నవ్యాంధ్రలో గుంటూరు కీలకం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిపై ఏ మేరకు కరుణ చూపిస్తుందనే దానిపై ఇక్కడి ప్రజలు గంపెడాశతో ఎదురు చూస్తున్నారు.
సంగడిగుంట(గుంటూరు): నవ్యాంధ్రలో గుంటూరు కీలకం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిపై ఏ మేరకు కరుణ చూపిస్తుందనే దానిపై ఇక్కడి ప్రజలు గంపెడాశతో ఎదురు చూస్తున్నారు. గురువారం రైల్వే బడ్జెట్ ప్రవేశపెడుతున్నందున ఈ ప్రాంతానికి ప్రత్యేక వరాలు లభిస్తాయన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. గుంటూరు రైల్వే డివిజన్ ఏర్పడినప్పటి నుంచీ అరకొర నిధులతోనే సరిపెట్టుకుంటూ వచ్చింది.
ఈ డివిజన్ పరిధిలోని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నల్లగొండ జిల్లాల్లో చాలా ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి ఏమైనా కదలిక వస్తుందేమోనన్న ఆశతో ఇక్కడి ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సర్వే పూర్తి చేసిన గుంటూరు- గుంతకల్- ధర్మవరం రైలు మార్గం డబ్లింగ్ పూర్తయితే రాష్ట్ర రాజధాని నుంచి రాయలసీమకు ప్రయాణం కనీసం 2 గంటలు తగ్గనుంది.
ఈ ప్రాజెక్ట్ పూర్తికి ఏ మేరకు నిధులు కేటాయిస్తారో వేచి చూడాలి. సర్వే కొనసాగుతున్న నడికుడి - శ్రీకాళహస్తి మధ్య రైల్వే లైను అందుబాటులోకి వస్తే గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దులను కలుపుతూ ప్రయాణ దూరం తగ్గవచ్చు. అంతే కాకుండా ప్రధాన రైలు మార్గంలో ఉన్న విజయవాడ, నెల్లూరు స్టేషన్లపై ఒత్తిడి తగ్గనుంది. నిత్యం వెయిటింగ్ లిస్ట్‌లతో ప్రయాణిస్తున్న అన్ని రైళ్లల్లో అదనపు బోగీలను, సాధారణ బోగీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
గుంటూరు నుంచి పక్కరాష్ట్రాల రాజధాని కేంద్రాలైన చెన్నై, భువనేశ్వర్, హైదరాబాద్, ముంబయిలతోపాటు దేశ రాజధాని ఢిల్లీకి రైళ్లు నడపాల్సి ఉంది. గుంటూరు జిల్లా మీదుగా ప్రయాణిస్తూ గుంటూరు స్టేషన్‌కు రాని అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్ళను గుంటూరు మీదుగా నడపాల్సిఉంది. గుంటూరు నగరంలోని డొంకరోడ్ మూడు వంతెనల వెడల్పు, నందివెలుగు రోడ్ మణిహోటల్ సెంటర్ గేటువద్ద, శ్యామలానగర్ రైల్వే గేటు వద్ద ఆర్‌యూబీలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సి ఉంది. విజయవాడ నుండి విశాఖకు నడుస్తున్న రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలును గుంటూరు నుంచి నడిపితే గుంటూరు నుంచి విశాఖ వరకు పగటిపూట సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాటులోకి రానుంది. గుంటూరు నుంచి బయలుదేరి రింగ్‌లైన్‌గా నరసరావుపేట, సత్తెనపల్లి, అమరావతి, తుళ్లూరు, మంగళగిరి, తెనాలి మీదుగా గుంటూరుకు చేరుకునే విధంగా ప్రత్యేక నూతన మార్గాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. ఇప్పటివరకు ఢిల్లీ స్టేషన్‌లో అందుబాటులో ఉంచిన ‘వైఫై’ సదుపాయం అన్ని స్టేషన్లకు విస్తరించి మెరుగైన సేవలను అందించాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. గుంటూరు డివిజన్‌ను అభివృద్ధి చేసి రాజధానికి దగ్గరలో జోన్‌కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ముఖ్యమంత్రికి జోన్ జనరల్ మేనేజర్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. వీటిపై ఈ బడ్జెట్‌లో ఏ మేరకు కేటాయింపులు ఉంటాయో వేచి చూడాలి.