రైల్వే బడ్జెట్‌లో ఉమ్మడి నల్లగొండ జిల్లాపై కేంద్రం శీతకన్ను వహించింది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న సికింద్రాబాద్ – కాజీపేట మార్గంలో మూడో లేన్ ఊసే లేకపోగా.. బీబీనగర్–నడికుడి డబ్లింగ్ పనులకు మోక్షం కలగలేదు. ఇక సూర్యాపేటకు రైలు మార్గానికి సంబంధించిన ప్రతిపాదనలు ఈసారీ పట్టాలెక్కలేదు. రైల్వే శాఖకు అత్యధిక ఆదాయం సమకూర్చుతున్న విష్ణుపురం మార్గంపైనా జాలి చూపలేదు. రైల్వే ప్రాజెక్టులకు మోక్షం లభిస్తుందని ఎంతో ఆశతో ఎదురుచూసిన ఉమ్మడి జిల్లా వాసులకు నిరాశే మిగిలింది.
సాక్షి, యాదాద్రి : ఉమ్మడి నల్లగొండ జిల్లాకు 2018–19 బడ్జెట్‌లో రైల్వే ప్రాజెక్టులకు న్యాయం జరుగలేదు. ఎన్నికల బడ్జెట్‌లో జిల్లాకు సంబంధించిన రైల్వే ప్రాజెక్టులకు మోక్షం కలుగుతుందని.. ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. ప్రస్తుత కేటాయింపులపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పొడిగింపు, బీబీనగర్ నడికుడి డబ్లింగ్ పనులకు మోక్షం లభించలేదు. సూర్యాపేట ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్న ఎక్స్‌ప్రెస్ హైవే రైలు మార్గ ప్రతిపాదనలు ఈ సారి కూడా పట్టాలెక్కలేదు. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ లైను పొడిగింపునకు అరకొర నిధులు కేటాయించారు. మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్టు సిస్టం (ఎంఎంటీఎస్) రైలు వస్తుందని భావించిన వారికి మరో ఏడాది పైగా నిరీక్షించకతప్పని పరిస్థితి. ఎంఎంటీఎస్ ఫేజ్–2కు మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.330కోట్లుకాగా.. రూ.21.25కోట్లు మంజూరు చేశారు. సికింద్రాబాద్ –కాజీపేట మార్గంలో మూడో లైన్ ఊసే లేకుండా పోయింది. ఈ ప్రాజెక్టు కోసం దశాబ్ధాలుగా ఎదురుచూపులు తప్పడం లేదు. గతంలో సర్వే చేసిన అధికారులు ఇప్పుడు దాన్ని మరిచిపోయారు.
దక్షిణమధ్య రైల్వే గుంటూరు డివిజన్‌లో గల బీబీనగర్– నడికుడి (252 కిలో మీటర్లు) డబ్లింగ్ పనులకు ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారని ఎంతో ఆశగా చూశారు. ఈ మార్గానికి నిధులు కేటాయింపే జరగలేదు. పగిడిపల్లి నుంచి నల్లగొండ, మిర్యాలగూడ మీదుగా నడికుడి జంక్షన్ వరకు రైలు మార్గాన్ని డబ్లింగ్ చేయాలనేది ఈ ప్రాంత ప్రజల డిమాండ్ ఉంది. దక్షిణ, తూర్పు రైల్వే ప్రాంత ప్రజలకు ఈ మార్గం ద్వారా రైలు ప్రయాణం సాగుతోంది. క్రాసింగ్‌లతో ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లను సైతం ఆపక తప్పడం లేదు. గంటల తరబడి క్రాసింగ్‌లతో ప్రయాణకాలం పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ పాటు ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమబంగా, కర్ణాటక రాష్ట్రాలతో అనుసంధానం గల ఈ మార్గంపై నిర్లక్ష్యం కొనసాగడం ప్రయాణికులను వేదనకు గురిచేస్తోంది. పగిడిపల్లి నుంచి నల్లపాడు వరకు విద్యుద్దీకరణ పనులకు రూ.291.75కోట్లు మంజూరు చేశారు. ఇందులో మొదటి విడుతగా నల్లపాడు నుంచి రెడ్డిగూడెం వరకు రైల్వే లైన్ విద్యుదీకరణ ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేస్తారు. రెడ్డిగూడెం నుంచి పగిడిపల్లి వరకు వచ్చే ఆర్థిక సంవత్సరం 2018–19లో పూర్తి చేస్తారు.
సూర్యాపేట రైలు మార్గం ఎక్కడ..?
హైదరాబాద్– అమరావతి ఎక్స్‌ప్రెస్ రైల్వే కోసం జిల్లాలోని సూర్యాపేట, కోదాడ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఈ బడ్జెట్‌లో దాని పేరెత్తలేదు. ప్రస్తుతం ఉన్న జాతీయరహదారి 65కు అనుబంధంగా అమరావతి వరకు నూతన రైలు మార్గాన్ని ప్రతిపాదించారు. దీంతోపాటు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నుంచి మిర్యాలగూడ వరకు (వయా సూర్యాపేట) మార్గానికి 2013–14లో కొత్త లైన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీనికి బడ్జెట్‌లో ఏ మాత్రం ప్రాధాన్యతను ఇవ్వలేదు. గుంటూరు రైల్వే డివిజన్‌లో రైల్వే శాఖకు అత్యధిక ఆదాయం వస్తున్న విష్ణుపురం మార్గంపైనా కేంద్రం జాలి చూపలేదు. మఠంపల్లి నుంచి జాన్‌పహాడ్ వరకు ఉన్న 18 కిలోమీటర్లు మార్గాన్ని పూర్తి చేస్తే జగ్గయ్యపేట నుంచి విష్ణుపురం రైలు మార్గం ప్రజలకు అందుబాటులోకి వస్తుంది.
యాదగిరిగుట్ట వరకు పొడిగిస్తే బాగుండేది.
రైల్వే బడ్జెట్‌లో భువనగిరి ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరిగింది. ఘట్‌కేసర్ – యాదాద్రి (రాయగిరి) వరకు ఎంఎంటీఎస్–2కు రూ.21.25కోట్లు కేటాయించడం బాధాకరం. ఈ ప్రాంతానికి ఎంఎంటీఎస్ తీసుకువచ్చే ప్రయత్నంలో పూర్తిస్థాయి బడ్జెట్ కేటాయిస్తే బాగుండేది. ఘట్‌కేసర్ నుంచి రాయగిరి వరకు కాకుండా 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాదగిరిగుట్ట పట్టణం వరకు పొడగిస్తే ప్రయాణికులు సంతోషించే వారు. ఎంఎంటీఎస్–2ను ఘట్‌కేసర్ నుంచి యాదగిరిగుట్ట వరకు పొడగించి, మరిన్ని నిధులు కేటాయించి పూర్తి చేయాలి. – ఎండీ అతీఫ్, యాదగిరిగుట్ట
రాష్ట్రానికి మొండిచేయి..
కేంద్ర ప్రభుత్వం ఈసారి రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి మెండి చేయి చూపారు. రూ.1,813 కోట్ల నిధులు కేటాయించడం దారనుణం. పాత ప్రాజెక్టుల పనులకు మాత్రమే నిధులు కేటాయించారు. కొత్త ప్రాజెక్టులకు కేటాయించలేదు. నామమాత్రం నిధుల కేటాయింపు వల్ల పనుల్లో జాప్యం జరగవచ్చు. – బాలచందర్, మాజీ వైస్ ఎంపీపీ, బీబీనగర్
Comments
Please login to add a commentAdd a comment