రైల్వే మంత్రి సురేశ్ ‘ప్రభు’ కరుణపై జిల్లా గంపెడాశలు పెట్టుకుంది. నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్‌లో ‘మోడీ కా గాడీ’ జిల్లాలో ఆగుతుందా? వికారాబాద్, శంషాబాద్, మేడ్చల్ వరకు ఎంఎంటీఎస్ విస్తరణకు అదనంగా నిధులు కేటాయిస్తారో.. లేదో.. మరికొన్ని గంటల్లో తేలనుంది.
⇒ సర్వే పూర్తయినా ‘పట్టా’లెక్కని కృష్ణా- వికారాబాద్ రైల్వే ప్రాజెక్టు
⇒50శాతం వ్యయం భరించేందుకు రాష్ట్ర సర్కారు అంగీకారం
⇒సానుకూలంగా స్పందించని రైల్వే మంత్రిత్వశాఖ
⇒ఆదర్శ స్టేషన్లకు నిధులు విదిల్చేనా.. కొత్త రైళ్లు కూత పెట్టేనా?
⇒నేటి రైల్వే బడ్జెట్‌పై జిల్లా ప్రజల ఆశలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మూడేళ్లక్రితం సర్వే పూర్తి చేసుకున్న కృష్ణా- వికారాబాద్ బ్రాడ్‌గేజ్ రైల్వే లైనుపై జిల్లా ప్రజానీకం ఆశగా ఎదురుచూస్తోంది. 121.70 కిలోమీటర్ల పొడవునా ప్రతిపాదించిన ఈ రైలు మార్గానికి రూ.787.80 కోట్లు అవసరమని తేల్చిన రైల్వే శాఖ.. సరుకు రవాణాకు ఈ లైన్ అంతగా ఉపయోగపడదని, ప్రయాణికుల నిష్పత్తి కూడా అంతంతమాత్రంగానే ఉంటుందని సర్వేలో తేలినందున ప్రాజెక్టు సాధ్యపడదని స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం సగం భరించేందుకు ముందుకొచ్చినా.. ఇప్పటికీ కేంద్రం వైపు నుంచి స్పందనలేకపోవడం గమనార్హం.
ప్రయాణికుల నిష్పత్తి 6.9 శాతమే..
సగటున 14శాతం రేట్ ఆఫ్ రిటర్న్(ఆర్‌ఓఆర్) ఉన్నవాటికే ప్రాధాన్యమిస్తామని, ఈ మార్గంలో కేవలం 6.9 శాతం మాత్రమే వచ్చే వీలుందని రైల్వే ఇంజినీరింగ్ శాఖ తేల్చిం ది. ప్రాంత సామాజిక అవసరాల దృష్ట్యా నిర్మాణ వ్యయం లో సగం వాటాను రాష్ట్ర సర్కారు భరిస్తే పరిశీలిస్తామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే గతప్రభుత్వం భూసేకరణ సహా ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం భరించేందుకు అంగీకరించింది.
ఈ మేరకు భూసేకరణకు రూ.36.83 కోట్లను విడుదల చేయనున్నట్లు ప్రక టించింది. అయినప్పటికీ రైల్వేశాఖ నుంచి సానుకూల స్పందన రాకపోవడం గమనార్హం. ఏడెనిమిదేళ్లలో ఈ ప్రాజెక్టుకు కార్యరూపం ఇస్తామని 2012లో రైల్వేశాఖ స్పష్టం చేయడంతో ఈ ప్రాంత ప్రజలు రైలుబండిపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభు పార్లమెంటులో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో కృష్ణా- వికారాబాద్ రైల్వేలైనుకు పచ్చజెండా ఊపుతారో లేదో వేచి చూడాల్సిందే!
జిల్లాకు రావాల్సిన మరికొన్ని ప్రాజెక్టులు
⇒ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ఎంఎంటీఎస్ రైలును పొడిగిస్తామనే ప్రతిపాదనలకు మోక్షం కలగలేదు. 2006లో మొదలైన ఎంఎంటీఎస్ రెండోదశ విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఫలక్‌నుమా -ఉందానగర్ -శంషాబాద్ (20కి.మీ) వరకు కొత్త లైన్ వేయడమేకాకుండా.. ప్రస్తుత మార్గాన్ని డబ్లింగ్, విద్యుద్దీకరణ చేయాలని నిర్ణయించినప్పటికీ ఎలాంటి పురోగతి లేదు.
⇒శంషాబాద్ విమానాశ్రయం ఎయిర్‌కార్గో హబ్‌గా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేస్తున్నారు. ఈ క్రమంలో సరుకు రవాణాకు అనువుగా రైల్వేలైన్లను విస్తరించాలని భావించినా.. ఇప్పటికీ అతీగతీలేకుండా పోయింది. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా విజయవాడకు ప్రత్యేక రైల్వేలైన్ నిర్మించాలని గతంలో జీఎంఆర్ సంస్థ ప్రతిపాదించిన ఫైలు అటకెక్కింది.
⇒సికింద్రాబాద్- బొల్లారం- మేడ్చల్ (28 కి.మీ), మౌలాలి -ఘట్‌కేసర్ (12.2 కి.మీ.) వరకు పొడిగించాలని ప్రతిపాదించిన ఎంఎంటీఎస్‌కు ఇంకా అవరోధాలు తొలగలేదు.
⇒వికారాబాద్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి(ఎఫ్‌ఓబీ) నిర్మించాలనే ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. రాజ్‌కోట్, గరీబ్థ్రతదితర ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఇక్కడ ఆపాలనే డిమాండ్ ఉంది. ఘట్‌కేసర్‌లో కూడా ఎక్స్‌ప్రెస్ ట్రైన్లకు హాల్టింగ్ ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
⇒ఆదర్శ స్టేషన్ల నిర్మాణంలోనూ రైల్వేశాఖ అంతులేని జాప్యం కనిపిస్తోంది. అరకొర నిధుల కేటాయింపులతో నిర్మాణ పనులను ఏళ్ల తరబడి సాగదీస్తోంది. 2011-12లో ప్రకటించిన పనులు కూడా ఇప్పటివరకు పూర్తికాలేదు. వికారాబాద్, శంకర్‌పల్లి, మల్కాజిగిరి, శేరిలింగంపల్లి ఆదర్శ స్టేషన్లు అధికారుల నిర్లక్ష్యానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇప్పటికీ కొన్నింటికి పునాదిరాయి కూడా పడలేదు.
ఆశలన్నీ ప్రభుపైనే!
Published Thu, Feb 26 2015 2:57 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM
Advertisement