సబర్బన్‌కు గ్రీన్ సిగ్నల్ పడేనా?
రైల్వే బడ్జెట్‌పై అందరి చూపు
సబర్బన్ ఏర్పాటైతే ట్రాఫిక్ సమస్యలకు చెక్
బెంగళూరు: ట్రాఫిక్ కష్టాలను తీర్చడంతో పాటు బెంగళూరుకు దగ్గరగా ఉన్న పట్టణాలను కలుపుతూ నిర్మించే సబర్బన్ రైలుకు నేడు కేంద్రం ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్‌లో మోక్షం దక్కక పోతుందా అని నగర ప్రజలతో పాటు ప్రభుత్వం ఆశగా ఎదురు చూస్తోంది. ఒకవేళ అదే జరిగితే దశాబ్ధకాలం నాటి ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. రూ.9వేల కోట్ల వ్యయం కాగల ఈ బృహత్ ప్రాజెక్టును మూడు దశల్లో పూర్తి కానుంది. బెంగళూరుకు దగ్గరగా ఉన్న ద్వితీయ స్థాయి నగరాలు, పట్టణాల నుంచి నిత్యం ఉద్యోగ, వ్యాపార, ఉపాధి నిమిత్తం 12 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నట్ల్లు పట్టణాభివద్ధి శాఖ గణాంకాలు చెబుతున్నాయి. వీరు ప్రధానంగా సొంతవాహనాలు, లేదా బస్సుల ద్వారా బెంగళూరుకు వస్తుంటారు. రానున్న పదేళ్ల్లలో ఇది మరింతగా పెరిగి ట్రాఫిక్ సమస్య రెట్టింపు అవుతుంది. ఈ సమస్యను పరిష్కరించే దిశగా బెంగళూరుకు 100 కిలోమీటర్ల పరిధిలోని ఏడు జిల్లా కేంద్రాలను, వాటి మధ్య ఉన్న 23 చిన్నచిన్న నగరాలు, పట్టణాలను కలుపుతూ రైలు వ్యవస్థను ఏర్పాటు చేయనుంది.
ప్రాజెక్టులో భాగంగా మొత్తం 440 కిలోమీటర్ల రైలు మార్గం అందుబాటులోకి వస్తుంది. రూ.3,400 కోట్లు ఖర్చుకాగల మొదటి దశలో బెంగళూరు-చిక్కబళ్లాపుర,దొడ్డబళ్లాపుర, రెండోవిడతలోరూ.2,300 కోట్ల నిధులతో బెంగళూరు-రామనగర,మండ్యా, రూ.1,300 కోట్లు ఖర్చుతో మూడో విడతలో బెంగళూరు-బంగారుపేట మధ్యలో ఉన్న అన్ని చిన్నచిన్న నగరాలకు రైలు సౌకర్యం కల్పిస్తారు. మెట్రోతో పోలిస్తే ఈ నూతన ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు తక్కువ. మెట్రోకు కిలోమీటరుకు సగటున రూ.300 కోట్లు ఖర్చవుతుంది. నూతన ప్రాజెక్టులో కిలోమీటరుకు అయ్యే ఖర్చు రూ. 18 కోట్లు మాత్రమే. నూతన ప్రాజెక్టుకు కొత్తగా భూమిని సేకరించాల్సిన అవసరం లేదు.
ఆధునికత సాంకేతిక పరిజ్ఞానంతో పాటు మానవ వనరులను పెంచితే సరిపోతుంది.