ప్చ్!
సిటీజనుల పెదవి విరుపు
‘వరల్డ్ క్లాస్’... నో జోష్ కానరాని కొత్త రైళ్లు
స్టేషన్ల అభివృద్ధి... విస్తరణ ఊసే లేదు రైల్వే బడ్జెట్‌లో రాజధానికి నిరాశ
ఎంఎంటీఎస్ ప్రాజెక్ట్ అంచనా రూ.850 కోట్లు కేంద్రం విదిల్చింది రూ.8 కోట్లు
ఆశల రైలు రాజధానికి రాలేదు. ప్రయాణికుల ఆకాంక్షలు నెరవేరలేదు. అభివృద్ధి మంత్రం వినిపించలేదు. జంట నగరాల నుంచి ఒక్క రైలూ అదనంగా కదల్లేదు. ఇతర ముఖ్య ప్రాంతాల నుంచి ఇక్కడికి కొత్త ైరెళ్లు రాలేదు. ‘వరల్డ్ క్లాస్’ యోచన ఏమైందో తెలియలేదు. ఎంఎంటీఎస్ ప్రాజెక్ట్‌పై భారీ ఆశలు పెట్టుకుంటే... సాధారణ రహదారికి కేటాయించాల్సిన స్థాయిలోనైనా నిధులు విదల్చలేదు.
ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.850 కోట్లు... బడ్జెట్‌లో కేటాయించింది కేవలం రూ.8 కోట్లే. ‘మెట్రో’ వేగంతో నగరం పరుగులు పెట్టాలనుకుంటుంటే... బడ్జెట్ రైలు బహు దూరంలో ఆగిపోయింది.
సిటీబ్యూరో: గ్రేటర్ సిటీజనులను ఊరించి ఉసూరుమనిపించిన రైల్వే బడ్జెట్‌పై నగర వాసుల్లో మిశ్రమ స్పందన కనిపించింది. కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు సమర్పించిన తాజా రైల్వే బడ్జెట్‌పై గురువారం ‘సాక్షి’ బృందం గ్రేటర్ పరిధిలో సర్వే నిర్వహించింది. నగర నలుమూలల్లో విభిన్న రంగాలకు చెందిన 300 మంది అభిప్రాయాలను సేకరించింది. ఈ సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడ య్యాయి.రైల్వే స్టేషన్లలో ఉచిత వై-ఫై సేవలు అందుబాటులోకి రావడంపై పలువురు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. తమ భద్రతకు 182 టోల్ ఫ్రీనెంబరు ఏర్పాటు చేయడంపై మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. ఎంఎంటీఎస్ రెండోదశకు మొక్కుబడిగా రూ.8 కోట్లు కేటాయించడం, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ ఊసెత్తకపోవడంపై గ్రేటర్ వాసులు పెదవి విరిచారు.