రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారీ ఆశగా ఎదురుచూడటం, ఆనక నిరాశకు గురికావడం జిల్లావాసులకు పరిపాటైపోయింది. దాదాపు మూడు దశాబ్దాలుగా ఇదే జరుగుతోంది. ఎన్డీఏ ప్రభుత్వం గురువారం రైల్వే బడ్జెట్ ప్రవేశపెడుతోంది. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో దాని మిత్రపక్షం తెలుగుదేశం అధికారంలో ఉన్నాయి. ఈ తరుణంలో ప్రవేశపెడుతున్న రైల్వే బడ్జెట్ జిల్లావాసుల ఆశలనుచిగురింపజేస్తోంది.
నేడు రైల్వే బడ్జెట్
సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాకు సంబంధించి ప్రధానంగా రెండు కీలక ప్రాజెక్టులు దశాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. కాకినాడను మెయిన్ లైన్‌తో అనుసంధానం చేసేందుకు కాకినాడ నుంచి పిఠాపురానికి 21 కిలోమీటర్ల బ్రాడ్‌గేజ్ లైన్ నిర్మించాలని నాలుగు దశాబ్దాల క్రితమే ప్రతిపాదించారు. సుమారు రూ.120 కోట్ల ఈ ప్రాజెక్టు పాలకుల్లో చిత్తశుద్ధి లేక ఎప్పటికప్పుడు అటకెక్కుతూ వస్తోంది.
2012 రైల్వే బడ్జెట్‌లో రూ.12 కోట్లు, 2013లో రూ.5 కోట్లు, 2014లో రూ.కోటి కేటాయించారు. ఇటీవల పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై రైల్వే ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు హైదరాబాద్‌లో జరిపిన సమీక్ష అనంతరం జిల్లావాసుల్లో ఆశలు చిగురించాయి. సమీక్షలో జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల పట్ల రైల్వేశాఖ ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించారన్న కబురు కార్యరూపంలో కనిపిస్తుందో, లేదో బడ్జెట్‌లో కేటాయింపులను బట్టి తేలిపోనుంది.
కృష్ణాజీ కృషి ఫలిస్తుందా?
రైల్వే ప్రాజెక్టులు సాధిస్తామంటూ ఎన్నికల్లో లబ్ధి పొందడం, ఆనక మరిచిపోవడం జిల్లాలో ఎంపీలకు పరిపాటిగా మారింది. ‘ఇదివరకు ఎంపీలుగా ఉన్న వారు చేసింది లేదు. ఇప్పుడు టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ తోట నరసింహం కాకినాడ మెయిన్ లైన్ కోసం చిత్తశుద్ధితో కృషి జరిపి ఉంటే బడ్జెట్‌లో తగిన నిధులు వస్తాయి’ అని జిల్లావాసులు ఎదురుచూస్తున్నారు. ఈ లైన్ కోసం మూడుదశాబ్దాలు ఆందోళనలు చేసి, ఆశయం నెరవేరకుండానే కన్నుమూసిన ప్రయాణికుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్.కృష్ణాజీ కృషి ఈ బడ్జెట్‌లోనైనా ఫలిస్తుందో, లేదో తేలిపోనుంది.
దశాబ్దిన్నర నాటి పునాదిరాయికి కదలిక వచ్చేనా?
ఇక కోనసీమవాసులు తమకు ఈ సారైనా రైలు కూత వినిపిస్తారా అని ఎదురుచూస్తున్నారు. లోక్‌సభ దివంగత స్పీకర్ జి.ఎం.సి.బాలయోగి కృషితో 2000 నవంబరు 16న కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైన్ నిర్మాణానికి అమలాపురంలో పునాదిరాయి పడింది. అప్పటి రైల్వేమంత్రి మమతాబెనర్జీ, అప్పటి సీఎం చంద్రబాబు కూడా నాటి భూమిపూజ కార్యక్రమంలో పాల్గొని ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రకటించారు. బాలయోగి ఆకస్మిక మరణం తరువాత కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైను వైపు కన్నెత్తి చూసే నాథుడే లేకుండా పోయాడు.
కోటిపల్లి నుంచి కోనసీమ మీదుగా నర్సాపురానికి రైల్వే లైను నిర్మించాలంటే మూడు గోదావరి నదీ పాయలపై బ్రిడ్జిలను నిర్మించాలి. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.329 కోట్లు. మూడు వంతెనల నిర్మాణానికి కేటాయించింది రూ.170 కోట్లు. 55 కిలోమీటర్ల రైల్వే లైను నిర్మాణంలో వంతెనలే కీలకం. వశిష్ట గోదావరిపై సఖినేటిపల్లి- నర్సాపురం మధ్య 1.02 కిలోమీటర మేర రోడ్ కం రైలు వంతెన, వైనతేయ నదిపై బోడసకుర్రు-పాశర్లపూడి మధ్య 1.11 కిలోమీటర్ల మేర రైల్వే వంతెన, గౌతమీ నదీపాయపై కోటిపల్లి- ముక్తేశ్వరం మధ్య 1.42 కిలోమీటర్ల మేర రోడ్ కం రైలు వంతెన ప్రతిపాదించారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం 2013 నాటికి రూ.వెయ్యి కోట్లు దాటిపోయింది.
ఈ వెయ్యి కోట్ల పైబడి అంచనా బడ్జెట్‌లో 25 శాతం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చినా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎంపీల్లో చిత్తశుద్ధి లేక ముందడుగు పడలేదు. రైల్వేలైను లక్ష్యంతో కోనసీమ రైల్వే సాధనసమితి ఏర్పాటైంది. అప్పటి నుంచి ఈ సమితి లైను నిర్మాణం, నిధుల కోసం శక్తి మేరకు ఆందోళనలు చేస్తోంది. అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ పదవీ కాలమంతటా దీనిని సాధిస్తానని ఆర్భాటంగా చెప్పుకుంటూ వచ్చారు. పదవీ కాలం ముగిసినా ప్రాజెక్టుకు ఆశించిన బడ్జెట్ సాధించలేకపోయారు. ప్రస్తుత ఎంపీ పండుల రవీంద్రబాబు కూడా ఎన్నికల్లో ఈ ప్రాజెక్టు పేరు చెప్పి ఓట్లు పొందారు. ఆయనైనా ఈ రైల్వేబడ్జెట్‌లో ఎంతోకొంత ముందడుగు వేయించాలని ప్రజలు ఆశపడుతున్నారు.
నిధులివ్వకుంటే ఉద్యమం ఉధృతం..
కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైను కోసం గత 10 ఏళ్లుగా శాంతియుతంగా ఉద్యమిస్తున్నాం. అయినా ఇప్పటి వరకు కొంచెమైనా కద లిక లేదు. టీడీపీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో హామీలు గుప్పించారు. రేపటి రైల్వే బడ్జెట్‌లో ఈ లైనుకు తగిన నిధులు కేటాయిస్తేనే ఆ హామీలకు విలువ ఉంటుంది. ఎప్పటిలాగే నిధుల విషయంలో మొండిచేయి చూపిస్తే ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.
- డాక్టర్ ఇ.ఆర్.సుబ్రహ్మణ్యం, కోనసీమ రైల్వేలైను సాధన సమితి కన్వీనర్
కనీసం రూ.100 కోట్లు కేటాయించాలి..
కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైనుకు భారీగా నిధులు పట్టుకొస్తానని అమలాపురం ఎంపీ రవీంద్రబాబు హామీలు గుప్పించారు. ఈ బడ్జెట్‌లో కనీసం రూ.100 కోట్లు కేటాయిస్తే పనులు ప్రాథమికంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఏమైనప్పటికీ నిధుల కేటాయింపులో ఈసారి కూడా అన్యాయం జరిగితే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మా పోరాటం తీవ్రంగా ఉంటుంది.
- కల్వకొలను తాతాజీ, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, అమలాపురం
కాకినాడ నుంచి కొత్త రైళ్లు వేయాలి..
కాకినాడ- ఢిల్లీ, కాకినాడ-కోల్‌కతా, కాకినాడ-బికనీర్, కాకినాడ-వారణాసిలకు కొత్తరైళ్లు వేయాలని గతం నుంచీ కోరుతున్నాం. కోటిపల్లి నుంచి రాయఘడ్‌కు ఒక పాసింజర్ రైలును, కాకినాడ నుంచి పలాసకు ఇంటర్‌సిటీ రైలును ప్రవేశపెడితే బాగుంటుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటుపై కూడా ఆశలు ఉన్నాయి.
- వై.డి.రామారావు,జెడ్‌ఆర్‌యూసీసీ సభ్యుడు
ఈ సారైనా ఈ సార్లైనా సాధిస్తారా!
Published Thu, Feb 26 2015 1:51 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 PM
Advertisement
Advertisement