
రాజధాని రైలు’ కూత పెట్టేనా..!
నూతన రైల్వేజోన్ కేంద్ర కార్యాలయం రాజధానికి సమీపంలోని గుంటూరు జిల్లాలోనే ఏర్పాటు చేసేలా బడ్జేట్‌లో
25 రైల్వే బడ్జెట్‌పై డివిజన్ ప్రజల ఆశలు
నడికూడి-శ్రీకాళహస్తికి రెండో విడత నిధుల కోసం ఎదురుచూపులు
నూతన రైళ్ల కోసం, డివిజన్‌లో డబ్లింగ్, విద్యుదీకరణకు నిధులు మంజూరయ్యేనా..!
రాష్ట్రానికి నూతన రాజధాని ఏర్పాటు చేశాక మొదటిసారి కేంద్రప్రభుత్వం రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. డివిజన్‌కు కేటాయించే నిధులు, నూతన రైల్వే లైన్లు, కేటాయించే ట్రైన్ల పైనే రాజధాని ప్రాంత అభివృద్ధి ఆధారపడి ఉంది. విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా నవ్యాంధ్రప్రదేశ్ పరిధి వరకూ ఏర్పాటు చేసే నూతన రైల్వే జోన్‌పై అనిశ్చితి కొనసాగుతోంది.
నగరంపాలెం : నూతన రైల్వేజోన్ కేంద్ర కార్యాలయం రాజధానికి సమీపంలోని గుంటూరు జిల్లాలోనే ఏర్పాటు చేసేలా బడ్జేట్‌లో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రధానమంత్రి ప్రయార్టీ ప్రాజెక్టు కింద డివిజన్‌లో జరగుతున్న భారీ ప్రాజెక్టు నడికుడి - కాళహస్తి నూతన రైల్వే లైన్ పనులు త్వరగా పూర్తి కావాలంటే రెండో దశ పనులకు ఈ బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు జరగాలి.
రీసర్వే జరిగాలి
గుంటూరు- నంద్యాల విద్యుదీకరణ పనులు కొనసాగుతున్నందున డబ్లింగ్పనులకు, నల్లపాడు -బీబీనగర్ డబ్లింగ్, విద్యుదీకరణ పనులకు నిధులు మంజూరు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. మాచర్ల నుంచి మహబూబ్‌నగర్ మీదుగా రాయచూర్ వరకూ నూతన రైల్వే లైన్‌కు గతంలో సర్వే జరిగి ఆగిపోయింది. దీనికి రీసర్వే చేసి పనులు చేపడితే ముంబయికి దగ్గర మార్గంగా మారుతుంది.
అన్ని ప్రాంతాల నుంచి.. : నూతన రాజధాని ప్రాంతానికి రైల్వే కనెక్టవీటి కోసం సత్తెనపల్లి పెదకూరపాడు నుంచి హెరిటేజ్ అమరావతి మీదుగా రాజధాని అమరావతిని కలుపుతూ మంగళగిరికి ఒక మార్గం, కృష్ణా జిల్లాలోని కొండపల్లికి ఒక మార్గం ఏర్పాటు చేస్తే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి నేరుగా రాజధాని ప్రాంతానికి రావడం వీలవుతుంది.
ప్రయాణికుల రద్దీ మేరకు..: రాజధాని ఏర్పాటుతో డివిజన్‌లో గుంటూరుకు ప్రయాణికుల రద్దీ పెగుతుంది. దీంతో డివిజన్ పరిధిలో సర్కులర్ రైళ్లు, ఎక్స్‌ప్రెస్ రైళ్లు పెంచాల్సిన అవసరం ఉంది. విజయవాడ-మంగళగిరి-గుంటూరు - తెనాలికి, వినుకొండ-గుంటూరు-తెనాలికి ఎక్కువ సర్కులర్ రైళ్లు నడపాల్సిన అవసరం ఉంది. దీనికోసం గుంటూరు రేపల్లే వరకూ డబ్లింగ్ విద్యుదీకరణకు నిధులు మంజూరు చేయాల్సి ఉంది. విజయవాడ నుంచి తెనాలి మీదుగా వెళుతున్న నవజీవన్, టాటా తదితర సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను మంగళగిరి మీదుగా న్యూ గుంటూరు స్టేషన్ మీదుగా నడపాలి. గుంటూరు- తిరుపతి, గుంటూరు-చెన్నైకి పగటిపూట ఇంటర్‌సిటి ఎక్స్‌ప్రెస్, గుంటూరు-మైసూరుకు బెంగళూరు మీదుగా ఎక్స్‌ప్రెస్, గుంటూరు- మాచర్ల, వినుకొండ-గుంటూరుకు ఫాస్ట్ ప్యాసింజర్లు, గతంలో తెనాలి- సికింద్రాబాద్‌కు నడిచే నాగార్జున ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. వీటితో పాటు మచిలీపట్నం-యశ్వంతపూర్, కాకినాడ-ముంబయి లోకమాన్యతిలక్, నర్సాపూర్-నాగర్‌సోల్ బై వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రోజూ నడపాలి.
కోట్ పిట్‌లు పెంచాలి : గుంటూరు స్టేషన్ నుంచి నూతన రైళ్లు నడపాలంటే కోచ్ పిట్‌లు కావాల్సి ఉంది. ప్రస్తుతం గుంటూరు స్టేషన్‌లోని రెండు కోచ్ పిట్లలో ఆరు రైళ్ల వరకూ శుభ్రం చేసే అవకాశం ఉంది. వీటి సంఖ్య పెంచి మరిన్ని రైళ్లకు అందుబాటులోకి తేవాల్సి ఉంది. మాచర్ల, రేపల్లే స్టేషన్లను నూతన రైళ్లు నడిపేలా అభివృద్ధి పర్చాల్సి ఉంది. నిధులు భారీగా అవసరం : డివిజన్ ప్రధాన రైల్వేస్టేషన్ అయిన గుంటూరు రైల్వేస్టేషన్‌ను ఎ-గ్రేడ్ నుంచి ఎ-1 గ్రేడ్ స్థాయికి పెంచేందుకు నిధులు మంజూరుచేయాల్సి ఉంది. డివిజన్‌లో ఉద్యోగుల వైద్య సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన రైల్వే హెల్త్ యూనిట్‌ను 25 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయాలి. ఉద్యోగుల క్వార్టర్ల కోసం నిధులు మంజూరుచేయాల్సి ఉంది.
నూతన రైళ్లు నడపాలి : డివిజన్‌లో నూతన రైళ్లు ఎక్కువుగా కేటాయించాలని సౌత్‌సెంట్రల్ రైల్వే మజ్దూరు యూనియన్ గుంటూరు డివిజను సెక్రటరీ హనుమంతరావు కోరారు. గుంటూరు-తిరుపతి, గుంటూరు-చెన్నైకు పగటిపూట ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడపటం వలన నిత్యం 2,000 మంది ప్రయాణించే అవకాశం ఉంటుందని తెలిపారు. గుంటూరు రాజధాని ప్రాంతంగా మారడంతో అద్దెలు పెరిగాయని, ఉద్యోగులు తమ జీతంలో 60 శాతం అద్దెలకే ఖర్చుచేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం గుంటూరులోనే 2000 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా 220 క్వార్టర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు. గత బడ్జెట్‌లో క్వార్టర్ల మెయింటనెన్స్ నిధులు మంజూరు చేయకపోవడంతో 100 క్వార్టర్ల వరకూ శిథిలావస్థకు చేరుకున్నట్లు తెలిపారు.