బడ్జెట్ బండి...ఆగేనా?
- నేడే కొత్త రైల్వే బడ్జెట్
- అటకెక్కిన వరల్డ్‌క్లాస్
- కొరవడిన సదుపాయాలు
- విస్తరణకు నోచని టెర్మినళ్లు
- లింకు సర్వీసుల్లేని ఎంఎంటీఎస్
మోడీ బడ్జెట్ రైలు మరి కొన్ని గంటల్లో పట్టాల పైకి చేరుకోనుంది.ఈ రైలులో సౌకర్యాల మూటలుంటాయో... అసౌకర్యాల ముళ్లుంటాయో... నగర ప్రయాణికులను కేంద్రం కరుణిస్తుందో... గాలికి వదిలేస్తుందో... రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులను మన్నిస్తుందో...మరచిపోతుందో కాసేపట్లో తేలిపోతుంది.
సాక్షి, సిటీబ్యూరో: ప్రజలు ఎన్నో ఆశలతో ప్రధానిగా మోడీని గద్దెనెక్కిస్తే... నెల తిరక్కుండానే చార్జీల భారాన్ని మోపి ప్రయాణికుల నుంచి విమర్శలను మూటగట్టుకున్నారు. ఇప్పుడు అసలు సిసలైన... మోడీ ప్రభుత్వ ప్రతిష్ఠకు తార్కాణంగా నిలిచే రైల్వే బడ్జెట్ వస్తోంది. దీని కోసం నగర ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో రైల్వే వ్యవస్థ పనితీరు...చేపడుతున్న
ప్రాజెక్టులు... అభివృద్ధి చర్యలు, సమస్యలను ఒకసారి పరిశీలిస్తే...
ఎప్పటికి పూర్తయ్యేనో?
ఎనిమిదేళ్ల క్రితం ప్రతిపాదించి, చివరకు రెండేళ్ల క్రితం బడ్జెట్‌లో చోటు దక్కించుకున్న ఎంఎంటీఎస్ రెండో దశ పనులు అనేక ఆటంకాలను అధిగమించి ఇప్పుడిప్పుడే ముందుకు కదులుతున్నాయి. రెండో దశ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చేందుకు ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు.
విస్తరణ అంతేనా?
నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్‌లపై ఒత్తిడిని తొలగించేందుకు మల్కాజిగిరి, మౌలాలీ స్టేషన్‌లను విస్తరించాలనే ప్రతిపాదనలు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. ప్రయాణికుల డిమాండ్‌కు తగిన విధంగా రైళ్లు పెరగడం లేదు. కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు రాజధాని హైదరాబాద్‌తో అనుసంధానం చేసే దిశగా ఇంతవరకూ అడుగులు పడలేదు. ఈ దశలో కొత్త సర్కారు తెలంగాణపై ఎలాంటి వరాలు కురిపిస్తుందో చూడాలి.
కొండెక్కిన వరల్డ్ క్లాస్
సుమారు రూ.5000 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను పూర్తిగా ఆధునికీకరించాలని, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని 2008లో అప్పటి ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇప్పటి వరకు అది అధ్యయనానికే పరిమితమైంది. దీనిని వరల్‌క్లాస్ స్టేషన్‌గా అభివృద్ధి చేయడం వల్ల స్టేషన్‌కు వచ్చే రైళ్లకు, ఇక్కడి నుంచి వెళ్లే రైళ్లకు ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌లు ఉంటాయి. ఎంఎంటీఎస్ వంటి లోకల్ సర్వీసులకు ప్రత్యేక లైన్‌లు, ప్లాట్‌ఫామ్‌లు ఉంటాయి. స్టేషన్‌లో రైళ్ల రద్దీ తగ్గుతుంది. ప్రయాణికులకు అవసరమైన షాపింగ్‌మాల్స్, కమర్షియల్ భవనాలు నిర్మించవచ్చు. కానీ ఆచరణ వైపు చక్రాలు కదల్లేదు. తెలంగాణ సర్కారు ఈ దిశగా చేసిన కృషి ఏంటో బడ్జెట్ పట్టాలపైకి ఎక్కితే తెలుస్తుంది.
పేరుకేఏ-1 స్టేషన్
నగరంలోని కాచిగూడను ఏ-1 స్టేషన్‌గా ప్రకటించారు. కానీ సదుపాయాలు ఆ స్థాయిలో లేవు. ఇక్కడినుంచి నిత్యం 50 వేల మంది వివిధ ప్రాంతాలకు వెళ్తారు. నిజాం కాలానికి చెందిన ఈ స్టేషన్‌లో కనీస సదుపాయాలు లేవు. ఇటీవల కొత్తగా నిర్మించిన ప్లాట్‌ఫామ్‌ల పైన మంచినీళ్లు, టాయిలెట్‌లు, కేటరింగ్ వంటి సదుపాయాలు లేవు.
విస్తరణ లేని నాంపల్లి...
నిజాం కాలంలో జరిగిన అభివృద్ధి మినహా నాంపల్లి స్టేషన్‌లో ఎలాంటి పురోగతి లేదు. చెన్నై తరహాలో ప్లాట్‌ఫారాలను విస్తరించాలనే ప్రతిపాదన అటకెక్కింది. ఎస్కలేటర్లు మంజూరైనా స్థలాభావం సాకు చూపి ఇక్కడి నుంచి తరలించారు. రైల్వే హెల్త్ యూనిట్‌లో సేవలను విస్తరించకపోవడంతో ప్రమాదాలకు గురైన కార్మికులను సికింద్రాబాద్ లా లాగూడ ఆస్పత్రికి తరలించాల్సి వస్తోంది. ఇటీవల గుండెపోటుకు గురైన ఓ కార్మికుడు సకాలంలో వైద్యం లభించక మృతిచెందాడు.
ఏదీ లింక్?
రాజధాని ఎక్స్‌ప్రెస్ కంటే ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నట్లు ప్రకటించి, 2003లో ప్రవేశపెట్టిన మల్టిమోడల్ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్ (ఎంఎంటీఎస్)కు ఇప్పటికీ సిటీ బస్సుతో లింకు లేదు. జంట నగరాల ప్రయాణికులకు ‘రైలు-బస్సు’ సదుపాయం అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ ప్రాజెక్టు లక్ష్యం నీరుగారుతోంది.
ప్రస్తుతం నగరంలో ఉన్న 26 ఎంఎంటీఎస్ స్టేషన్‌లలో సగానికి పైగా స్టేషన్‌లలో కనీసం రోడ్డు సదుపాయం లేదు. రైలు దిగిన ప్రయాణికులు ఆటో ఎక్కాలన్నా, బస్సు ఎక్కాలన్నా అసాధ్యంగానే ఉంది. ఫలక్‌నుమా, మలక్‌పేట్, లకిడికాఫూల్, నెక్లెస్ రోడ్డు, సికింద్రాబాద్, బేగంపేట్, హైటెక్ సిటీ వంటి కొన్ని స్టేషన్‌లకు రోడ్డు సదుపాయం ఉన్నప్పటికీ ఎంఎంటీఎస్ రాకపోకలకు అనుగుణంగా సిటీ బస్సులు అందుబాటులో ఉండడం లేదు.
ఫలక్‌నుమా, ఉప్పుగూడ, యాకుత్‌పురా, డబీర్‌పురా స్టేషన్ల నుంచి ఎంఎంటీఎస్‌తో పాటు దూర ప్రాంత రైళ్లూ రాకపోకలు సాగిస్తాయి. నిత్యం వేల సంఖ్యలో ఉద్యోగులు, విద్యార్థులు, వివిధ వర్గాల ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. కానీ ఈ స్టేషన్‌లకు అనుబంధ రోడ్డు, రవాణా సదుపాయాలు లేవు.
మంచినీరూ కరువే
హైటెక్ సిటీ, లింగంపల్లి వంటి వద్దీ ఎక్కువగా ఉండే స్టేషన్‌లలో మంచినీటి సదుపాయం కూడా లేకపోవడం అధికారుల బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం. ప్రయాణికులు తల దాచుకునేందుకు షెల్టర్లు కూడా లేవు.
పత్తా లేని టెర్మినళ్లు...
మల్కాజిగిరి, మౌలాలీ స్టేషన్‌లను విస్తరించి అతి పెద్ద ప్రయాణికుల టెర్మినళ్లుగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన చాలాకాలంగా పెండింగ్‌లోనే ఉంది. ఈ రెండు స్టేషన్‌లను విస్తరించేందుకు కావలసినంత స్థలం ఉంది. వీటిని అభివృద్ధి చేయడం వల్ల కాజీపేట్, నిజామాబాద్ వైపు నుంచి వచ్చే రైళ్లకు హాల్టింగ్ సదుపాయం లభిస్తుంది. సికింద్రాబాద్‌తో నిమిత్తం లేకుండా కొన్ని రైళ్లు నేరుగా కాచిగూడకు వెళ్తాయి. 2007 నుంచే ఈ ప్రతిపాదనలు ఉన్నప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు.
ఆదర్శ స్టేషన్‌గా ప్రకటించిన మల్కాజిగిరికి ఇప్పటికీ అప్రొచ్ రోడ్లు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు మౌలాలీ స్టేషన్ నుంచి నేరుగా బస్సు సదుపాయం లేదు. ఇందుకోసం ప్రయాణికులు ఒకటిన్నర కిలోమీటర్లు నడవాల్సి వస్తోంది. కొత్త రైళ్లకు డిమాండ్ జంట నగరాల నుంచి సుమారు 100 నుంచి 120 ప్రధాన రైళ్లు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. విశాఖ, తిరుపతి, బెంగళూరు, షిర్డీలకు మరిన్ని కొత్త రైళ్లు అవసరమనే డిమాండ్ ఉంది. కాచిగూడ నుంచి బెంగళూర్‌కు రెండు ఎక్స్‌ప్రెస్‌లు మాత్రమే ఉన్నాయి.
ఈ రూట్‌లో మరో 2 రైళ్లకు డిమాండ్ ఉంది. నగరం నుంచి షిర్డీ వెళ్లే భక్తులకు ప్రస్తుతం మన్మాడ్ ఎక్స్‌ప్రెస్ ఒక్కటే ఆధారం. ఇది కూడా నాగర్‌సోల్ వరకు వె ళ్తుంది. అక్కడి నుంచి షిర్డీకి రోడ్డు మార్గాన వెళ్లాల్సిందే. కాకినాడ నుంచి నేరుగా షిర్డీవరకు సాయినగర్ ఎక్స్‌ప్రెస్ ఉంది. ఇది వారానికి రెండు రోజులే నడుస్తుండడం గమనార్హం. వరంగల్, మిరియాలగూడ, మణుగూర్‌ల నుంచే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. మిగతా అన్ని జిల్లా కేంద్రాల నుంచి నగరానికి ఇంటర్ సిటీ సర్వీసులతో రైల్వే రవాణా సదుపాయాలను మెరుగుపర్చవలసిన అవసరం ఉంది.
కొత్త లైన్‌లు...
ప్రస్తుతం రూ.389 కోట్లతో వివిధ మార్గాల్లో ఎంఎంటీఎస్ రెండో దశ లైన్ల డబ్లింగ్, విద్యుదీకరణ పనులు చేపడుతున్నారు. అయితే ప్రస్తుతం నడుస్తున్న ఎంఎంటీఎస్ సర్వీసులకు ప్రత్యేక లైన్లు లేకపోవడం వల్ల అడుగడుగునా బ్రేకులు పడుతున్నాయి.శంకర్‌పల్లి-పగిడిపల్లి మధ్య బైపాస్ రైల్వే లైన్ నిర్మిస్తే గూడ్సు రైళ్లను ఆ దిశలో మళ్లించేందుకు అవకాశం లభిస్తుంది. సికింద్రాబాద్ మార్గంలో గూడ్సు రైళ్ల ఒత్తిడి తగ్గి ఎంఎంటీఎస్‌కు అవకాశాలు పెరుగుతాయి.