ఇదేంటి ప్రభూ? | Free Wi-Fi services to the railway station in Khammam | Sakshi
Sakshi News home page

ఇదేంటి ప్రభూ?

Published Fri, Feb 27 2015 3:26 AM | Last Updated on Sat, Sep 2 2017 9:58 PM

Free Wi-Fi services to the railway station in Khammam

ఆశలు ఆవిరయ్యూయి. కేంద్ర రైల్వేబడ్జెట్‌లో ఎప్పటిలాగే జిల్లాకు అన్యాయం జరిగింది. ప్రభుత్వం మారినా అదే మొండిచేయి ఎదురైంది. ఎంతగా వేడుకున్నా రైల్వేమంత్రి సురేశ్‌ప్రభు కనికరించలేదు. భద్రాచలం- కొవ్వూరు లైన్‌కు ఎప్పటిలాగే ఎర్రజెండా చూపారు. గతంలో వచ్చి వెనక్కి మళ్లిన రూ.25 కోట్ల భూసేకరణ నిధులతోనే సరిపెట్టారు. పాండురంగాపురం- సారపాక ప్రస్థావనే లేదు.

కొత్తగూడెం - సత్తుపల్లి లైన్ ఊసే లేదు. ఏ గ్రేడ్‌స్థాయిలో ఉన్న ఖమ్మం రైల్వేస్టేషన్‌కు ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి రావడం.. కాజీపేట- విజయవాడ మూడోలైన్ ముచ్చట తీర్చటం మాత్రమే ఊరట.

 
కేంద్రంపై ఒత్తిడి తెస్తా..
రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు జరిగిన అన్యాయంపై ప్రధానమంత్రిని కలుస్తా. ప్రధాన ప్రాజెక్టు అయిన భద్రాచలం - కొవ్వూరు లైన్‌కు నిధులు కేటాయించడంలో కేంద్రం వివక్ష చూపడం తగదు. జిల్లా ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఈ లైన్ నిర్మాణం కోసం ఎదురుచూస్తున్నారు. ఇది జరిగితే గిరిజన జీవితాల్లో మార్పులు వస్తాయి. కానీ కేంద్రం పట్టించుకోవడం లేదు. కేవలం సర్వేలు, భూ సేకరణతో కేంద్రం ఈలైన్ విషయంలో కాలయాపన చేస్తోంది.

మణుగూరు - రామగుండం, కొత్తగూడెం- సత్తుపల్లి లైన్‌కు భారీగా నిధులు కేటాయించాలని కోరుతూ బడ్జెట్ సమావేశాలు ముగిసేలోపు ప్రధానమంత్రిని కలిసి విన్నవిస్తా. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ బడ్జెట్ లేదు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం నిధులు కేటాయించాలి.
 - పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధ్యక్షులు
 
- నిరాశాజనకంగా కేంద్ర రైల్వేబడ్జెట్
- జిల్లాకు తీరని అన్యాయం
- కేవలం భద్రాచలం లైన్‌కు రూ.25 కోట్లు
- ఖమ్మం స్టేషన్‌కు ఉచిత వైఫై సేవలు
- వీటితోనే సరిపుచ్చిన కేంద్ర ప్రభుత్వం

సాక్షి, ఖమ్మం: రైల్వే బడ్జెట్‌లో జిల్లా ప్రజల ఆశలపై ఎన్డీఏ ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా మొండిచేయి చూపింది. దక్షిణ మధ్య రైల్వేకు గతంలో కన్నా 24 శాతం అధికంగా నిధులు కేటాయించినా.. జిల్లా విషయానికొస్తే మాత్రం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కేవలం భద్రాచలం - కొవ్వూరు రైల్వేలైన్‌కు రూ.25 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది.
 
పార్లమెంట్‌లో రైల్వే బడ్జెట్ అనగానే జిల్లా ప్రజలు ఆశించేది.. భద్రాచలం-కొవ్వూరు లైన్‌కు నిధులు కేటాయించాలని. కానీ, గత ప్రభుత్వాల మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా ఈ లైన్ విషయంలో రిక్తహస్తం చూపించింది. నిధులు లేక  ఈ లైన్ నిర్మాణ పనులు ప్రారంభానికి నోచుకోలేదు. కనీసం భూసేకరణకు కూడా నిధులు కేటారుుంచకపోవటం గమనార్హం.  గత బడ్జెట్‌లో రూ.21 కోట్లు భూసేకరణకు కేటాయిస్తే ఇవి ఇప్పటి వరకు ఖర్చు చేయకపోవడంతో మురిగిపోయాయి.

ఇప్పుడు మళ్లీ భూ సేకరణకు కేవలం రూ.25 కోట్లు కేటాయించి కేంద్రంపై జిల్లా ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసింది. జిల్లా ప్రజల ఆందోళనను కేంద్రం పెడచెవిన పెట్టింది. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని బడ్జెట్‌లో గొప్పలు చెప్పిన ప్రభుత్వం కనీసం పెండింగ్ లో ఉన్న లైన్ల విషయంలోనూ కనికరం చూపలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లాకే తీవ్ర అన్యాయం జరిగింది. దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం లైన్‌కు కేంద్రం తప్పకుండా భారీ ఎత్తున నిధులు కేటాయిస్తుందని ఈ ప్రాంతవాసులు ఆశించారు. కానీ ఈ లైన్‌పై చిన్నచూపు చూసిన కేంద్రం తీరుపై గిరిజనులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

ఇక మణుగూరు - రామగుండం లైన్‌ను సర్వేకే పరిమితం చేసింది. పాండురంగాపురం- సారపాక, కొత్తగూడెం - సత్తుపల్లి లైన్ల ఊసే లేదు. జిల్లా నుంచి సింగరేణి గనుల ద్వారా కేంద్ర రైల్వే శాఖకు భారీగా ఆదాయం వస్తున్నా కనీసం బడ్జెట్‌లో ఈలైన్లను ప్రస్తావించకపోడం శోచనీయం. దేశ వ్యాప్తంగా ఏ గ్రేడ్ స్టేషన్లకు బడ్జెట్‌లో ఉచిత వైఫై సేవలను ప్రకటించింది. దీనిలో భాగంగా జిల్లాలో ఏ గ్రేడ్ స్థాయిలో ఉన్న ఖమ్మం స్టేషన్‌లో మాత్ర మే వైఫైసేవలు అందుబాటులోకి రానున్నాయి.
 
జిల్లాలోనూ మూడు లైన్లు
కాజీపేట - విజయవాడ మధ్య మూడో లైన్‌కు బడ్జెట్‌లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  కాజీపేట నుంచి ఖమ్మం మీదుగా విజయవాడకు 218 కిలో మీటర్ల దూరం. ప్రస్తుతం ఉన్న రెండు లైన్లతో ఈ మార్గంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. క్రాసింగ్‌లతో గంటల కొద్దీ ప్రయాణం ఆలస్యమవుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మూడో లైన్ నిర్మాణానికి ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. మూడో లైన్ నిర్మాణం జిల్లాలోని ప్రయాణికులకు కొంతమేరకు ఊరట కలిగించనుంది.
 
సర్వేలకు అత్తెసరు నిధులు
కొత్తగూడెం నుంచి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లా కిరణ్‌డోల్ (బైలడిల్లా) వరకు 180 కిలోమీటర్ల మేరకు కొత్తలైన్ సర్వేకు ఈ బడ్జెట్‌లో రూ.24.94 లక్షలు కేటాయించారు. పారిశ్రామిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఈ లైన్ సర్వేకు నిధులు కేటాయించింది. కిరణ్‌డోల్, బైలాడిల్లాలోని ఇనుప ఖనిజం, బొగ్గు కొత్తగూడెం మీదుగా రాష్ట్రానికి.. ఇక్కడి నుంచి అక్కడి ఈ ఖనిజాలను తరలించే వీలుగా ఈ లైన్ నిర్మాణానికి కేంద్రం సంకల్పించింది.
 మణుగూరు నుంచి రామగుండం లైన్ ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉంది. గత బడ్జెట్‌లో ఈ లైన్ సర్వే కోసం రూ.3 కోట్లను కేంద్రం కేటాయించింది. ప్రస్తుతం ఈలైన్ 200 కి.మీ సర్వే కోసం రూ.50 లక్షలు మంజూరు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement