బోగీల కోసం రూ. 565 కోట్లను ప్రకటించారు.
 
రైల్వే బడ్జెట్‌పై శివసేన అసంతృప్తి

సాక్షి, ముంబై: కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రకటించిన రైల్వే బడ్జెట్‌పై శివసేనతోపాటు ప్రతిపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ముంబైలోని లోకల్ రైళ్లతోపాటు ఇతర ప్రాంతాల ప్రజలకు కూడా పెద్దగా ఒరిగిందేమిలేదని ఆరోపించింది. రాష్ట్రానికి చెందిన వ్యక్తి రైల్వేశాఖ మంత్రిగా ఉండడంతో అనేక విషయాల్లో మహారాష్ట్రకు పెద్దపీట లభిస్తుందని శివసేన భావించింది. అయితే రాష్ట్రానికి అంతగా ప్రాధాన్యం లభించలేద ని శివసేన పార్లమెంట్ సభ్యులు గజానన్ కీర్తికర్, శివాజీరావ్ ఆడల్‌రావ్‌లు పేర్కొన్నారు.  

నాసిక్-పుణే కొత్త మార్గం సర్వే పనులు పూర్తయ్యాయని, అయితే ఇప్పటివరకు దీనికి సంబంధించిన ప్రక్రియ ముందుకుసాగకపోగా మరోవైపు రతన్ ఇండియా థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు కోసం 30 కిలోమీటర్ల రైలు మార్గాన్ని వేసేందుకు సానూకూలత తెలిపారని శివాజీరావ్ ఆడల్‌రావ్ ఎద్దేవా చేశారు. వర్దా-నాగపూర్‌ల మధ్య మూడవ లైను, కోంకణ్  రైల్వేలో 50వేల ఉద్యోగాల భర్తీచేస్తామన్న హామీలు మినహా పెద్దగా ఏమి జరగలేదని అన్నారు.

రాష్ట్రంలో 359 ప్రాజెక్టులకోసం ఈ సారి రైల్వే బడ్జెట్‌లో రూ. 18 కోట్ల నిధులు కేటాయించడంతోపాటు కల్యాణ్-నగర్ రైల్వే మార్గం, విదర్భలోని కొత్త మార్గాలు, పుణే-నాసిక్ రైల్వే మార్గాలకు మోక్షం లభిస్తుందని భావించారు. కాని సురేష్ ప్రభూ నాగపూర్-వర్దా మార్గం మినహా ఎలాంటి కీలక ప్రకటనలు చేయలేదని శివసేన నాయకులు విమర్శించారు.
 
సామాన్యులకు అనుకూలమైన బడ్జెట్ : ఆఠవలే

ప్రయాణ చార్జీలను పెంచకుండా ప్రకటించిన రైల్వే బడ్జెట్ సామాన్యలకు అనుకూలమైనదిగా ఆర్‌పిఐ అధ్యక్షుడు రామ్‌దాస్ ఆఠవలే అభివర్ణించారు. రాష్ట్రానికి పెద్దగా ఏమి ప్రకటించకపోయినప్పటికీ చార్జీలు పెంచకపోవడం అందరికీ అనుకూలమైన అంశమనిఆయన పేర్కొన్నారు.
 
బీజేపీ గడ్డుకాలం చూపిస్తోంది!: ఎన్సీపీ

- పుణ్యక్షేత్రాలకే ఈ రైల్వేబడ్జెట్ అని విమర్శ
- మంత్రి సొంత ప్రాంతానికీ మొండిచెయ్యి: నవాబ్ మాలిక్

 సాక్షి, ముంబై: త్వరలో మంచి రోజులొస్తాయని ప్రకటించిన బీజేపీ ప్రభుత్వం పేదలకు గడ్డు కాలాన్ని చూపిస్తోందని ఎన్సీపీ ప్రతినిధి నవాబ్ మలిక్ ఆరోపించారు. కేంద్ర మంత్రి గురువారం రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఎన్సీపీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఈ రైల్వే బడ్జెట్  పేదలను నిరాశపరిచే విధంగా ఉందని, తీర్థ యాత్రలకే ప్రాధాన్యం ఇచ్చారని, ఇది పుణ్యక్షేత్రాలకు వెళ్లే వారికే మేలుచేసే విధంగా ఉందని చురకంటించారు.

‘మహారాష్ట్రలో పలు ప్రాజెక్టులు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. కాని ముంబైలో చేపడుతున్న ప్రాజెక్టులు ముంబై రైల్వే వికాస్ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ బ్యాంకు రుణాలు, రాష్ట్ర ప్రభుత్వ సాయంతో జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టులకు రైల్వే బడ్జెట్‌తో ఎలాంటి సంబంధం లేదు. మంత్రి ఇలా పేర్కొనడం ప్రజలను మోసం చేయడమే’ అని ఆరోపించారు. రైల్వే మంత్రి కొంకణ్ ప్రాంతానికి చెందినవారు కావడంతో అక్కడి ప్రజలు గంపెడాశతో ఉన్నారని, వారికి కూడా బడ్జెట్ వల్ల ఒరిగిందేమీ లేదని దుయ్యబట్టారు.

ఈ బడ్జెట్‌లో డిజిటలైజేషన్ మినహా కొత్తదనమేమీ లేదని విమర్శించారు. ఈ సారి ప్రయాణికులకు ఎలాంటి చార్జీలు వడ్డించలేదని బీజేపీ వీపు తట్టుకుంటోందని, ఇందులో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదని మలిక్ అన్నారు. ‘వాస్తవానికి డీ జిల్ ధరలు తగ్గడంతో రైల్వేకు రూ.15వేల కోట్లు ఆదా అయ్యాయి. అందుకు చార్జీలు తగ్గించాలి. కాని యథాతథంగా ఉంచి, ఇప్పుడు ఎలాంటి చార్జీల భారం ప్రజలపై మోపలేదని సొంత డప్పు కొట్టుకుంటున్నారు’ అని ఆయన ధ్వజమెత్తారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement